ఓటర్ల జాబితా సవరణకు నూతన మార్గదర్శకాలు ఆగస్టు 1 నుండి అమలు

 *ఓటర్ల జాబితా సవరణకు నూతన మార్గదర్శకాలు ఆగస్టు 1 నుండి అమలు


*

*•ఓటర్ల నుండి ఆధార్ నంబర్ల సేకరణ నేటి నుండి ప్రారంభం*

*•నూతన మార్గదర్శకాలపై అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ*

*రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా*

                                                                                                                                                                              అమరావతి, ఆగస్టు 1 (ప్రజా అమరావతి):  ఓటర్ల జాబితా సవరణకు సంబందించి నూతన మార్గదర్శకాలు నేటి నుండి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.  2021 డిశంబరు 30 న జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 సవరించబడిందన్నారు. సవరించిన చట్టంలోని  సెక్షన్-23 ప్రకారం ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారు మరియు ఓటర్లుగా నమోదు కావాలనుకునే వారు తమ ఆధార్ సంఖ్యను పొందుపర్చాల్సిఉంటుందన్నారు. తదనుగుణంగానే ఓటర్ల నమోదు నిబంధనలు-1960 ను కూడా సవరించడం జరిగిందన్నారు. 

                                                                                                                                                                                   నూతన చట్ట సవరణలను అనుసరించి ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారు తమ ఆధార్ సంఖ్యలను 2023 మార్చి మాసాంతానికల్లా తెలియచేయవలసి ఉంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఓటర్ల గుర్తింపును ఖరారు చేయడానికి మరియు ఓటర్ల జాబితాలో వ్యక్తులను ప్రామాణీకరించడానికి మరియు ఒక వ్యక్తి పేరు ఒక నియోజక వర్గంలో కంటే ఎక్కువ నియోజక వర్గాల్లో నమోదు కాకుండా లేదా ఒకే నియోజకవర్గంలో ఒకటి కంటే ఎక్కువ సార్లు  నమోదు కాకుండా చూసేందుకే  ఓటర్ల నుండి ఆధార్ సంఖ్యల సేకరణ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం అని ఆయన తెలిపారు. అయితే ఇది పూర్తిగా స్వచ్ఛంధమని, ఆధార్ నంబర్ను సమర్పించని వారిని ఓటర్ల జాబితా నుండి తొలిగించటం ఉండదని మీనా స్పష్టం చేసారు.  ఇప్పటికే ఓటర్లుగా నమోదై  ఉన్న వారి ఆధార్ నంబర్ కోసం నూతనంగా ఫారమ్ 6బి ప్రవేశపెట్టామన్నారు. ఇసిఐ, ఇరోనెట్, గరుడ, ఎన్ వి ఎస్ పి, వి హెచ్ ఎ తదితర వెబ్ సైట్ లలో నూతన ధరఖాస్తులు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. 6బి ధరఖాస్తును ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ఎన్నికల సంఘంకు సమర్పించవచ్చన్నారు. ఎన్ విఎస్ పి, ఓటర్ల హెల్ప్లైన్ యాప్ని అనుసరించి స్వీయ-ప్రామాణీకరణతో యుఐడిఐఎతో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్ ఓటిపిని ఉపయోగించి ఆధార్ను ప్రామాణీకరించవచ్చన్నారు.

                                                                                                                                                                              స్వీయ-ప్రామాణీకరణ పట్ల ఆసక్తిలేని వారు, స్వీయ-ప్రామాణీకరణ విఫలమైన సందర్భంలో అవసరమైన పత్రాలతో ఫారమ్ 6బిని ఆన్లైన్లో సమర్పించవచ్చన్నారు. మరోవైపు బూత్ లెవల్ అధికారి ఓటరు జాబితాతో ఓటర్ల నుండి ఆధార్ నంబర్ సేకరించడానికి ఇంటింటిని సందర్శించటంతో పాటు ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తారని మీనా పేర్కొన్నారు. ఆధార్ సంఖ్యను అందించడం పూర్తిగా స్వచ్ఛందమని,  ఓటర్లు ఆధార్ నంబర్ను అందించలేకపోతే  ఫారం 6బి లో పేర్కొన్న పదకొండు ప్రత్యామ్నాయ పత్రాలలో ఏదైనా ఒక పత్రాన్ని సమర్పించాలన్నారు. ఆధార్ సంఖ్య సేకరణ, నిర్వహణ కోసం అన్నిజాగ్రత్తలు తీసుకుంటారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జనబాహుళ్యంలోకి వెళ్లకుండా చూడటం జరుగుతుందని ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సేకరించిన హార్డ్ కాపీలు ఇఆర్ఓల ద్వారా డబుల్ లాక్తో సురక్షితమైన కస్టడీలో ఉంచబడతాయని, యుఐడిఎఐ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల కమీషన్  నియమించిన లైసెన్స్ పొందిన ఆధార్ వాల్ట్లో ఓటర్ల ఆధార్ నంబర్ జాగ్రత్త చేయబడుతుందని మీనా స్పష్టంచేసారు.

                                                                                                                                                                                ఈ నూతన మార్గదర్శకాలపై ఓటర్లలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను డిప్యుటీ సి.ఇ.ఓ. వెంకటేశ్వరరావు సోమవారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ లో ఆవిష్కరించారు. ఈ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో స్వీప్ కన్సల్టెంట్ మల్లికార్జున రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

                                                                                                                                                                                            

Comments