ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు-2023ను విజయవంతంచేయాలి

 *ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు-2023ను విజయవంతంచేయాలి


*

*రాష్ట్ర పరిశ్రమల  శాఖ మంత్రి  గుడివాడ అమర్నాథ్*

                                                                                                                                                                                       అమరావతి, ఆగస్టు 22 (ప్రజా అమరావతి):   వచ్చే ఏడాది  విశాఖపట్నంలో నిర్వహించనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు-2023  (AP GLOBAL INVERSTORS SUMMIT-2023) ను విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు వాణిజ్యం, ఐ.టి. శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అధికారులను ఆదేశించారు. ఈ సదస్సు నిర్వహణపై సోమవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పరిశ్రమల శాఖ సమావేశ మందిరంలో సి.ఐ.ఐ. ప్రతినిధులతో పాటు పలు ముఖ్యమైన శాఖల ప్రిన్సిఫల్ సెక్రటరీలతో మంత్రి ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు.

  

  ఈ సందర్బంగా పరిశ్రమల శాఖ మంత్రి  అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, వనరులకు అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సును వచ్చే ఏడాదిలో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్  రెడ్డి ఆదేశించారన్నారు. వారి ఆదేశాలకు అనుగుణంగా శాఖల వారీగా పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాలను ముందుగా గుర్తించాలని ఆయా శాఖల ప్రిన్సిఫల్ సెక్రటరీలకు మంత్రి సూచించారు.  ముఖ్యంగా ఐ.టి., విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, పర్యాటక, చేనేత, వస్త్రపరిశ్రమ, సముద్రయానం తదితర రంగాల్లో పెట్టుబడులకు ఎక్కువగా అవకాశాలు  ఉంటాయని, ఆయా శాఖలకు చెందిన అధికారులుఈ సదస్సులో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు.  రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జాతీయ, అంతర్జాతీయ కంపెనీల విస్తరణ పై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సదస్సుకు ప్రత్యేక అంబాసిడర్ ను నియమించుకోవాల్సిన అవసరం లేదని,  అపాచీ, కియా, హీరో, బ్రాండిక్స్ తదితర జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులనే పరిశ్రమల ప్రమోటర్లుగా వినియోగించుకోవాలని, వారి అభిప్రాయాలతో వాయిస్ రికార్డును, వీడియో లను రూపొదించి విస్తృత ప్రచారానికి ఉపయోగించుకోవాలన్నారు.  ఈ పెట్టుబడుల సదస్సు లక్ష్యాలు, ప్రయోజనాలు ప్రతిబింబించే విధంగా అనుభవజ్ఞడైన కన్సల్ టెంట్ ద్వారా  లోగోను మరియు ధీమ్ ను రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని పరిశ్రమ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. 


ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే గుర్తించిన 32 వేల మెగావాట్ల సామర్థ్యంలో 20 వేల మెగా వాట్లకు సంభందించి దావోస్ వరల్డు ఎకనమిక్ ఫోరం లో ఎం.ఓ.యు.లను కూడా చేసుకోవడం జరిగిందన్నారు. మిగిలిన 12 వేల మెగా వాట్ల సామర్థ్యానికి సంబందించి పెట్టుబడులను ఈ సదస్సు ద్వారా ఆకర్షించేందుకు అనువుగా చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కు మంత్రి సూచించారు. ఫార్మా పరిశ్రమల స్థాపనకు నక్కపల్లి, రాంబిల్లి ప్రాంతాల్లో దాదాపు ఆరు వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందని, సంబందిత పెట్టుబడిదారులను ఈ సదస్సు ద్వారా ఆకర్షించేందుకు తగు చర్యలు చేపట్టాలని  రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు కు మంత్రి సూచించారు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభివృద్దికి అవసరమైన చర్యలు చేపట్టాలని అందుకు తగ్గట్టుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించేందుకు ఈ సదస్సు ద్వారా తగు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ చైర్మన్ హేమ చంద్రా రెడ్డి ని మంత్రి  కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మరియు వస్త్ర పరిశ్రమల స్థాపనకు అవసరమైన పెట్టుబడుల ఆకర్షణకు తగు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు మంత్రి సూచించారు. సముద్ర రవాణా, వాణిజ్యం రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు తగు ప్రణాళికలు రూపొందించాలని సముద్రయాన శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. 


తొలుత సి.ఐ.ఐ. ప్రతినిధి నీరజ్ జూమ్ కాన్పరెన్సు ద్వారా ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు-2023 నిర్వహణ ప్రయోజనాలు, లక్ష్యాలు, ఆశించిన ఫలితాలు సాదించేందుకు అనుసరించాల్సిన వ్యూహాత్మక విధానాలు, విస్తృత ప్రచారం నిమిత్తం నిర్వహించాల్సిన రోడ్ షోలు, సెమినార్లు, మీడియా ప్లాన్ తదితర అంశాలను మంత్రికి, అధికారులకు వివరించారు.  


రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికల్ వలవన్, సంచాలకులు జి.సృజన, ఐ.టి. కార్యదర్శి సౌరబ్ గౌర్, రాష్ట్ర చేనేత మరియు వస్త్ర పరిశ్రమ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ కె.సునీత  తదితరులు  ప్రత్యక్షంగాను మరియు సి.ఐ.ఐ. ప్రతినిధి నీరజ్ తో పాటు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ చైర్మన్ హేమ చంద్రా రెడ్డి తదితరులు జూమ్ కాన్పరెన్సు ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.


 

Comments