బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం వాయిదా


*బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం వాయిదా*

రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, జూలై 22 (ప్రజా అమరావతి): భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌), మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఎంటీఎన్‌ఎల్‌) విలీనం ప్రతిపాదనను ప్రభుత్వం వాయిదా వేసినట్లు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసింహ్ చౌహాన్‌ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ను పునరుద్ధరించే ప్రణాళికలో భాగంగా ఈ రెండు ప్రభుత్వరంగ సంస్థలను విలీనం చేసే ప్రతిపాదనకు 2019లో ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.

అయితే ఎంటీఎన్‌ఎల్‌ భారీగా రుణాల ఊబిలో కూరుకుపోయింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉంది. ఎంటీఎన్‌ఎల్‌ 2016 నుంచి వరసగా ప్రతి ఏటా నష్టాలను ఎదుర్కొంటోంది. 2020-21లో ఎంటీఎన్‌ఎల్‌కు 2.454 కోట్లు, 2021-22లో 2,617 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ నేపధ్యంలో ఎంటీఎన్‌ఎల్‌ రుణ భారం నుంచి కుదుటపడే వరకు విలీనం ప్రతిపాదనను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి తెలిపారు. అయితే ఎంటీఎన్‌ఎల్‌ను ప్రైవేటుపరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.

---------------------------------------------------


*కొత్త అవతారంలో నిషేధిత యాప్‌లు ప్రత్యక్షం*

న్యూఢిల్లీ, జూలై 22: ప్రభుత్వం నిషేధించిన యాప్‌లు కొత్త అవతారంలో మళ్ళీ ప్రత్యక్షమవుతున్న విషయం వాస్తవమేనని ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ బ్లాక్‌ చేసిన యాప్‌లు పేర్లు మార్చుకుని కొత్త అవతారంలో మళ్ళీ ప్రత్యక్షమవుతున్నట్లు తమ మంత్రిత్వ శాఖకు నివేదికలు, ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ఫిర్యాదులను తదుపరి పరిశీలన కోసం తాము హోం మంత్రిత్వ శాఖకు పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన యాప్‌లను బ్లాక్‌ చేయాల్సిందిగా తమ మంత్రిత్వ శాఖ థర్డ్‌ పార్టీ యాప్‌ స్టోర్స్‌ అయిన గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ స్టోర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే నిషేధిత యాప్‌లకు సంబంధించిన ఐపీ అడ్రస్‌లను బ్లాక్‌ చేయవలసిందిగా టెలికమ్యూనికేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇస్తున్నట్లు వెల్లడించారు.


Comments