• *2022-23 సంవత్సరానికి వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా అర్హులైన వారికి ఆర్థికసాయం*
• *వాహనముల ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ మరియు మరమ్మత్తుల నిమిత్తం నగదు సాయం*
• *జులై 13న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు ఆర్థికసాయం పంపిణీ*
• *క్రొత్తగా వాహనాలు కొన్నవారు దరఖాస్తు చేసుకుంటే వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి అర్హులే*
- *రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ పి.రాజబాబు*
విజయవాడ, 4 జులై (ప్రజా అమరావతి): 2022-23 సంవత్సరానికి గానూ వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా అర్హులైన సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్ లకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ పి.రాజబాబు ఒక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జులై 13, 2022న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు ఆర్థిక సాయం పంపిణీ ఉంటుందని వెల్లడించారు. వాహనముల ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ మరియు మరమ్మత్తుల నిమిత్తం అందించే ఈ నగదు సాయం కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు జులై 7, 2021 వరకు పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమైనదని వెల్లడించారు.
లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ఆరంచెల విధానంలో పారదర్శకంగా జరుగుతుందన్నారు. దరఖాస్తుదారు తనకు సంబంధించిన భూమి, ఆస్థి వివరాలు, ఆస్థి పన్ను కట్టిన వివరాలు, విద్యుత్ వినియోగం, ఆదాయపన్ను, కులానికి సంబంధించిన వివరాలు తెలియపరచాల్సి ఉంటుందని వెల్లడించారు. వాహన యజమాని హక్కులు మార్పు చేసిన వారి జాబితాను అనర్హులుగా పరిగణిస్తామన్నారు. ప్రస్తుతం క్రొత్తగా వాహనాలు కొన్నవారు కూడా వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి అర్హులే అని ఆయన పేర్కొన్నారు.
నూతన లబ్దిదారులు జులై7వ తేదీ లోగా తమ దరఖాస్తులను గ్రామ సచివాలయంలో సమర్పించాలని సూచించారు. క్రొత్తగా దరఖాస్తు చేసుకునే వారు తమ అర్హతలను సూచించే డాక్యుమెంట్ల ఆధారంగా పరిశీలన చేసి యజమాని మరియు డ్రైవర్ గా నిర్ణయించడం జరుగుతుందన్నారు. 6 పద్ధతుల్లో ధృవీకరించిన అనంతరం తాత్కాలిక అర్హుల జాబితా పొందుపరచడం జరుగుతుందన్నారు. దరఖాస్తుల ప్రక్రియ పరిశీలన, అప్ లోడ్ చేసిన అనంతరం ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ పరిధిలో 9వ తేదీలోగా దరఖాస్తులు ఆమోదించడం జరుగుతుందన్నారు. అనంతరం జులై 10వ తేదీన జిల్లా కలెక్టర్ దరఖాస్తులు ఆమోదించగానే 11, 12వ తేదీల్లో సీఎఫ్ఎస్ఎస్ ద్వారా సంబంధిత కార్పొరేషన్ల ద్వారా లబ్దిదారులకు నగదు చెల్లించే ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందన్నారు.
ఇప్పటికే వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఆర్థిక సాయం పొందుతున్నవారు వాహనంతో నిలబడిన ఫోటోను గ్రామ సచివాలయం ద్వారా అప్ లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.
దరఖాస్తుదారునికి సొంత వాహనంతో పాటు సంబంధిత రికార్డులు, లైసెన్స్ కలిగి అవి అమల్లో ఉండాలన్నారు. అదే విధంగా ఒక కుటుంబానికి ఒక వాహనానికి మాత్రమే ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. వాహనదారులు ఆధార్ కార్డుతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలని తెలిపారు. దరఖాస్తు దారు విద్యుత్ వినియోగం 6 నెలల సగటు మీద నెలసరి 300 యూనిట్లు దాటితే పథకానికి అనర్హులుగా ప్రకటిస్తామన్నారు. విద్యుత్ వినియోగం విషయంలో సచివాలయంలో ఉంచిన మీటర్ వివరాలు తప్పు అని భావిస్తే సరైన మీటర్ వివరాలు అందిస్తే పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఒకవేళ కొన్ని ఇళ్లకు కలిపి ఒకే మీటర్ ఉంటే ఆయా ఇండ్ల సంఖ్య ఆధారంగా ఒక ఇంటికి విద్యుత్ వినియోగం ఎంత అవుతుందో సరాసరి నిర్ణయించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా అర్హులైన ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్ లు మిగిలిపోయి ఉంటే వారు తమ తమ పరిధిలోని గ్రామ /వార్డు సచివాలయాల్లో అర్హతను సూచించే అవసరమైన అన్ని పత్రాలు సమర్పించి, దరఖాస్తు చేసుకొని వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైనప్పటికీ సాయం అందనివారి ఫిర్యాదులను నమోదు చేసుకొని వారి డాక్యుమెంట్ల ఆధారంగా పరిశీలించిన పిమ్మట అర్హులుగా తేలితే సాయం అందజేయబడుతుందని రవాణా కమిషనర్ పి.రాజబాబు ప్రకటనలో తెలిపారు.
addComments
Post a Comment