ఎపీఎస్ఎఫ్ఎల్ నుండి త్వరలో కొత్త ఛానల్...


విజయవాడ (ప్రజా అమరావతి);


ఎపీఎస్ఎఫ్ఎల్ నుండి త్వరలో  కొత్త ఛానల్...


- మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 50 లక్షల బాక్సులు కొనుగోలుకు చర్యలు.. 

- పోల్ ట్యాక్స్ పై గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోను రద్దు చేసేందుకు చర్యలు

- ప్రభుత్వ ఆర్ధిక సహకారం తీసుకుని ఎపీఎస్ఎఫ్ఎల్ ను విస్తరిస్తాం.. 

- భారత దేశంలోనే తొలిసారిగా ఆంధ్ర ప్రదేశ్ లో కేబుల్ తో పాటు ఇంటర్ నెట్ అందిస్తున్నాం..  

- వివరాలను వెల్లడించిన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పి. గౌతం రెడ్డి. 

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, మంచి పనులకు ప్రచారం కల్పించే లక్ష్యంతో కొత్త ఛానల్‌ ప్రారంభించాలని ఏపీ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్ఎఫ్ఎల్) బోర్డు నిర్ణయించిందని ఆ సంస్థ చైర్మన్ పి. గౌతం రెడ్డి ప్రకటించారు. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో ఎపీఎస్ఎఫ్ఎల్ ఛానల్ ఏర్పాటుకు బోర్డు అమోద ముద్ర వేశారని తెలిపారు. రాష్ట్రంలో  అందరు ఆపరేటర్లు పోల్ టాక్స్ వల్ల ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రభుత్వం వచ్చిన నెలలోనే పోల్ టాక్స్ వసూలును డ్రాప్ చేసుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోను రద్దు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. విజయవాడలో ఆర్టీసీ కాంప్లెక్స్ లోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

చైర్మన్ పి. గౌతం రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నేతృత్వంలో  రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు  సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ఏపీఎస్ఎఫ్ఎల్ చానెల్ ద్వారా నిర్వహిస్తామన్నారు.  ఈ ఛానల్ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుందన్నారు.  భారత దేశంలోనే తొలిసారిగా ఎపీలో కేబుల్ తో పాటు ఇంటర్నెట్ ను అందజేస్తున్నామని తెలిపారు. ట్రిపుల్ ప్లే సర్వీసుల ద్వారా ఇంటర్నెట్, ఫోన్‌, నెట్‌ కేబుల్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఎపీఎస్ఎఫ్ఎల్ కు 9 నుండి 1౦ లక్షల వరకు కనెక్షన్లు ఉన్నాయన్నారు. సంస్థకు ఇప్పుడున్న కనెక్షన్ల సంఖ్యను మరింత విస్తరించేందుకు వీలుగా.. నాణ్యత కల్గిన అధునాతనంగా ఉండే కొత్త 50 లక్షల బాక్సులను అన్ని ప్రభుత్వ నిబంధనలకు లోబడి కొనుగోలు చేయాలని బోర్డు నిర్ణయించిందని తెలిపారు. అలాగే ప్రస్తుతం అందిస్తున్న నెట్ ను అదనంగా మరో 10 శాతం పెంచి ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను  ఈ క్రొత్త  ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారదిగా పనిచేయాలనే మంచి ఉద్ధేశ్యంతో ఏపీఎస్ఎఫ్ఎల్ ఛానెల్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విధానాల్లో లోటుపాట్లు ఉంటే తెలియజేయాలి కానీ అభూత కల్పనలతో ప్రసారం చేస్తే ఆ ఛానల్ కే చెడ్డ పేరు వస్తుందని ఎంఎస్ఓలు, బ్రాడ్ కాస్టర్ల కు సూచించారు. ఏ ఛానెల్ అయినా ప్రభుత్వానికి సంబంధించి మంచి ,చెడులను ప్రసారం చేయాలని, ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వంపై  కేవలం చెడు మాత్రమే ప్రచారం చేయవద్దని బ్రాడ్ కాస్టర్లు, ఎంఎస్ఓలను చైర్మన్ కోరారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఏపీఎస్ఎఫ్‌ఎల్ అభివృద్ధి చెందలేదన్నారు. ఎపీ ఎస్ఎఫ్ఎల్ ను లాభాల బాటలో నడిపేందుకు సమగ్ర  విధానాలు  రూపొందించి  అమలు చేయాలని నిర్ణయించామన్నారు. సంస్థకు వచ్చే ఆదాయవనరులు పెంచుకోవడానికి, అయ్యే ఖర్చులు తగ్గించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే గత పాలకులు చేసిన తప్పులు, టెండర్లలో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతుందని గౌతం రెడ్డి తెలిపారు.  


Comments