శకటాల ప్రదర్శన మరింత ఆకర్షణీయంగా, అర్థవంతంగా, వినూత్నంగా ఉండాలి


విజయవాడ (ప్రజా అమరావతి);



*శకటాల ప్రదర్శన మరింత ఆకర్షణీయంగా, అర్థవంతంగా, వినూత్నంగా ఉండాలి


*

                   - *సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి*


                  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించే శకటాలు ఆకర్షణీయంగా, అర్థవంతంగా, వినూత్నంగా ఉండాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వివిధ శాఖల అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ మేరకు బుధవారం విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలన భవనం, రెండవ అంతస్థులోని సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో వివిధ శాఖాధికారులతో ఆయన మొదటి సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. 


           ఈ సందర్భంగా కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లోగోను శకటంపై ప్రస్ఫుటంగా కనిపించేలా ఒక ప్రత్యేక స్థలంలో ప్రదర్శించాలని వెల్లడించారు. రాష్ట్రానికి సంబంధించిన చిరస్మరణీయులు శ్రీ పింగళి వెంకయ్య జాతికి త్రివర్ణ పతాకాన్ని అందించిన నేపథ్యాన్ని స్మరించుకునేలా థీమ్ ప్రదర్శించాలన్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య గారిని ప్రాధామ్యంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ తరపున ఎంపిక కాబడిన 75 మంది స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని వ్యక్తపరిచేలా, ఒక ప్రత్యేక శకటానికి రూపకల్పన చేయాల్సిందిగా కోరారు. 


               స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రదర్శించే శకటాల విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్ కోరారు. గత గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవాల్లో ప్రదర్శించిన శకటాలలోని అంశాలను ప్రస్తుతం ప్రారంభించిన కార్యక్రమాలతో మేళవించి ఆకట్టుకునే విధంగా శకటాలపై పూర్తి దృష్టి సారించాలని సూచించారు. పూర్తి సారాంశం విశదీకరించే విధంగా శకటాల ప్రదర్శన ఉండాలన్నారు. అంతేగాక ప్రతి శకటం కదులుతున్న సమయంలో థీమ్ మ్యూజిక్ ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. శకటాల నిర్మాణం 30 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 14 అడుగుల ఎత్తుకు మించకుండా ఉండాలని స్పష్టం చేశారు.  ప్రతి శకటానికి రూపకల్పన నుండి ప్రదర్శన వరకు పాల్గొనే విధంగా ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని శాఖాధిపతులను ఆయన కోరారు. నోడల్ అధికారులు వారి శాఖకు సంబంధించిన పురోగతిని, పథకాలను ప్రదర్శిస్తూ 2 విభిన్న డిజైన్లు రూపొందించుకొని తరువాతి సమావేశానికి హాజరుకావాలని సూచించారు. 


     ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ ఎల్. స్వర్ణలత, జాయింట్ డైరెక్టర్లు పి. కిరణ్ కుమార్,  కస్తూరిబాయి తేళ్ల, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ ఓ. మధుసూధన్, రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ సి.వి. కృష్ణారెడ్డి, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.



Comments