నెల్లూరు, జూలై 6 (ప్రజా అమరావతి): ప్రజాప్రతినిధుల సహకారం, అధికారుల సమన్వయంతో అన్ని రంగాల్లో నెల్లూరును మోడల్ జిల్లాగా అభివృద్ధి చేసేందుకు కృషి
చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబుతో కలిసి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, నాడు నేడు, జగనన్న ఇళ్ల నిర్మాణాలు, ఉపాధి హామీ పనులు, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి రహదారులు మొదలైన అంశాలపై శాఖల వారీగా పురోగతిని మంత్రి సమీక్షించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యావ్యవస్థలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని, ఆ సత్పలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా తల్లిదండ్రులకు భారం కాకుండా ఉచితంగా విద్యార్థులకు అవసరమైన మూడు జతల యూనిఫామ్, బ్యాగ్, నోట్, పాఠ్య పుస్తకాలు, బూట్లు, టై, డిక్షనరీ మొదలైన ఎనిమిది రకాల సామగ్రి కలిపి ఒక కిట్టు గా అందజేస్తున్నట్లు చెప్పారు. అలాగే నాడు నేడు పథకం కింద ఎవరూ ఊహించని విధంగా పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని, జిల్లాలో మొదటి విడతలో 828 పాఠశాలల్లో రూ. 165 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తిచేశామని, రెండో విడతలో 1131 పాఠశాలల్లో రూ. 360 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు మొదలు పెట్టేందుకు ఆయా ఇంజనీరింగ్ శాఖల అధికారులు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అమ్మ ఒడి పథకం ఓ చారిత్రాత్మక నిర్ణయం గా మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది అమ్మ ఒడి పథకం చాలా మందికి అందలేదని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, అమ్మఒడి పథకానికి నిర్దిష్టమైన నిబంధనలను ముందు నుంచే ప్రభుత్వం చెబుతోందని, అన్ని అర్హతలూ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం అందించామని, పలు సాంకేతిక కారణాలతో అర్హత ఉండి కూడా కొందరికి అందలేదని, వారి దరఖాస్తులను పరిశీలించి అమ్మఒడి సాయం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు కూడా విద్యార్థుల ఉన్నత చదువులకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వాలు కూడా చేయని విధంగా విద్యా వ్యవస్థలో అనేక నూతన సంస్కరణలకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కొనియాడారు.
జిల్లాలో రూ. 162 కోట్లతో ఆర్ అండ్ బి రహదారుల పనులు వేగంగా జరుగుతున్నాయని, మరో రెండు నెలల్లో ఈ పనులన్నీ పూర్తవుతాయని, పంచాయతీ రాజ్ రహదారులకు సంబంధించి 199 రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ. 160.70 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా, త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెట్టేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ప్రభుత్వ భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని, గతంలో సిమెంట్ రోడ్లు, కాలువల పెండింగ్ బిల్లులకు నగదు చెల్లింపులు మొదలయ్యాయన్నారు. అలాగే నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు పథకంలో జిల్లాకు మంజూరైన సుమారు 58 వేల జగనన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు, లేఅవుట్లలో అన్ని మౌలిక వసతులు సమకూర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
సమావేశానికి హాజరైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సూచించిన సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ కూర్మనాథ్, మున్సిపల్ కమిషనర్ జాహ్నవి, డి ఆర్ ఓ శ్రీమతి వెంకట నారాయణమ్మ, జడ్పీ సీఈవో శ్రీమతి వాణి, నెల్లూరు, కందుకూరు, ఆత్మకూరు ఆర్డివోలు శ్రీ పి కొండయ్య, శ్రీ సుబ్బారెడ్డి, శ్రీ బాపి రెడ్డి, సమగ్ర శిక్ష ఏపీసి శ్రీమతి ఉషారాణి, డీఈవో శ్రీ పి రమేష్, డ్వామా, హౌసింగ్ పీడీలు శ్రీ తిరుపతయ్య, శ్రీ నరసింహ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు సుబ్రహ్మణ్యం, శ్రీ రామాంజనేయులు, శ్రీరంగ వరప్రసాద్, సోషల్ వెల్ఫేర్ డిడి శ్రీమతి రమాదేవి, ఎన్ డి సి సి బ్యాంకు చైర్మన్ శ్రీ కామిరెడ్డి సత్యనారాయణ, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కిషోర్ సింగ్, తదితర జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment