లిడ్ క్యాప్ సమగ్రాభివృద్ధికి ప్రతిపాదనలు
• వారం రోజుల్లోపుగా సిద్ధం చేయండి
• ఆస్తులు నిరుపయోగం కాకుండా చూడండి
• మంత్రి మేరుగు నాగార్జున
అమరావతి, జూలై 20 (ప్రజా అమరావతి): వారం రోజుల్లోపుగా ఆంధ్రప్రదేశ్ చర్మపరిశ్రమాభివృద్ధి సంస్థ (లిడ్ క్యాప్) సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా లిడ్ క్యాప్ కు సంబంధించిన భూములు, ఆస్తులకు సంబంధించిన వివరాలతో పాటుగా వాటన్నింటినీ ఉపయోగంలోకి తేవడానికి ఉన్న అవకాశాలను కూడా ప్రతిపాదనల్లో పొందుపర్చాలని కోరారు.
బుధవారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో లిడ్ క్యాప్ అధికారులతో నాగార్జున సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో లిడ్ క్యాప్ కు ఉన్న భూములు, భవనాలలో ఇదివరకు నిర్వహించిన కార్యక్రమాలపై తనకు పూర్తి నివేదిక కావాలని కోరారు. ఇది వరకు ఎక్కడ ఏ కార్యక్రమాలను నిర్వహించారో, ఆ తర్వాత ఏ కారణంగా వాటిని నిలిపివేసారో తనకు తెలపాలని, ఇప్పుడు ఉన్న భూములు భవనాల్లో ఏ కార్యక్రమాలను చేపట్టడానికి అవకాశం ఉంది, అందుకు అవసరమైన నిధులను గురించి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ విషయంలో ఏ అంశాన్ని కూడా విస్మరించకూడదని స్పష్టం చేసారు. రాష్ట్రంలో ఉన్న లిడ్ క్యాప్ ఆస్తులు నిరుపయోగం గా మిగిలిపోకుండా, అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విజయవాడ నగరం నడిబొడ్డున లిడ్ క్యాప్ కు ఉన్న విలువైన భూమిలో ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనే విషయంగా కూడా ఒక నిర్ణయానికి రావాలని కోరారు. లిడ్ క్యాప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్మకారులకు, డప్పు కళాకారులకు అవసరమైన సాయం అందించేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో చర్మకారులను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్టీసీ బస్టాండుల్లో చర్మకార ఉత్పత్తులను విక్రయించుకొనే దుకాణాలకు పూర్తి ఉచితంగా లేదా నామ మాత్రపు అద్దెతో దుకాణాలను కేటాయించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా నాగార్జున హామీ ఇచ్చారు. లిడ్ క్యాప్ ను అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రతిపాదనలన్నింటినీ వారం రోజుల్లోపుగా సిద్ధం చేయాలని, వచ్చే వారంలో మరో సమావేశాన్ని నిర్వహించి ఈ ప్రతిపాదన్నింటినీ పరిశీలించి వాటిని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. లిడ్ క్యాప్ అభివృద్ధి కోసం అవసరమైతే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని కూడా కలిసి ఆయన సహాయాన్ని కూడా కోరుతామని నాగార్జున పేర్కొన్నారు. ఈ సమావేశంలో లిడ్ క్యాప్ వీసీ ఎండీ డోలా శంకర్, జనరల్ మేనేజర్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment