సమష్టి కృషితో అక్రమ రవాణాను అరికడదాం... - మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ

 సమష్టి కృషితో అక్రమ రవాణాను అరికడదాం...

- మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ



విశాఖపట్నం (ప్రజా అమరావతి);

రాష్ట్రంలో బాలికలు మహిళల అక్రమ రవాణా నిరోధానికి ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోందని అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాల్లో సి.ఐ. స్థాయిలో యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటుచేశారని అలాగే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో సైతం ఈ యూనిట్లు కార్యరూపం దాల్చినట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖపట్నం లోని వాస్తు ఇన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్, సిఐడి మరియు హెల్ప్ సంస్థలు సంయుక్తంగా అక్రమ రవాణా నిరోధక పోలీస్ యూనిట్లు, మరియు స్వచ్చంద సంస్థలు, మహిళ శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి ఒక్కరోజు  శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, మహిళలు బాలికలను అనేక రకాలైన అనైతిక కార్యక్రమాల ఊబి లోకి దించుతున్నారని.. ప్రభుత్వ పోలీసు యంత్రాంగాలు దృష్టి పెడుతున్నప్పటికీ, అందుబాటులో ఉన్న టెక్నాలజీ మహిళలకు, బాలికలకు పెద్ద ఎత్తున నష్టం కలుగజేసే విధంగా ఉందన్నారు. ఆన్ లైన్ వ్యభిచార ముఠాలలో కూడా మహిళలే పాత్రదారులవడం కూడా ఆందోళన కలిగించే విధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గుంటూరు లో జరిగిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కోవిడ్ తో తల్లి చనిపోయిన భాధలో ఉన్న బాలికకు ఎర వేసి, తండ్రిని ఆ బాలికకు ఉద్యోగం ఇప్పిస్తామని ఏమార్చి   నలుగురైదుగురు మహిళలు వివిధ స్థాయిల్లో హింసకు గురిచేసి బలవంతంగా వ్యభిచార కూపం లోకి దించిన సంఘటనలో పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఆ బాలికను రక్షించారని, నిందితులందర్నీఅదుపులోకి తీసుకున్నారని, సదరు బాలికకు మహిళా కమిషన్ చొరవతో ప్రభుత్వం నష్ట పరిహారాన్ని అందించడమే కాకుండా ఉద్యోగావకాశాన్నిసైతం భాదితురాలికి‌  అందక కల్పించడం జరిగిందన్నారు. కానీ ఇలాంటి నేరాలు పూర్తి స్థాయిలో బయటకు రావడంలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లాల్లోని ఏ.హెచ్.టి .యు. లకు అలాగే క్షేత్ర స్థాయిలో మహిళలతో పనిచేస్తున్న అంగన్వాడి, ఆశా వర్కర్లు అలాగే సి.డి.పి.ఓ లకు మానవ అక్రమ రవాణా నిరోధం పై శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు, అందులో భాగంగానే విశాఖపట్నం లో ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలియజేసారు. మహిళలు, బాలల అక్రమ రవాణా రోజు రోజు కీ కొత్త పోకడలతో ఒక పెను సవాలుగా మారిందనీ, దీని నిరోధానికి గాను అన్నీ ప్రభుత్వ యంత్రాంగాలు, మహిళా కమిషన్, బాల హక్కుల కమిషన్ అలాగే స్త్రీ, శిశు సంక్షేమ శాఖ లాంటివన్నీ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ శ్రీ కేసలి అప్పారావు  మాట్లాడుతూ రాష్ట్రం లో బాలల అక్రమ రవాణా రోజు రోజుకీ పెరుగుతుండడం, ముఖ్యంగా జాతీయ స్థాయిలో మానవ అక్రమ రవాణాకి సంబంధించి మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉండడం దురదృష్టకరం అన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యల కారణంగా గతంలో రెండవ స్థానంలో ఉన్న మన రాష్ట్రం ఇప్పుడు మూడవ స్థానం లోకి రావడం అభినందనీయం అన్నారు.

బాలల హక్కుల పరి రక్షణ కమిషన్, మహిళా కమిషన్ సహాయంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎవరైనా బాలుర లేదా బాలికల హక్కుల ఉల్లంఘనలకు పాల్పడితే అటువంటి వారిపై 24 గం. లలోనే చర్యలు తీసుకుని, కఠిన శిక్షలు పడేలా కృషి చేస్తోందన్నారు. హెల్ప్ కార్యదర్శి నిమ్మరాజు రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రం లో ఉమ్మడి 13 జిల్లాల్లో ఏ.హెచ్.టి.యు. లు ఏర్పాటు చేయడం అభినందనీయమని, అలాగే సి.ఐ.డి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మిగిలిన 13 కొత్త జిల్లాల్లో కూడా ఏ.హెచ్.టి.యు. ల ఏర్పాటుకై నిధులు అడగడం జరిగిందన్నారు.  రానున్న రెండు మూడు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ 26 జిల్లాల్లో కూడా ఏ.హెచ్.టి.యు. ల ఏర్పాటుకై అడిషనల్ డి.జీ.పి సునీల్ కుమార్, సి.ఐ.డి ఎస్పీ  సరిత గారు కృషి చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. 

ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ , గెడ్డం ఉమ,  రుకియా బేగం, దిశ పోలీసు స్టేషన్ ఏ సి పి ప్రేమకాజల్.. సీఐడీ కేంద్ర విభాగం డీఎస్పీ  మోహనరావు, మహిళ కమిషన్ కార్యదర్శి శైలజ, మహిళ శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్  చిన్మయి దేవి తదితరులు పాల్గొన్నారు.

Comments