నెల్లూరు, జూలై 16 (ప్రజా అమరావతి): గత పాలకులు విస్మరించిన అల్లీపురం- నరుకూరు ప్రధాన రహదారిని రూ 10 కోట్లతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఘనత రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కే దక్కిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి కొనియాడారు.
శనివారం సాయంత్రం నెల్లూరు రూరల్ మండలం పెద్ద చెరుకూరు గ్రామంలో అల్లిపురం- నరుకూరు రహదారిని రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్తికరంగా, సంపూర్ణంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్న ముఖ్యమంత్రి దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఒక్క జగన్ మోహన్ రెడ్డేనని పునరుద్ఘాటించారు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో అసలు వర్షాలే పడనందున రోడ్లు దెబ్బతినలేదని, ప్రస్తుతం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నందున కొంతమేర రోడ్లు దెబ్బతిన్నాయని, ఈ రోడ్ల మరమ్మతులకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గతంలో పనిచేసిన పాలకులు పెద్ద చెరుకూరులో అభివృద్ధిని విస్మరించారని, కనీసం స్మశాన వాటిక ను కూడా నిర్మించలేక పోయారని, తమ ప్రభుత్వ హయాంలో 2 కోట్లతో స్మశాన వాటిక ను నిర్మించగా, ప్రస్తుతం 10 కోట్లతో రోడ్డును నిర్మించినట్లు చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు.
రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తాము అడిగిన వెంటనే కాదనకుండా ఈ రోడ్డు నిర్మించేందుకు ముందుకొచ్చిన కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డి ని సభాముఖంగా అభినందించి ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, అధికారుల సహకారంతో ఎంతో అధ్వానంగా ఉన్న ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. రూరల్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. నెల్లూరు, రూరల్ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు వంద కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించాలని ఈ సందర్భంగా మంత్రిని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ శ్రీమతి స్రవంతి, విజయ డెయిరీ చైర్మన్ శ్రీ కొండ్రెడ్డి రంగారెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment