పోలవరంపై ఎటువంటి చర్చకైనా సిద్ధం..

 

విజయవాడ (ప్రజా అమరావతి);

పోలవరంపై ఎటువంటి చర్చకైనా సిద్ధం..


గతంలో ఎన్నడూ లేనివిధంగా వరద బాధితులకు సహాయక చర్యలు.. 

ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంది.. 

కాఫర్ డ్యామ్ పూర్తిచేయకుండా ఎవరైనా డయాఫ్రమ్ వాల్ కడతారా..?

డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి గత ప్రభుత్వ అసమర్థతే కారణం.. 

వివరాలను వెల్లడించిన జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. 

అనూహ్యంగా జూలై మొదటి వారంలోనే గోదావరికి ఉదృతంగా వరదలు వచ్చాయని..  ప్రభుత్వం పూర్తి అప్రమత్తతో ఉండి సహాయ, పునరావాస కార్యక్రమాలు సకాలంలో చేపట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడగలిగిందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. విజయవాడలోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి ఫోటోలు దిగి ఉండకపోవచ్చు కానీ వరదల్లో ఎటువంటి ప్రాణం నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షలు నిర్వహించి సకాలంలో ప్రజలకు సహాయక చర్యలు ఆందేలా ఆదేశాలను జారీచేశారన్నారు. ప్రజలను ఆదుకోవడానికి పూర్తి చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేసిందన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ... గడిచిన 36 ఏళ్లలో గోదావరికి ఇంత ఉదృతంగా వరదలు వచ్చిన సందర్భాలు లేవని, 1986లో ఇంతకన్నా ఎక్కువగా వరదలు వచ్చాయని తెలిపారు. అయితే జూలై నెల మొదట్లో ఇంతస్థాయిలో వరదలు రావడం ఎప్పుడూ జరగలేదన్నారు. గోదావరి ముంపుబాధితులకు పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించామని తెలిపారు.  గతంలో ఉమ్మడి గోదావరి జిల్లాలకు ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు జాయింట్‌ కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు మాత్రమే ఉండేవారని, కానీ జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో  స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారికి అండగా నిలుస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా గ్రామ, వార్డు  సచివాలయాల ఉద్యోగులు,  ప్రతీ 50 ఇళ్లకూ ఒక వాలంటీర్‌ ఉన్నారని వీళ్లందరి సహాకారంతో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వరద సహాయక చర్యలు జరుగుతున్నాయని మంత్రి అన్నారు. 

గతంలో ఎన్నడూ జరగని విధంగా సహాయ కార్యక్రమాలు అందిస్తుంటే ఒక వర్గం మీడియా, కొందరు ప్రతిపక్షాల నాయకులు ప్రభుత్వంపై విషం చిమ్మాలని చూడటం సరికాదన్నారు. పునరావాసం కల్పించిన బాధితులకు తక్షణ సాయంగా రూ.2వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు.. ఈ ప్రభుత్వం అవిశ్రాంతంగా, చిత్తశుద్ధితో పనిచేస్తుంటే బురదజల్లడం తగదని హితవు పలికారు. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 71.2 అడుగులకు చేరి తెలంగాణ ప్రాంతం మునిగిపోయిందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైందని.. పోలవరం కాపర్ డ్యామ్ ఎత్తును పెంచి ఎక్కడా అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుతం ఉన్న కాపర్ డ్యామ్ 28 లక్షల క్యూసెక్కుల నీటి పరిమాణాన్ని మాత్రమే తట్టుకోగలదని,.. ఈ వరదల్లో గరిష్టంగా పోలవరానికి 27 లక్షల క్యూసెక్కుల నీరు చేరిందని తెలిపారు. 28, 29 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే కాఫర్ డ్యామ్ కొట్టుకుని పోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి గత ప్రభుత్వం అహాంభావం, అసమర్థతతే కారణమని విమర్శించారు. పోలవరంపై ఆరోగ్యకర చర్చకు ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్దమేనని, అసెంబ్లీ వేదికగా అయినా సరే.. మరే వేదికైనా సరే చర్చకు సిద్దంగా ఉన్నామని ప్రతిపక్షాలకు మంత్రి సవాల్ విసిరారు.  పోలవరంపై ఎప్పటికప్పుడు ప్రజా ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటుంటే.. మాజీ మంత్రి అహంభావంతో అధికారులు, ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని సూచించారు. పోలవరంపై ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందో చరిత్రే చెబుతుందని, 1995 నుండి 2004 వరకూ ఉన్న ప్రభుత్వం పోలవరంపై అప్పటిలో ఆలోచన చేస్తే తరువాత వచ్చిన వైఎస్సార్ హాయాంలో ఎందుకు శంకుస్థాపన చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మాజీ మంత్రి అసెంబ్లీలో 2018లో పోలవరం నుండి నీళ్లిస్తాం.. రాసుకోండి.. అనలేదా..? మరి ఇచ్చారా..? అని ప్రశ్నించారు. 2018లో పోలవరం పూర్తిచేయక.. ఎవరు నిద్రపోయారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాఫ‌ర్ డ్యామ్ పూర్తి చేయ‌కుండా డ‌యాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తారా? అని మంత్రి అంబటి నిల‌దీశారు. 


Comments