పుట్టపర్తిలో అంబరాన్ని అంటిన దేశభక్తి*
ఘనంగా స్వాతంత్ర సమరయోధుడు, జాతీయ జెండా రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య 146వ జయంతి మరియు బళ్లారి రాఘవ 142వ జయంతి వేడుకలు.
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఆగస్టు 02 (ప్రజా అమరావతి):
ఆజాది కా అమృత మహోత్సవ్ లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధుడు జాతీయ జెండా రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య 146వ జయంతి మరియు బళ్లారి రాఘవ 142వ జయంతి వేడుకలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంలో మంగళవారం ఉదయం ఘనంగా జరిగాయి. పింగళి వెంకయ్య, తెలుగు నాటక రంగ ప్రముఖులు బళ్లారి రాఘవ త్యాగాలను స్మరిస్తూ డిఆర్ఓ గంగాధర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబులపతి, పూడా చైర్మన్ లక్ష్మీనరసమ్మ, ఆర్డిఓ భాగ్యరేఖ, డిఆర్డిఎ పిడి నరసయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు మరియు వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థలు, పుట్టపర్తి, ఎనుముల పల్లి, బుక్కపట్నం పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పుట్టపర్తిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొని స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు 60 అడుగుల పొడవు గల జాతీయ జెండాతో పెద్ద ఎత్తున ర్యాలీగా వందలాది మంది తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ర్యాలీలో జాతీయ జెండాను చేత బూని దారి పొడవునా" పింగళి వెంకయ్య అమర్ రహే", "బళ్లారి రాఘవ అమర్ రహే", "భారత్ మాతాకీ జై "అంటూ చేసిన నినాదాలు చేస్తూ దేశభక్తి చాటుతూ కాలి నడకన నడిచారు.
అంతకు మునుపు మున్సిపల్ కార్యాలయం వద్ద పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నిళులర్పించారు. అనంతరం డిఆర్ఓ గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను చరిత్ర ఎప్పటికీ మరువదని తెలిపారు. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరికీ ఆగస్టు రెండు నుండి 15 వరకు ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పుట్టపర్తి జిల్లా ప్రధాన కేంద్రంలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. 2వతేదీ నుండి 15వతేదీ వరకు ప్రతి ఒక్కరు తమ ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. నేటి యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో అనేకమంది మహానుభావులు అనేక విధాలుగా పాల్గొని తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని, ప్రస్తుతం మనమంతా అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వాతంత్రం వారి త్యాగాల ఫలితమేనని తెలిపారు. అటువంటి వారిలో పింగళి వెంకయ్య, బళ్లారి రాఘవులు లాంటి మహనీయుల త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకమని, సమష్టి కృషితో దేశ, రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేయాలని డిఆర్ఓ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉభయ జిల్లాల మహిళా సమైక్య అధ్యక్షురాలు సాయి లీల, నెడ్కెప్ డైరెక్టర్ మాధవరెడ్డి, పట్టణ సిఐ బాలసుబ్రమణ్యం, పలువురు పిఈటిలు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment