నకిలీ వాట్సాప్‌లు (Fake WhatsApp) వాడి ఇబ్బంది పడుతున్నవాళ్లు .....???

 నకిలీ వాట్సాప్‌లు (Fake WhatsApp) వాడి ఇబ్బంది పడుతున్నవాళ్లు .....???

( బొమ్మా  రెడ్డి శ్రీ మన్నారాయణ )
వాట్సాప్‌ (WhastApp) లాంటిదే... అచ్చంగా అలాగే ఉంటుంది... అందులో లేని ఫీచర్లు ఇందులో దొరుకుతాయి! - ఇలాంటి మాటలు, మెసేజ్‌లు మీరు వినే ఉంటారు.. చూసే ఉంటారు కూడా. అయితే వీటిని ఎంత మాత్రం విశ్వసించొద్దని టెక్‌ నిపుణులు చెబుతున్నా నకిలీ వాట్సాప్‌లు (Fake WhatsApp) వాడి ఇబ్బంది పడుతున్నవాళ్లు చాలామంది ఉన్నారు. తాజాగా మరో నకిలీ వాట్సాప్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. దీంతో వాట్సాప్‌ సీఈవో తమ ఆండ్రాయిడ్‌ (Android) వినియోగదారులకు జాగ్రత్తలు చెబుతూ కొన్ని సూచనలు చేశారు.


గత కొన్ని రోజులుగా టెక్‌ సర్కిల్స్‌లో, ఆన్‌లైన్‌లో ఓ యాప్‌ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అదే 'హే వాట్సాప్‌'. ఈ యాప్‌ను 'హే మోడ్స్‌' అనే డెవలపర్‌ రూపొందించారు. వాట్సాప్‌ సీఈవో విల్‌ కాథ్‌కార్ట్‌ దీనిపైనే వినియోగదారులకు సూచనలు, జాగ్రత్తలు చెప్పారు. ''వాట్సాప్‌ పేరుతో వస్తున్న ఎలాంటి నకిలీ యాప్‌లను వాడొద్దు. ఒకవేళ వాడితే మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు'' అంటూ విల్‌ హెచ్చరించారు. ఇలాంటి నకిలీ యాప్‌ల వల్ల వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురవుతుందని తెలిపారు.


వాట్సాప్‌లా ఉంటూ, అలాంటి సేవలు అందిస్తున్న 'హే వాట్సాప్‌' అనే యాప్‌ను తమ సెక్యూరిటీ రీసెర్చ్‌ టీమ్‌ గుర్తించదని.. అందుకే ఈ సూచనలు చేస్తున్నామని విల్‌ తెలిపారు. వాట్సాప్‌లో లేని కొన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయని, అయితే వాటిని వాడితే వ్యక్తిగత సమాచారం అగంతుకుల చేతుల్లోకి వెళ్తుందని ఆయన వెల్లడించారు. ఆ యాప్స్‌లో ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉండదని.. దాని వల్ల సమాచారం లీక్‌ అవుతుందని విల్‌ పేర్కొన్నారు.


ప్రస్తుతం ఈ నకిలీ వాట్సాప్‌ ప్లే స్టోర్‌లో లేకపోయినా, థర్డ్‌ పార్టీ వెబ్‌సైట్‌లు, ఏపీకేల ఫార్వర్డ్‌ చేసుకోవడం ద్వారా కొంతమంది వినియోగదారులు వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విల్‌ తెలిపారు. ఈ యాప్‌ వినియోగం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని ఆయన సూచించారు. ఆండ్రాయిడ్‌ వినియోగదారులు మొబైల్స్‌లో ప్లే స్టోర్‌ నుంచి మాత్రమే యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి యాప్‌లను నిరోధించడానికి తమ బృందం ప్రయత్నిస్తోందని చెప్పిన ఆయన ఇలాంటి యాప్‌ల డెవలపర్లపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.


వాట్సాప్‌ తరహా సేవలందించే మరికొన్ని యాప్‌లు ఇంచుమించు అదే పేరుతో ప్లే స్టోర్‌లో ఉన్నాయి. ప్లే స్టోర్‌లో ఉన్నాయి కదా అని వాటిని వాడటం మంచిది కాదు. వాట్సాప్‌ అధీకృత ఖాతా నుండే యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి..

Comments