గిరిజనుల అభ్యున్నతికై ప్రభుత్వ కృషి అభినందనీయం

 *గిరిజనుల అభ్యున్నతికై ప్రభుత్వ కృషి అభినందనీయం


*

   *రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు*

అమరావతి, జూలై 8 (ప్రజా అమరావతి): గిరిజనుల అభ్యున్నతికై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 4.26 లక్షల ఎకరాల అటవీ భూమిపై గిరిజనులకు హక్కులను కల్పించడం జరిగిందన్నారు. గురువారం అమరావతి సచివాలయంలో ఉద్యోగుల ఆత్మీయ మరియు అవగాహనా సదస్సు జరిగింది. ఈ సదస్సుకి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సచివాలయ ఉద్యోగులతో ఆత్మీయ మరియు అవగాహనా సదస్సు నిర్వహించుకోవడం ఎంతో ప్రశంసనీయమన్నారు.  రాష్ట్రంలో సుమారు 40 వేల మంది గిరిజన ఉద్యోగులు ఉన్నారని,  గిరిజన ఉద్యోగుల నియామకాలు, పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు బాధ్యతను కమిషన్ చూసుకుంటుందని, ఉద్యోగుల నియామక సమయంలో కుల నిర్థారణ కోసం జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు పర్చేలా మరియు బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీకై కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసే చర్యలను  కమిషన్ తీసుకుంటుదన్నారు. 

అయితే రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం, అభివృద్దికై గత మూడేళ్లుగా  ప్రభుత్వం అమలు చేస్తున్న పలు వినూత్న పథకాలను రాష్ట్రంలో 32 లక్షల మంది గిరిజనులు అందరికీ సక్రమంగా అందేలా చూడాల్సిన కీలక బాధ్యత గిరిజన ఉద్యోగులపై ఉందన్నారు. రాష్ట్రంలో గిరిజన విద్యకై ట్రైబల్  విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు గురుకులాలను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపర్చి తద్వారా మరణాల రేటును గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా గిరిజన వైద్య కళాశాలను పాడేరులో ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోనున్న ఆదివాసీలకు ఇళ్లు, త్రాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పించడం జరుగుచున్నదన్నారు. ఈ పనులన్నీ సకాలంలో పూర్తి అయ్యేలా ఉద్యోగులు తమ వంతు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన కోరారు.   

రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్, జంపరంగి లిల్లీ మరియు రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది అంతా ఈ సదస్సులో పాల్గొన్నారు.


Comments