ప్రభుత్వ కష్టం కన్నా మీ కష్టం ఎక్కువని భావించాం:



*వరుసగా నాలుగో ఏడాది– వైయస్సార్‌ వాహనమిత్ర.*

*స్వయం ఉపాధిని అత్యధికంగా ప్రోత్సహిస్తున్న రవాణా రంగానికి ఊతమిస్తూ, డ్రైవర్‌ అన్నలకు ఆండగా .. వైయస్సార్‌ వాహనమిత్ర.*

*2,61,516 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.261.52 కోట్ల ఆర్ధిక సాయం.*

*విశాఖపట్నంలో బటన్‌ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా వైయస్సార్‌ వాహనమిత్ర సాయాన్ని జమ చేసిన సీఎం వైయస్‌.జగన్‌.*



విశాఖపట్నం (ప్రజా అమరావతి);


*నా డ్రైవర్‌ సోదరులను ఆదుకుంటానని 3648 కిలోమీటర్ల నా పాదయాత్రలో హామీ ఇచ్చాను:*

*ఇచ్చిన మాటకు కట్టుబడి వాహనమిత్ర పథకం తెచ్చాం:*

*కరోనా కాలంలో కూడా సాయం ఆపలేదు:*

*ప్రభుత్వ కష్టం కన్నా మీ కష్టం ఎక్కువని భావించాం:*


*ఎన్ని సమస్యలున్నా మీకు తోడుగా ఉండేందుకు అడుగులు వేసాం*

*గత ప్రభుత్వంలా మనం దోచుకుని, దాచుకోవడం లేదు:*

*నలుగురు ధనికుల కోసం పనిచేసే ప్రభుత్వం కాదిది:*

*రెండు పత్రికలు, మూడు ఛానెళ్లు, ఒక దత్తపుత్రుడి నిలువుదోపిడీ కోసమూ నడిచిన ప్రభుత్వం కాదు:*

*ఒకటిన్నర కోట్ల కుటుంబాలకు మంచి చేస్తున్న ప్రభుత్వం మనది:*

*బాబు పాలనలో ఈ ఫైన్లు, చలాన్లకే రూ.40–50 కోట్లు గుంజారు:* 

*అప్పటి ఆ అవస్ధలు, ఇబ్బందులు గుర్తుకు తెచ్చుకోండి:*

*ఇప్పుడు మీకు తోడుగా నిలుస్తున్న పాలన ఇది:* 

*గత పరిస్థితికి ఇప్పటికీ తేడా మీరే చూడండి:*

*చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఓ దుష్టచతుష్టయం:*

*వీరి అబద్దాలు నమ్మకండి:*

*వక్రీకరణలో వీళ్లను మించినవారు లేరు:*

*నాకున్నది.. నిజాయితీ, మీ తోడు, దేవుడి ఆశీస్సులు* 

*నేను ఆధారపడేది మీ మీద, దేవుడి దయ మీదే:*

*విశాఖపట్నంలో వాహనమిత్ర సభలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.* 



*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...*


*వరుసగా నాలుగో ఏడాది వాహనమిత్ర సాయం...*


– దేవుడి దయతో వరుసగా నాలుగో ఏడాది.. నాలుగో సారి వాహనమిత్ర పథకం ద్వారా 2.61 లక్షల కుటుంబాలకు 2,61,516 మంది అన్నదమ్ములకు కార్యక్రమంలో బటన్‌ నొక్కి నేరుగా రూ.261.52 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి దేవుడి దయతో ఇక్కడ నుంచి జమ చేస్తున్నాను. 


– ఇక్కడకి వచ్చిన ప్రతి అక్క, చెల్లెమ్మకు, ప్రతి సోదరుడు, స్నేహితుడు, అవ్వాతాతలకు, చెరగని చిరునవ్వులతో మీరు చూపిస్తున్న అప్యాయతలకు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.


*ఆటో, ట్యాక్సీ నడుపుకుంటూ స్వశక్తిమీద నిలబడిన....*

– ఆటో, ట్యాక్సీ నడుపుతున్న కుటుంబాలు తమకు తాము స్వయం ఉఫాధిని కల్పించుకుంటూ.. ఎవరిమీదనో ఆధారపడాల్సిన అవసరం లేకుండా తమ కాళ్లమీద తాము నిలబడుతున్నారు. స్వయం ఉపాధి కల్పించుకుంటూ.. తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. స్వశక్తిమీద  ఆధారపడుతూ.. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నారు.


*మూడేళ్లలో రూ.1000 కోట్లుపైగానే అందించాం:*

– సొంత ఆటో, ట్యాక్సీ నడుపుకుంటున్న అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలందరికీ ఈ మూడేళ్ల కాలంలోనే ఇప్పటివరకు దాదాపు రూ.1000 కోట్లకు పైగా జమచేశాం.  ఇవాల్టితో కలుపుకుంటే దాదాపుగా రూ.40వేల దాకా ఒక్కోకుటుంబానికి వారి ఖాతాల్లోకి జమ చేసిన మొదటి ప్రభుత్వం మనది. దేశ చరిత్రలోనే కానీ, రాష్ట్ర చరిత్రలో ఇంతగా మీ బాగోగులు గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం మరొక్కటి లేదు. ఇది వాస్తవం.


*ఆదుకుంటానని హామీ ఇచ్చాను...*

– నా డ్రైవర్‌ సోదరులందరికీ కూడా వారిని ఆదుకుంటానని.. నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో హామీ ఇచ్చాను. పాదయాత్ర సందర్భంగా ఏలూరులో నా దగ్గరకి వచ్చి మీ కష్టాలు చెప్పినప్పుడు హామీ ఇచ్చాను. అప్పట్లో ఇన్సూరెన్స్‌ సొమ్ముతో పాటు వెహికల్‌ మెయింటెనెన్స్‌ పేరుతో పెనాల్టీలు వేస్తున్నారని చెప్పారు. రోజుకు రూ.200–300 సంపాదించుకునే మాకు..ఆ పెనాల్టీలుకూడా  చెల్లించడం ఆలస్యమైతే రోజుకు రూ.50 నుంచి రూ.100 వరకు ఫైన్‌ వేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పుకొచ్చారు. 2018 మే 14న ఏలూరు సభలో మీ అందరికీ తోడుగా ఉంటానని హామీ ఇచ్చాను. 



*ఇచ్చిన మాటకు కట్టుబడి – వాహనమిత్ర.*

– అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను మర్చిపోలేదు. – నేను చూశాను, నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగునెలలకే ఆ మాట నిలబెట్టుకున్నాను. మీ అందరి బాగోగులు కోసం వాహనమిత్ర అనే పథకాన్ని ప్రారంభించాం. కరోనా వచ్చినప్పుడు ఆ కష్టకాలంలో మీకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి.. ఆ కరోనా కష్టాలు ప్రభుత్వానికి ఉన్నా, రావాల్సిన ఆదాయాలు ప్రభుత్వానికి రాని పరిస్థితి ఉన్నా కూడా  మా కష్టం, ప్రభుత్వం కష్టం కన్నా మీ ఇంట్లో మీ కుటుంబం కోసం మీరు పడుతున్న కష్టం ఎక్కువని భావించాం. మీకు తోడుగా ఉండేందుకు ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని పక్కనబెట్టి... నేరుగా మీకు తోడుగా ఉండే కార్యక్రమంలో అడుగులు వేశాం. 

– కరోనా కష్టకాలంలో నా అన్నదమ్ములైన డ్రైవర్లు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో ఇంతకముందు పడకూడదన్న లక్ష్యంతో అంతకుముందు సంవత్సరం ఇచ్చిన దానికన్నా నాలుగు నెలలు ముందుగానే వైయస్సార్‌ వాహనమిత్ర డబ్బును మీ అకౌంట్లలోకి జమ చేశాం.


*మనది పేదల ప్రభుత్వం..*

– ఈ యేడాది కూడా మూడు నెలలు ముందుగానే మీకు  ఈ రూ.10 వేల ఆర్ధికసాయం చేస్తున్నాం. మనది పేదల ప్రభుత్వం. ఇది పేదలకు అండగా ఉండే ప్రభుత్వం. ఇది మీజగనన్న ప్రభుత్వం, మీ ప్రభుత్వం అన్నది మర్చిపోవద్దు. అందుకే దాదాపు రూ.1 లక్షా 65 వేల కోట్ల రూపాయలు.. ఈ మూడేళ్ల మన పాలనలో నేరుగా బటన్‌ నొక్కి.. నేరుగా మీ అకౌంట్లలోకి, నా అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకి డబ్బులు జమ చేసే కార్యక్రమం చేశాం. 

– ఎక్కడ కూడా లంచాలు, వివక్ష లేదు. కులం, ప్రాంతం, మతం చివరకి పార్టీ కూడా చూడలేదు. నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు వారికి అర్హత ఉంటే కచ్చితంగా రావాలని ఆదేశాలు ఇచ్చాం. నేరుగా రూ.1 లక్షా 65 వేల కోట్ల రూపాయులు డిబీటీ పద్ధతి ద్వారా మీ చేతుల్లోకి పెట్టాం. 


*గతానికి ఇప్పటికి తేడా గమనించండి...*

– ఇంతటి సంక్షేమం, అభివృద్ధి పేద వర్గాలకు మన ప్రభుత్వం ఇచ్చింది. గతానికి, ఇప్పటికీ ఒక్కసారి తేడా గమనించండి. అప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉండేవారు. ఒక రాష్ట్ర బడ్జెట్‌ ఉండేది. ఇప్పుడూ ఒక ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పుడూ అదే రాష్ట్ర బడ్జెట్‌. మరి ఆ రోజు ఆయన ఎందుకు చేయలేకపోయాడు ? ఇప్పుడు మీ జగన్‌ ఎందుకు చేయగలుగుతున్నాడు ? అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. అప్పటి ప్రభుత్వం కన్నా ఇప్పటి మన ప్రభుత్వం చేసిన అప్పుల కూడా తక్కువే. అయినా అప్పుడు వాళ్లు చేయలేకపోయారు. ఇప్పుడు మీ జగన్‌ ప్రభుత్వం, మీ అన్న, మీ తమ్ముడు ప్రభుత్వం, మీ ప్రభుత్వం చేయగలుగుతోంది.



*గత ప్రభుత్వంలా మనం దోచుకోవడం లేదు...*

కారణం... అప్పుడు దోచుకో, పంచుకో. అప్పుడు దోచుకోవడంలో ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, వీళ్లందరికీ తోడు వీరికొక ఒక దత్తపుత్రుడు. అందరూ కలిసి దోచుకోవడమూ, పంచుకోవడము. ఈ రోజు దోచుకోవడమూ లేదు, పంచుకోవడమూ లేదు. 


నేరుగా బటన్‌ నొక్కుతున్నాం...నేరుగా మీ బ్యాంక్‌ అకౌంట్లలోకి డబ్బులు పడుతున్నాయి. ఇదే అప్పటికీ, ఇప్పటికీ తేడా. దీన్ని మీరు గమనించండి. 


*నలుగురు ధనికుల కోసం పనిచేసే ప్రభుత్వం కాదిది*

ఇది నలుగురు ధనికుల కోసం, రెండు పత్రికలు, మూడు ఛానెళ్లు, ఒక దత్తపుత్రుడు నిలువు దోపిడి కోసం నడిచిన ప్రభుత్వం కాదని జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఒకటిన్నర కోట్ల కుటుంబాలకు, ఇంటింటికీ మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వమన్నది ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొండి. 

ఇది అన్ని సామాజిక వర్గాల ప్రభుత్వం. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు పేద వర్గాల గురించి నిరంతరం ఆలోచించే ప్రభుత్వం మనది. 


వైయస్సార్‌ వాహనమిత్ర ద్వారా వరుసగా నాలుగోసారి కూడా మన ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం సామాన్యుడి పట్ల, సమాజం పట్ల మన బాధ్యతను ఏ స్ధాయిలో మనం చేస్తున్నామన్నదానికి ఇది నిదర్శనం.


ఈ యేడాది 2,61,516 మంది కుటుంబాలకు మంచి చేస్తూ.. ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.261.52 కోట్ల ఆర్ధిక సాయం విశాఖవేదిక నుంచి బటన్‌ నొక్కి విడుదల చేస్తున్నాం. సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్‌ అన్నదమ్ములందరికీ కూడా ఇన్సూరెన్స్, ఫిట్‌నెట్‌ సర్టిఫికేట్‌ వంటివేవీ లేనికారణంగా చలానాల్లు కట్టే పరిస్థితి రాకూడదు. వారు క్షేమంగాఉండాలని, వారిని నమ్ముకుని ఉన్న ప్రయాణికులు సురక్షితంగా వారి గమ్యస్ధానాలకు చేరాలని, ఒక మంచి ఉద్దేశ్యంతో వైయస్సార్‌ వాహనమిత్ర అనే కార్యక్రమం తీసుకొచ్చాం. 


*ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్‌ కచ్చితంగా చూసుకొండి..*

ఈ రోజు మీకిచ్చే ఈ రూ.10వేలు మీరు ఏ అవసరాలకు వాడుకుంటున్నారు అన్నది నేను చూడ్డం లేదు. అది మీ మీద నమ్మకంతో నేను మీకు ఇస్తున్నాను. నేను ఒక్కటే మీ అందరికీ చెప్తున్నాను. మీ అందరికీ ప్రాధేయపడుతున్నాను. మీరు మీ వాహనాలకు సంబంధించి ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ కచ్చితంగా ఉండేట్టు చూసుకొండి. మీ, మీ వాహనాలకు ఇన్సూరెన్స్‌ కచ్చితంగా చూసుకొండి. ఎందుకంటే మీ వెనకాల ప్రయాణికులు ఉన్నారు. వాళ్ల జీవితాలు కూడా మన చేతుల్లోనే ఉన్నాయన్నది మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు.


నేనందిస్తున్న ఈ రూ.261.52 కోట్ల రూపాయలతో కలుపుకుంటే.. వైయస్సార్‌ వాహనమిత్ర అన్న ఈ ఒక్క పథకం ద్వారా మనం అందించిన సహాయం రూ.1026 కోట్ల రూపాయలు. ఒక్కొక్కరికీ రూ.40 వేలు వరకు ప్రతి కుటుంబానికి ఇవాల్టి సొమ్ముతో కలిపి ఇచ్చాం.


*మరో విషయం మీకు చెప్పాలి...*

ఇక్కడే మరో విషయం కూడా చెప్పాలి. ఒక్కసారి గత పాలనను మనం గుర్తు తెచ్చుకుంటే.. గత చంద్రబాబు పాలనలో ఈ ఫైన్లు, చలాన్లు రూపంలో ఆటో డ్రైవర్ల నుంచి 2014–15లో దాదాపు రూ.6.50 కోట్లు గుంజారు. 205–16లో రూ.7.39 కోట్లు. 2016–17లో రూ.9.68 కోట్లు, 2017–18 లో రూ.10.19 కోట్లు, 2018–19 లో ఎన్నికలు దగ్గరకు వచ్చాయి కాబట్టి కాస్త కనికరించి రూ.7 కోట్లు గుంజారు.  అన్నీ కలిపితే గత ఐదేళ్ల పాలనలో దాదాపు రూ.40–50 కోట్ల గుంజారు. 


ఒక్కసారి ఆ రోజు పడిన ఇబ్బందులు, అవస్ధలు గుర్తుకుతెచ్చుకుంటే.. అదే మీ ప్రభుత్వం.. మీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20లో ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి కంపౌండింగ్‌ ఫీజు కింద వసూలు చేసింది కేవలం రూ.68 లక్షలు. అదే 2020–21లో వసూలు చేసిన అమౌంట్‌ రూ.35 లక్షలు. ఇలా  కోట్లలో వసూలు చేసిన గతంలో పరిస్థితి ఎక్కడ, ఇవ్వాళ్టి పరిస్థితి ఎక్కడ. ఆటో అన్నదమ్ములందరినీ ప్రోత్సహించి వారికి సహాయం చేసి, వాళ్లు ఇన్సూరెన్స్‌ కోసం కానీ, ఫిట్‌నెట్‌ సర్టిఫికేట్‌ కోసం ఇబ్బందులు పడే పరిస్థితులు రాకూడదని... వాళ్లకు సహాయంగా, తోడుగా నిల్చి వాళ్లను నడపిస్తున్న ఇప్పటి పరిస్థితికి ఎంత తేడా ఉందో గమనించండి. 


