బాలికలపై లైంగిక వేధింపులు ఆపాలి

 *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*

*పాఠశాల విద్యా శాఖ – సమగ్ర శిక్షా*


*బాలికలపై లైంగిక వేధింపులు ఆపాలి*


*• పాఠశాల విద్యాశాఖ  ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ గారు*

*• పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గోడ పత్రిక ఆవిష్కరణ*

గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జువెనైల్ జస్టిస్ కమిటీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు గౌరవ జస్టిస్ శ్రీమతి కొంగర విజయలక్ష్మి గారు, గౌరవ జస్టిస్ శ్రీ రామకృష్ణ ప్రసాద్ గారు, గౌరవ జస్టిస్ శ్రీమతి వి. సుజాత గారి సూచనల మేరకు బాలికలపై లైంగిక వేధింపులు  ఆపాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో గోడ పత్రిక మరియు ఫిర్యాదుల పెట్టెను పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ బుడితి  రాజశేఖర్ గారు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్. సురేష్ కుమార్ గారు ఆవిష్కరించారు. 

శనివారం పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ బి రాజశేఖర్ గారు మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు ఉన్న ప్రతి చట్టాన్ని అందరూ ఉపాధ్యాయులు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. చైల్డ్ లైన్ కు సంబంధించిన హెల్ప్ లైన్,  టోల్ ఫ్రీ నంబర్లతో పాటు ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఫిర్యాదులు పెట్టెను, గోడపత్రికలను లైఫ్ లైనుగా వినియోగించుకోవాలని సూచించారు.  

ప్రతి చిన్నారికి  ఎదురయ్యే ఎటువంటి సమస్యకైనా 15 రోజుల్లో పరిష్కారం లభించేలా  మండల కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ యాప్ పట్ల ప్రతి మహిళ, విద్యార్థినులు, పోస్కో  చట్టంపై ప్రతి ఉపాధ్యాయులు   అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. 

పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్. సురేష్ కుమార్ గారు ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఏ పాఠశాలలో కూడా ఏ ఒక్క విద్యార్థి కూడా శారీరక, మానసిక వేధింపులకు గురి కాకూడదని తెలిపారు. ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న ఫిర్యాదులు పెట్టె ద్వారా వారి సమస్యలను తెలియజేస్తే వాటికి పరిష్కారం లభిస్తుందని తెలియజేశారు. 

  అనంతరం ఎస్సీఆర్టీ డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదులు పెట్టే మరియు గోడ పత్రికల ద్వారా విద్యార్థులకు ఎదురయ్యే  ప్రతి సమస్యను తెలియజేయడం ద్వారా వారికి సరైన పరిష్కారం పాఠశాలలోనే లభించే విధంగా విద్యాశాఖ కృషి చేస్తుందని అన్నారు. 

ఈ సందర్భంగా పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, విజయవాడ స్టెల్లా మహిళా కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో  కృష్ణా జిల్లా డీఈవో తాహేరా సుల్తానా, సమగ్ర శిక్షా  జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ శేఖర్, మండల తహసిల్దార్ బద్రు,  ఎంపీడీఓ సునీత శర్మ, ఎంఈవో కనకమహాలక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు వై. దుర్గాభవాని, సర్పంచ్ లింగాల భాస్కరరావు, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్లు రమేష్, ప్రకాష్, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు. 

Comments