ఒకపక్క అభివృద్ధి, మరోపక్క సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ అనేక కార్యక్రమాలను చేపడుతున్నాము


నెల్లూరు, జూలై 28 (ప్రజా అమరావతి): వచ్చామా... వెళ్లామా అనే పద్ధతి కాకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 

 గురువారం సాయంత్రం వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాలెంలో రెండో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ప్రతి గడపకు వెళ్లి వారు పొందిన సంక్షేమ పథకాలను వివరించి, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఒకపక్క అభివృద్ధి, మరోపక్క సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ అనేక కార్యక్రమాలను చేపడుతున్నామ


ని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని సచివాలయాల వారీగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుందని, ఏ ఇంటికి వెళ్లిన ప్రజలు తాము పొందిన సంక్షేమ పథకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. సాంకేతిక కారణాలతో అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి కూడా అందించేందుకు, గ్రామంలోని సమస్యలు పరిష్కారం చేయడమే గడపగడపకు మన ప్రభుత్వం  కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అన్నారు. గ్రామాలకు అవసరమైన రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక సదుపాయాలను గుర్తించి, ఆ పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 


ఒక ఇంటికి 6 సంక్షేమ పథకాలు

.......................................

గుడ్లూరు వారి పాలెం గ్రామంలో మాచవరం ఇంద్రజ అనే మహిళ తమ ఇంటికి జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల్లో 6 సంక్షేమ పథకాలు అందాయని మంత్రితో తన ఆనందాన్ని పంచుకుంది. ముఖ్యంగా తన భర్త మాలకొండయ్య గ్రామంలో బార్బర్ షాపు నిర్వహిస్తున్నాడని, ఆయనకు కడుపునొప్పితో ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు, వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం తన భర్త ప్రాణాలను కాపాడిందని ఆమె భావోద్వేగంతో చెప్పారు. తమకు జగనన్న మూడేళ్ల పాలనలో ఇప్పటివరకు వైయస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా రూ. 13,375, జగనన్న చేదోడు ద్వారా రూ. 20 వేలు, వైయస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 94,335, పొదుపు కు సంబంధించి సున్నా వడ్డీ ద్వారా రూ. 6,137, వైయస్సార్ ఆసరా ద్వారా రూ. 25,194, అమ్మఒడి ద్వారా రూ. 42 వేలు మొత్తం రూ. 2,01,041 లబ్ధి పొందినట్లు చాలా సంతోషంగా చెప్పారు. మా లాంటి పేదలకు అండగా నిలుస్తున్న జగనన్నే మాకు ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది.


నాడు నేడు పనులకు శంకుస్థాపన

..........................................

  గుడ్లూరివారిపాలెం గ్రామంలోని జడ్పీ పాఠశాలలో  66 లక్షల రూపాయలతో నాడు నేడు పథకం రెండో విడత కింద చేపట్టనున్న రెండు అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక సదుపాయాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంత్రికి పూల జల్లులతో స్వాగతం పలికారు. చిన్నారుల ఆంగ్ల ప్రసంగాలకు ముగ్ధుడైన మంత్రి వారిని ప్రత్యేకంగా అభినందించారు. చిన్నారులు ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడటం చూసి, వీరు మన ఊరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులా.. అని గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. 

 ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు  శ్రీమతి పెయ్యల  సుమలత, సర్పంచ్ శ్రీమతి అలగల ప్రభావతీ, తహశీల్దార్ శ్రీ నాగరాజు,  ఎం.పి.డి.ఓ శ్రీమతి సుస్మితా రెడ్డి, వివిధ శాఖల మండల అధికారులు, ప్రజా ప్రతినిధిలు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Comments