నెల్లూరు,జులై26 (ప్రజా అమరావతి):-- తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాల పూర్తి సహకారం అందించాల
ని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మానాధ్ అధికారులకు సూచించారు.
మంగళవారం సాయంత్రం నగరంలోని శ్రీ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం సమావేశ మందిరంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ కార్యక్రమం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఆగస్టు మాసం 14 నుండి 20వ తేదీ వరకు టిటిడి ఆధ్వర్యంలో నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందు కోసం గట్టి పోలీసు బందోబస్తు, పార్కింగ్, పారిశుద్ధ్యము, తాగునీటి సరఫరా, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా వంటి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు. ఉత్సవం జరిగే ప్రాంతంలో ప్రధాన రహదారిపై రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుందన్నారు. స్టేడియం మైదానం అంతా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. బారికేడింగ్ పక్కాగా చేయాలన్నారు.
అంతకు మునుపు రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓఎస్డి శ్రీ పెంచల్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు తమ విపిఆర్ ఫౌండేషన్ తరపున టీటీడీ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తిరుమలలో శ్రీవారికి జరిగే రోజువారి సేవలు జిల్లా ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు షెడ్లు, బారికేడింగ్, మంచినీటి వసతి తదితర అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లా యంత్రాంగం నుండి పోలీసు భద్రత ఏర్పాట్లు పార్కింగ్, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా అంబులెన్స్, అగ్నిమాపక యంత్రాలు సమకూర్చి అన్ని విధాల సహకారం అందించాలని కోరారు.
సమస్త ధార్మిక హిందూ ధార్మిక ప్రాజెక్టు కార్యక్రమ అధికారి శ్రీ ఎల్. విజయసారధి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ కార్యక్రమంలో భాగంగా వచ్చే ఆగస్టు మాసం 14, 15 తేదీల్లో ఉత్సవ విశేషాలను భక్తులకు తెలుపుతూ ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయన్నారు. అలాగే ఆగస్టు 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం శ్రీవారికి తొలి సేవ సుప్రభాతంతో మొదలై చివరగా ఏకాంత సేవతో ముగుస్తుందన్నారు. ప్రతిరోజు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ, వీధి ఉత్సవం ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆగస్టు 16వ తేదీన అష్టాదళ పాదపద్మారాధన, వసంతోత్సవం, 17వ తేదీన సహస్ర కలశాభిషేకం, 18వ తేదీన తిరుప్పావడ నివేదన కార్యక్రమం, 19వ తేదీన అభిషేకం, 20వ తేదీన పుష్పయాగం, శ్రీనివాస కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తిరుమలలో శ్రీవారికి పండితులు ఏ విధంగా క్రతువులు నిర్వహిస్తారో అదే రీతిలో స్టేడియంలో కూడా అన్ని ప్రామాణికాలు పాటిస్తారన్నారు. ఈ ఉత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరారు.
తదనంతరం సంయుక్త కలెక్టర్ స్టేడియం మైదానాన్ని పరిశీలించి ప్రధాన వేదిక , సాంస్కృతిక వేదిక ఏర్పాట్లు, భక్తులు, ప్రముఖులు ప్రవేశ నిర్గమన మార్గాలు చిత్రపటం లో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆగస్టు 20వ తేదీన శ్రీవారి కల్యాణం సందర్భంగా భక్తులు విరివిగా పాల్గొనే అవకాశం ఉన్నందున తొక్కిసలాట జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ జాహ్నవి , అదనపు ఎస్పి శ్రీమతి చౌడేశ్వరి, ఆర్ డి ఓ శ్రీ కొండయ్య, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీ శ్రీనివాసరెడ్డి, డిఎస్పి శ్రీ హరినాథ్ రెడ్డి, డిఎంహెచ్వో డాక్టర్ పెంచలయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్. ఈ. శ్రీ రంగవరప్రసాద్, సెట్నెల్ సీఈవో శ్రీ పుల్లయ్య, టిటిడి ఈ.ఈ.శ్రీమతి సుమతి, తాసిల్దార్ శ్రీ వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment