నెరవేరబోతున్న కందుకూరు, కావలి నియోజకవర్గాల ప్రజల ఎన్నో సంవత్సరాల కల



నెల్లూరు, జులై 19 (ప్రజా అమరావతి)--  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో రామాయపట్నం ఓడరేవు నిర్మాణం వలన కందుకూరు, కావలి నియోజకవర్గాల ప్రజల ఎన్నో సంవత్సరాల కల


నెరవేరబోతుందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 


మంగళవారం సాయంత్రం మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు, జిల్లా ఎస్పీ శ్రీ సిహెచ్ విజయరావు, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు, కావలి శాసనసభ్యులు శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి, శ్రీ రామిరెడ్డి ప్రతాప్  కుమార్ రెడ్డి లతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 20వ తేదీన రామయ్య పట్నం ఓడరేవు నిర్మాణానికి భూమి పూజ చేయు ప్రాంతాలను పరిశీలించారు. 


 తొలుత వారు సభా వేదిక శంకుస్థాపన పైలాన్ తదుపరి  హెలిపాడు సముద్ర తీర ప్రాంతాల్లో  జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని మంత్రివర్యులు అధికారులకు సూచించారు. 


అనంతరం  మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి రామాయపట్నం ఓడరేవు నిర్మిస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నారన్నారు. జిల్లాలో కృష్ణపట్నం ఓడరేవుతో పాటుగా రామాయ పట్నం ఓడరేవు కూడా అతివేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.  రామాయపట్నం పరిసర ప్రాంతాల రూపురేఖలు మారనున్నాయన్నారు.  ఎంతోమంది యువతకు మరింత వేగవంతంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.  ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.


కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రామాయపట్నం ఓడరేవు నిర్మాణం జరగడం  నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు.  ఎన్నో రోజులుగా తమ ప్రాంతవాసులు ఎదురుచూస్తున్న కల నెరవేరపోతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట ఇస్తే నిలబెట్టుకుంటారన్నారు. పాదయాత్రలో దీనికోసం ఎంతో పోరాటం చేశామన్నారు. కావలి కందుకూరు చుట్టుపక్కల ప్రాంతాలు బాగా అభివృద్ధి చెంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలో రెండు ఓడరేవులతోపాటు ఫిషింగ్ హార్బర్ కూడా ఉండటం మనకెంతో మేలు జరుగుతుందన్నారు.






కందుకూరు శాసనసభ్యులు  శ్రీ మానుగుంట మహిధర్ రెడ్డి మాట్లాడుతూ రామాయపట్నం ఓడరేవు నిర్మాణం కేవలం కందుకూరు లేదా నెల్లూరు జిల్లాకే పరిమితం కాదని ఇది ఒక రాష్ట్ర ప్రాజెక్టు అని చెప్పారు.  ఈ ప్రాజెక్టు వలన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా పరిశ్రమలు పెద్ద ఎత్తున రానున్నాయని దాంతో ఒక గొప్ప వాణిజ్య కేంద్రంగా రూపుదిద్దుకోనుందన్నారు.  వివిధ రకాల వంట  ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతులు, దిగుమతులకు ఎంతగానో ఈ ఓడరేవు ఉపయోగపడుతుందన్నారు. మొదటి దశలో రెండు బెర్తులతో మొదలై 18  బెర్తుల వరకు నిర్మాణం జరగనుందన్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని కొచ్చిన్ ,గుజరాత్, కాకినాడ అధికార బృందం అధ్యయనం చేసి రామాయపట్నం ఓడరేవు నిర్మాణం  గురించి నివేదిక ఇచ్చారన్నారు  నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా పరిశ్రమలు రానున్నాయని దాంతో ఒక గొప్ప వాణిజ్య కేంద్రంగా రూపుదిద్దుకోనున్న వివిధ రకాల వంట ఉత్పత్తులు ఎంతగానో ఈ ఓడరేవు ఉపయోగపడుతుందన్నారు.  ఓడరేవు నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు

ఇచ్చిన  నిర్వాసితులందరికీ ఆదుకుంటామన్నారు. 


 ఈ పర్యటనలో మంత్రి వెంట  సంయుక్త కలెక్టర్ శ్రీ ఆర్,కూర్మానాద్, ఏఎస్పీలు శ్రీమతి హిమవతి, శ్రీమతి చౌడేశ్వరి, కందుకూరు కావలి ఆత్మకూరు ఆర్డీవోలు శ్రీ జీవీ సుబ్బారెడ్డి, శ్రీ సీనా నాయక్, బాపి రెడ్డి, రామాయపట్నం పోర్టు అథారిటీ ఎండి శ్రీ ప్రతాపరెడ్డి, జనరల్ మేనేజర్ శ్రీ నరసింహారావు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments