*పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ప్రశంసల జల్లు*
*ఈవోడీబీ 2020 ర్యాంకింగ్స్ లో ఏపీని అగ్రగామిగా నిలపడంపై సీఎం అభినందన*
*ఇదే కృషిని కొనసాగించాలన్న ముఖ్యమంత్రి : ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది*
అమరావతి, జూలై, 05 (ప్రజా అమరావతి): సులభతర వాణిజ్య రాష్ట్రాల ర్యాంకింగ్స్ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ -ఈవోడీబీ)లో ఆంధ్రప్రదేశ్ ని మొదటి స్థానంలో నిలిపిన పరిశ్రమల శాఖ ఉన్నతాధికారుల కృషిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించినట్లు ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది వెల్లడించారు. పూర్తి స్థాయి సర్వే ఆధారంగా 97.89 శాతంతో వరుసగా రెండో ఏడాది, 2020 ఈవోడీబీ ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలపడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే కృషిని, స్ఫూర్తిని మరింత కొనసాగించాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఈడీబీ సీఈవో , ఏపీఐఐసీ వీసీ, ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, పరిశ్రమల శాఖలో వస్త్ర విభాగం చేనేత ముఖ్యకార్యదర్శి కె.సునీత తదితర ఉన్నతాధికారుల బృందాన్ని ముఖ్యమంత్రి మెచ్చుకున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన విజన్ మేరకు ఆయా రంగాలలో గల అవకాశాలకు ప్రాధాన్యతనిస్తూ మరింత రాణించేందుకు కృషి చేస్తామని సీఈవో తెలిపారు. మంగళవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో వీరంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు.
addComments
Post a Comment