ఈ కార్యక్రమం అయిన వెంటనే గోదారమ్మ ఉప్పొంగటం వలన కలుగుతున్న ఇబ్బందులును, కొన్ని గ్రామాలలో ప్రజలకు కలుగుతున్న కష్టాలను స్వయంగా పరిశీలించి స్వయంగా ఆదేశించేందుకు ఇక్కడ నుంచి కాసేపట్లో ఏరియల్‌ సర్వే కోసం బయలుదేరుతున్నాను.


*దుష్టచతుష్టయం*

వెళ్లేముందు ఒకటి రెండు అంశాలు రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక్కసారి ఈ విషయాలలో తేడా గమనించండి. 

ఈ మధ్యకాలంలో మీరు చూశారు. ఒక చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 కలిసి దుష్టచతుష్టయంగా తయారయ్యారు. 

అబద్దాలు చెప్పడంలోనూ, వక్రీకరించడంలోనూ వీళ్లను మించిన వాళ్లు ఎవరూ లేరు. 


నాకు వీళ్ల మాదిరి ఇన్నిన్ని టీవీ ఛానెళ్లు లేవు, ఇన్నిన్ని పేపర్లూ లేవు. వీళ్ల మాదిరి ఒకే అబద్ధాన్ని నిజం చేసేందుకు వందసార్లు చెప్పిందే చెప్పి, అబద్దాన్ని నిజం చేసే గొప్పతనం నా దగ్గర లేదు. 


*నాకున్నది.. నిజాయితీ, మీ తోడు, దేవుడి ఆశీస్సులు*...

కానీ ఒక్కటే చెప్తునా..నాకు వీళ్ల మాదిరి ఇవేవీ లేకున్నా, నాకున్నది ఒక్కటే ఒక్కటి. నిబద్ధత, నిజాయితీ, మీ తోడు, దేవుడి ఆశీస్సులు ఉన్నాయని మాత్రం కచ్చితంగా చెప్తున్నాను. నేను ఆధారపడేది మీ మీద, దేవుడి దయ మీదే కానీ.. వీళ్ల మాదిరిగా పచ్చ పత్రికలు, పచ్చ టీవీలు, దత్తపుత్రులమీద కాదు. 


మంచి జరగాలని మరొక్కసారి మీ అందరికీ, మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలని, దీంతో మీ కుటుంబాలు ఇంకా అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలని కోరుకుంటూ.. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 


చివరిగా వీఎంఆర్‌డీఏ ఛైర్‌పర్సన్‌ విజయనిర్మల మాట్లాడుతూ.... నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 3–4 విషయాలు చెప్పారు. హనుమంతవాక వద్ద ఫ్లైఓవర్‌ కావాలని, దానికి రూ.50 కోట్లు ఖర్చవుతుందని అడిగారు. హనుమంతవాక ఫ్లైఓవర్‌ను మంజూరు చేస్తున్నాను. అదే విధంగా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం అవసరమైన రూ.20 కోట్లు, మత్స్యకార సోదరుల కోసం జోడుగుళ్లపాలెంలో షెడ్స్‌ కోసం అడిగారు, అవి కూడా మంజూరు చేస్తున్నాను. ఇక గతంలో కట్టుకున్న ఇళ్లు అధ్వాన్నపరిస్థితుల్లో ఉన్నాయి.. వారికి కొత్త ఇళ్లు ఇవ్వలేకపోతున్నాం. పాత ఇళ్లు బాగాలేవు అని చెప్పారు. వాస్తవమే అటువంటి సందర్భాలున్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. దీనిపై తగిన ఆలోచన చేసి పరిష్కరించడానికి మార్గాలు ఆలోచన చేసి, మంచి చేసేందుకు అడుగులు ముందుకు వేస్తామని హామీ ఇచ్చారు.

Comments