ఘనంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు
మన్యం వీరునికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోలగట్ల, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
ప్రతి ఒక్క ఆంధ్రుడు గర్వించదగ్గ వ్యక్తి అల్లూరి : ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి
అల్లూరి స్ఫూర్తితో యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా కృషి : జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, జూలై 04 (ప్రజా అమరావతి): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు జిల్లా కేంద్రంలో ఏర్పాటైన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు సంఘాల ప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక దాసన్నపేట రింగురోడ్డులోని అల్లూరి విగ్రహం వద్ద సోమవారం ఏర్పాటైన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి, మేయర్ వి.విజయలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిప్యూటీ మేయర్‌లు కోలగట్ల శ్రావణి, రేవతీదేవి, జిల్లా అధికారులు, అల్లూరి సేవా సమితి ప్రతినిధులు, పలు సంఘాల నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తొలుత అల్లూరి చిత్రపటం వద్ద ఎమ్మెల్యే కోలగట్ల, జిల్లా కలెక్టర్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
💠ప్రతి ఆంధ్రుడూ గర్వించదగ్గ వ్యక్తి అల్లూరి : ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి
ప్రతి ఒక్క ఆంధ్రుడూ గర్వించదగ్గ వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. దేశానికి బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కల్పించేందుకు జరిగిన పోరాటంలో ఎందరో సమరయోధులు తమ ఆస్తులను, ప్రాణాలను జీవితాలను త్యాగం చేశారని, వారిలో అల్లూరి ఒకరని ఎమ్మెల్యే కోలగట్ల పేర్కొన్నారు. అతి చిన్నవయసులోనే పోరాటబాట పట్టి గిరిజనులను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సమాయత్తంచేసి బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన వ్యక్తిగా అల్లూరి దేశచరిత్రలో నిలిచివుంటారని చెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి వారు శాంతియుత పోరాటం చేస్తే, తుపాకీకి ఎదురొడ్డి నిలబడి వీరోచిత పోరాటం చేసి తన ప్రాణాలనే అర్పించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని పేర్కొంటూ భావితరాలు అల్లూరి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజహితం కోరి పనిచేయాలన్నారు. అల్లూరి మనతో సజీవంగా లేకపోయినా ఆయన ఆశయాలు, పోరాటస్ఫూర్తి ఎప్పటికీ నిలిచి వుంటాయన్నారు. అల్లూరి సేవాసమితి కోరిన మీదట మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా కలెక్టర్‌ల సహకారంతో నగరంలో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయగలిగినట్టు చెప్పారు. రానున్న రోజుల్లోనూ సేవాసమితి చేపట్టే కార్యక్రమాలకు పూర్తిసహకారం అందిస్తామన్నారు.
💠అల్లూరి స్ఫూర్తితో యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా కృషి : జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో జిల్లా యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా కృషిచేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి చెప్పారు. ఇంటర్ ఉత్తీర్ణులైన యువతీ యువకులను గ్రూపులుగా ఏర్పరచి వారిని మొబైల్, సోషల్ మీడియా అనే వ్యసనానికి బానిసలు కాకుండా వారి దృష్టి మరల్చి క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేలా తగిన శిక్షణలు ఇచ్చే అంశంపై దృష్టి సారించామన్నారు. అల్లూరి స్ఫూర్తితో యువత సమాజంలోని సామాజిక అన్యాయాలు, ఇతర సమస్యలపై పోరాడాలన్నారు. 25 ఏళ్ల వయసులో తనకు శత్రువు ఎవరు, ఎంతటి వాడనే భీతి లేకుండా తన ఆశయ సాధనకోసం ఎంతో ధైర్యంగా పోరాడిన వ్యక్తి అల్లూరి అని పేర్కొంటూ, యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. మన రాష్ట్రంలో గతంలో ఎక్కడ ఏకపాత్రాభినయం పోటీలు జరిగినా యువత అల్లూరి వేషధారణలో కనిపించేందుకు ఉత్సాహ పడుతుంటారని, ఆయన ప్రజల గుండెల్లో ఎన్నటికీ నిలిచి వుంటారని పేర్కొన్నారు. 125 ఏళ్ల తర్వాత కూడా ఆయనను స్మరించుకుంటున్నామని పేర్కొంటూ ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులని చెప్పారు.
💠ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌లు కోలగట్ల శ్రావణి, రేవతీదేవి, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, లోక్‌సత్తా అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, అల్లూరి సేవాసమితి అధ్యక్షులు కె.ఏ.పి.రాజు(శివ), ప్రతినిధులు సూర్యనారాయణ రాజు, వర్మ, రామరాజు, కె.ఆర్.కె.రాజు, మునిసిపల్ కమిషనర్ ఆర్.శ్రీరాములు నాయుడు, సెట్విజ్ సి.ఇ.ఓ. విజయ్ కుమార్, పర్యాటక అధికారి లక్ష్మీనారాయణ, సిపిఓ పి.బాలాజీ, నెహ్రూ యువకేంద్రం జిల్లా యువజన అధికారి విక్రమాదిత్య, ఎస్.ఎస్.ఎస్.ఎస్.రాజు, జనసేన నాయకులు ఆదాడ మోహనరావు, డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరక్టర్ కళ్యాణ చక్రవర్తి, మెప్మా పి.డి. సుధాకర్, జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు, పశుసంవర్ధక అధికారి బి.వి.రమణ, హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ప్రతినిధి కొండబాబు, పట్టణ పేదల సంక్షేమ సమితి ప్రతినిధి శ్రీనివాస్, బి.సి.కార్పొరేషన్ ఇ.డి. పెంటోజీరావు, వార్డు కార్పొరేటర్ గాదం మురళి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment