వ్యవసాయ రంగంలో వ్యవస్థీకృత మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం

 

నెల్లూరు జూలై, 17 (ప్రజా అమరావతి);రైతు సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ రంగంలో తీసుకుంటున్న విప్లవాత్మక మార్పులతో దేశం మొత్తం మన రాష్ట్రం వైపే చూస్తుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి  గోవర్ధన్ రెడ్డి అన్నారు


ఆదివారం ఉదయం నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత జిల్లా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలు మంత్రి కాకాణి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ గా ఉత్తమ పాలన అందిస్తూ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కలెక్టర్  శ్రీ కె వి ఎన్  చక్రధర్ బాబును చైర్ పర్సన్  అభినందించారు. అదేవిధంగా జిల్లాలోని ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నికల్లో  గెలుపొంది మొట్టమొదటిసారిగా  జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డిని చైర్ పర్సన్ అభినందించారు.


ఈ సమావేశాల సందర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో జడ్పీ చైర్మన్ గా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర మంత్రి హోదాలో జడ్పీ సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందని,  ఇందుకు అవకాశమిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలన్నారు. జడ్పీ సమావేశాలు కేవలం మొక్కుబడిగా కాకుండా సమస్యల పరిష్కారం కొరకు సభ్యులందరూ కృషి చేయాలన్నారు. సభ్యులకు సమయపాలన చాలా ముఖ్యమని సూచించారు. ప్రస్తుత సమావేశంలో సభ్యులు వెలిబుచ్చిన సమస్యలను అధికారులు తీసుకున్న చర్యల నివేదికను తదుపరి సమావేశంలో తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని సభ్యులకు హామీనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ,  ఈ -పంట, రైతు భరోసా కేంద్రాలు, డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా, వైయస్సార్  ఉచిత పంటల భీమా పథకం , పెట్టుబడి రాయితీ, వ్యవసాయ యాంత్రీకరణ, వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు లాంటి పథకాలతో వ్యవసాయ రంగంలో వ్యవస్థీకృత మార్పులకు శ్రీకారం


చుట్టిందన్నారు. ఇటీవల బెంగుళూరులో జరిగిన రాష్ట్రాల   వ్యవసాయ శాఖ మంత్రుల సమావేశంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం  తీసుకుంటున్న విప్లవాత్మక మార్పులను అన్ని రాష్ట్రాల మంత్రులు ఆసక్తిగా తెలుసుకోవడం జరిగిందన్నారు. ఆర్.బి.కే ల వ్యవస్థను తిరుపతిలో స్వయంగా తిలకించి దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని రాజస్థాన్ రాష్ట్ర  వ్యవసాయ శాఖ మంత్రి కితాబు నివ్వడం జరిగిందన్నారు. 


ఈ సమావేశంలో వ్యవసాయ శాఖతో ప్రారంభించి వివిధ శాఖల పై సుదీర్ఘంగా సమీక్షించారు. వ్యవసాయ శాఖ సమీక్ష సందర్భంగా వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామ్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతాంగ సంక్షేమానికి నిరంతరం పాటుపడే కాకాణి  గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా  ఉండటం జిల్లా రైతన్నల అదృష్టమన్నారు. అదేవిధంగా గత రెండేళ్లుగా జిల్లాలో ఉత్పన్నమైన సమస్యలను ధీటుగా ఎదుర్కొని, జిల్లా ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు ను ప్రత్యేకంగా అభినందించారు.  ఆరుగాలం కష్టపడే రైతు తాము పండించిన పంటను అమ్ముకోవడం లో అనేక ఇబ్బందులు పడుతున్నారని అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.  అలాగే వెంకటగిరి ప్రాంతంలో మగ్గాలపై ఆధారపడే నేతన్నలను ఆదుకోవాలని కోరారు. గ్రీన్ హౌస్, పాలీహౌస్ ఫార్మింగ్ విధానంలో సబ్సిడీ చాలా తక్కువగా ఉందని, దానిని పునః పరిశీలన చేయాలని కోరారు. ఈ - వంట లో లోపాల గురించి కావలి శాసనసభ్యులు శ్రీ  రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రైతు సమస్యలపై పలువురు సభ్యులు గళమెత్తారు.


మంత్రి కాకాణి సమాధానమిస్తూ పంట వేసిన పది రోజుల్లోగా ఈ క్రాప్ నమోదు  చేయడం పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయం డిజిటలైజేషన్ లో భాగంగా 

ఈ-క్రాప్ గురించి వర్క్ షాపులు నిర్వహిస్తామన్నారు. ముఖ్యమంత్రి చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని పలు మార్పులు చేసిన తదుపరి రాష్ట్ర ప్రభుత్వం పి ఎం ఫసల్ యోజన పథకంలో చేరడం జరిగిందన్నారు. ఆర్.బి.కే ల పరిధిలో రైతులు వారికి కావలసిన ట్రాక్టర్ ను ఎంత ఖరీదైనా, అందులో 40 శాతం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నదన్నారు. 


పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖల సమీక్ష సందర్భంగా జిల్లాలోని రోడ్ల పరిస్థితి గురించి పలువురు సభ్యులు ఏకరువు పెట్టారు. రెండేళ్ల క్రితం మంజూరై ఇప్పటికీ రోడ్డు నిర్మాణం మొదలు పెట్టలేదని ఉదాహరణలతో సహా సభ్యులు వివరించారు . గతుకుల మయమైన రోడ్లతో పలువురు ప్రజలు ప్రాణాలు కోల్పోయారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.


మంత్రి కాకాణి స్పందిస్తూ,  తాను మంత్రి అయిన తర్వాత జిల్లాలోని అందరు  శాసనసభ్యులతో మాట్లాడి, జిల్లాలో రోడ్ల పరిస్థితిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి  రోడ్డు నిర్మాణ పనులకు రు.154 కోట్ల నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయడం జరిగిందన్నారు.


జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ మాట్లాడుతూ  స్వతంత్ర భారతావని 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆజాదీ కా అమృత్  మహోత్సవ్ లో భాగంగా జిల్లా ప్రజలందరూ ఆగస్టు 11 నుండి 17 వరకూ తమ ఇంటి పై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రజలకు సూచించారు.  దేశం పట్ల గౌరవం పెంపొందించేందుకు అందరూ కృషి చేయాలని ఆమె కోరారు. జిల్లాలో 15వ  ఆర్థిక సంఘ నిధులతో పలు అభివృద్ధి  పనులు చేపడుతున్నామని సభ్యులకు తెలియజేశారు. శిధిలావస్థలో ఉన్న బోగోలు మండల పరిషత్ కార్యాలయాన్ని పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 


ఈ సమావేశంలో వెంకటగిరి, కావలి శాసన సభ్యులతో పాటు ఉదయగిరి, ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డి, ఇతర జెడ్పీటీసీ సభ్యులు,  ఎంపీపీలు,  జడ్పీ సీఈఓ ఇ. వాణి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, జిల్లా పంచాయితీ అధికారిణి ధనలక్ష్మి, పి ఆర్ ఎస్. ఈ  సుబ్రహ్మణ్యం, హౌసింగ్ పి డి నరసింహులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పెంచలయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారుComments