మచిలీపట్నం : 22 జూలై (ప్రజా అమరావతి);
ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం !!
-- మంత్రి జోగి రమేష్
' జగనన్న పచ్చతోరణం’ ద్వారా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.
శుక్రవారం మధ్యాహ్నం ఆయన కృష్ణా జిల్లా పెడన టౌన్ బ్రహ్మపురం ( 1 వ వార్డు ) లో ' గడప గడపకు మన ప్రభుత్వం 'లో పాల్గొంటూ, ఆ మార్గంలో బట్ట జ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. వందలాదిమంది బాలబాలికలు మంత్రికి జేజేలు పలుకుతూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి తానె స్వయంగా వేప, రావి మొక్కలు నాటి నీరు పోశారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ..వన మహోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 20 కోట్ల మొక్కల్ని నాటేందుకు లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 13 వేల పంచాయితీలు ఉంటే, 17 వేల లే అవుట్లు సిద్ధం చేశామని.. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. వైయస్సార్ జగనన్న కాలనీలలో కూడా మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించు కోవాలని తెలిపారు. మొక్కలు నాటే క్రమంలో మొక్కల ఎదుగుదల చెందే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు తెలిపారు. తొలుత ఆయన పైడమ్మ గుడి సమీపంలో 80 లక్షల రూపాయలతో నిర్మితమవుతున్న అర్బన్ హెల్త్ సెంటర్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మండల విద్యాశాఖాధికారి కె ఎస్ వి ప్రసాద్, బట్ట జ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు గోపాలరావు, పి ఇ టి ఎస్ ఎస్ ఆర్ కె శాస్త్రి, సీనియర్ ఉపాధ్యాయులు కె. ఉమామహేశ్వరరావు, సంబంధిత అధికారులు, పట్టణ ప్రజా ప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment