గొప్ప సేవలందించే వర్గం – చిరువ్యాపారులు...


అమరావతి (ప్రజా అమరావతి);


*జగనన్న తోడు – చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం.*


*నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణం.*


*కొత్తగా సుమారు 3.95 లక్షలమందికి ఈ పథకం ద్వారా నేడు రూ. 395 కోట్ల రుణం.*


*గత ఆరునెలలకు సంబంధించి సకాలంలో రుణాలు చెల్లించిన వారికి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను కూడా కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి విడుదలచేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.* 


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:*


దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.  దాదాపు 15,03,558 మంది కుటుంబాలకు ఈ పథకం ద్వారా మంచి చేస్తున్నాం. ఈరోజు 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.395 కోట్లతో వారికి తోడ్పాడు ఇస్తున్నాం. మొత్తంగా 15,03,558 కుటుంబాలకు రూ.2011 కోట్లతో స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ, వారు ఇంకొకరిమీద ఆధాపడే పరిస్థితి లేకుండా, వారి కాళ్లమీద వారు నిలబడి, వారి బ్రతుకు వారు బ్రతికేందుకు అవసరమైన గొప్ప కార్యక్రమానికి చేయూతనిస్తున్నాం.  


*గొప్ప సేవలందించే వర్గం – చిరువ్యాపారులు...


*

వీరు తమకు తాము ఉపాధి కల్పించుకోవడమే కాకుండా, మరికొంతమందికి కూడా కొద్దోగొప్పో ఏదో రూపంలో ఉపాధినిస్తున్నారు. నామమాత్రపు లాభాలనే సంతోషంగా తీసుకుంటూ... సేవలందించే గొప్ప వర్గం చిరు వ్యాపారులు. నిజానికి ఈ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు చేసేది వ్యాపారం అనేదాని కన్నా గొప్ప సేవ అనడంలో ఏమాత్రం సంకోచం లేదు.  


*వీరి బాధలు నా కళ్లారా చూశాను...*

ఇలాంటి చిరువ్యాపారులతో పాటు సాంప్రదాయ చేతివృత్తుల వారు తమకు బ్యాంకుల నుంచి రుణాలు రాక, వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడి అధిక వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక వీరు పడుతున్న బాధలు నా పాదయాత్రలో నా కళ్లారా చూశాను.

వీళ్లు వడ్డీ వ్యాపారులకు కట్టాల్సిన వడ్డీయే చాలా సందర్భాలలో వేయి రూపాయలకు వంద రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. ఉదయాన్నే రూ.1000 ఇస్తే సరుకులు తీసుకుని అవి అమ్ముకుని రూ.100 వీరికి లాభం ఇవ్వాల్సిన పరిస్ధితి. దాదాపు రూ.100కు రూ.10 వడ్డీ కట్టుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి నడ్డి వరిచే ఈ వడ్డీల భారి నుంచి వీరిని తప్పించి, లక్షల కుటంబాలకు అండగా ఉండాలి, ఉంటేనే వీరి జీవితాలు బాగుపడతాయని నా పాదయాత్ర సందర్భంగా నేను చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి. 


*చెప్పిన మాటకు కట్టుబడే–  జగనన్న తోడు.*

చెప్పిన మాటకు కట్టుబడి జగనన్న తోడు అన్న ఈ పథకాన్ని ప్రారంభించి ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచింది. ఈ పథకం ద్వారా నిరుపేదలైన చిరువ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారిని వారి కాళ్లమీద వాళ్లని నిలబెట్టేలా ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున వడ్డీలేని రుణం అందిస్తున్నాం. దీని వల్ల రాష్ట్రంలో నా ప్రతి అక్కచెల్లెమ్మకు,అన్నదమ్ములకు ప్రయోజనం కలిగేలా మంచి చేస్తున్నాం.  


*జగనన్న తోడు – ఇప్పటివరకు రూ.2011 కోట్లు సాయం.*

జగనన్న తోడు కార్యక్రమం ద్వారా మరోసారి 3.95 లక్షల మంది చిరువ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.395 కోట్ల సాయంతో కలిపితే... ఇప్పటివరకు 15,03,558 మంది కుటుంబాలకు బ్యాంకుల ద్వారా అందించిన వడ్డీ లేని రుణాలు రూ.2011 కోట్లు. 


*దేశంలోనే అత్యధికంగా....*

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు... 34 లక్షల మందికి ఈ రకంగా తోడ్పాడు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే.. ఒక్క మన రాష్ట్రంలోనే అందులో సగభాగం 15.03 లక్షల మందికి బ్యాంకుల సహకారంతో మంచి చేయగలిగాం. ఇందుకు సహకరించిన ప్రతి బ్యాంకుకు, తోడ్పాటు అందించిన ప్రతి అధికారికీ కృతజ్ఞతలు. 


ఈ 15.03 లక్షల మందిలో సకాలంలో చెల్లించి రెండోసారి కూడా రుణం తీసుకున్నవారు 5.08 లక్షల మంది. సకాలంలో వారు రుణాలు చెల్లిస్తే వడ్డీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వారికి తిరిగి ఇవ్వడమే కాకుండా... వారికి మరలా బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేస్తాయి. ఇలా సకాలంలో బ్యాంకులకు చెల్లించినవారికి వారు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి 6 నెలలకొకమారు మన ప్రభుత్వంæ నేరుగా లబ్దిదారుల ఖాతాలకు జమ చేస్తుంది.  ఈ రుణం తీరిన తర్వాత లబ్ధిదారులు మరలా వడ్డీలేని రుణం పొందడానికి అర్హులు. వాళ్లకి బ్యాంకులు కూడా మరలా వడ్డీలేనిరుణాలు ఇస్తాయి. ఇలా రుణం పొందేటప్పుడు రుణం మొత్తాన్ని ప్రతి విడతకూ రూ.వేయి చొప్పున పెంచేదిశగా బ్యాంకులతో మాట్లాడుతున్నాను. దానివల్ల చిరువ్యాపారులకు క్రెడిట్‌ రేటింగ్‌ పదిశాతం పెరుగుతుంది. 

*సకాలంలో రుణాల చెల్లించిన 12.50 లక్షల మందికి...* 

ఇప్పటివరకు సకాలంలో రుణాలు చెల్లించిన 12.50 లక్షల మంది లబ్దిదారులకు మన ప్రభుత్వం పూర్తిగా వడ్డీ భారాన్ని మోస్తూ.. తిరిగి చెల్లించిన మొత్తం రూ.48.48 కోట్లు. 

ఇందులో భాగంగా గత ఆరునెలలకు సంబంధించిన రూ.15.96 కోట్ల వడ్డీని బటన్‌ నొక్కి రీయింబర్స్‌ చేస్తున్నాం. కొత్తగా 3.95 లక్షల మంది లబ్ధిదారులకు రూ.395 కోట్లు రుణాలు అందిస్తున్నాం. ఆ మొత్తాన్ని  నేరుగా వారి ఖాతాల్లోనే జమచేస్తున్నాం.


*80 శాతం లబ్దిదారులు అక్కచెల్లెమ్మలే...*

జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందినవారిలో 80శాతం మంది అక్క చెల్లెమ్మలే ఉన్నారు. ఇది ఒక విప్లవం అయితే.. రెండోది ఇందులో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలే మరో 80శాతం మంది ఉన్నారు. ఇది మరో అడుగు. ఇది మహిళా సాధికారితకు, సామాజిక న్యాయానికి కూడా నిదర్శనం. ఈ చిరువ్యాపారులు బ్రతకడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్లు వేరొకరిమీద ఆధారపడకుండా వీళ్ల కాళ్లమీద నిలబడి బ్రతుకుతున్నారు. 


*ఒక్క రూపాయి సాయం చేయని గత ప్రభుత్వం...*

ఇటువంటి వారికి తోడుగా ఉండాలన్న ఆలోచన గత ప్రభుత్వం ఎప్పుడూ చేయలేదు. ఒక్కసారి తేడాను గమనించండి. అటువంటి వారిని గుర్తించి ఏరోజైనా ఒక్క రూపాయి సహాయం చేయాలన్న ఆలోచన ఎప్పుడూ గత ప్రభుత్వ హయాంలో జరగలేదు. వస్తువులు, దుస్తులు, టీ, కాఫీ, టిఫిన్, కూరగాయలు, పళ్లు ఇటువంటి వాటిని పుట్‌పాత్‌ల మీద, తోపుడుబండ్ల మీద, రోడ్ల పక్కన, మోటార్‌ సైకిల్, సైకిళ్ల మీద వీధి, వీధినా తిరిగి అమ్ముతూ లక్షల మంది చిరువ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇటువంటి వారికి తోడుగా ఉంటే స్వయం ఉపాధిని ప్రోత్సహించినట్లవుతుందని తెలిసినా కూడా దీన్ని బాగుపర్చాలన్న ఆలోచన గతంలో జరగలేదు. అధిక వడ్డీలకు తెచ్చుకుని ఇబ్బందులు పడుతున్నారన్న విషయాలు తెలిసినా కూడా గత ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నవాళ్లు సాయం చేయాలన్న ఆలోచన చేయలేదు. 


*మనసు లేని గత పాలకులు...*

ఇటువంటి నిరుపేదలైన చిరువ్యాపారులుకు మాత్రమే కాకుండా.. సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులైన ఇత్తడి పనిచేసేవారు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కళంకారీ, తోలుబొమ్మలు, లేస్‌ వర్క్స్‌ చేసేవాళ్లు, ఇతర సామాగ్రి తయారు చేసేవాళ్లు, కుమ్మరి, కమ్మరి తదితర వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారు వీళ్లందరికీ కూడా వడ్డీ లేని రుణాలిచ్చే ఏర్పాటు చేయాలన్న ఆలోచన గత ప్రభుత్వంలో జరగలేదు. ఎందుకు వారు చేయలేదంటే... గత ప్రభుత్వ పాలకులకు మనసు అనేది లేదు కాబట్టి.. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదు.


*గత పాలకులది పెత్తందారీ పాలన...*

గత పాలకులది పెత్తందారీ పరిపాలన, పెత్తందారీ మనస్తత్వం. వారు బాగుంటే చాలు. ఆ పెత్తందార్లకు మద్ధతు పలికే దుష్ట చతుష్టయం అంటే... ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వీరికి మద్దతు పలికే దత్తపుత్రుడు. ఈ దుష్టచతుష్టయానికి మంచి జరిగితే చాలు.


వారు దోచుకో.. పంచుకో.. తినుకో.. పద్థతిలో గతంలో డీపీటీ స్కీంను అమలు పరిచేవారు. ఈ రోజు  మన ప్రభుత్వంలో డీబీటీ(డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) అమలు చేస్తున్నాం. నేరుగా బటన్‌ నొక్కుతున్నాం. లంచాలకు ఆస్కారం లేకుండా ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తున్నాం. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమచేస్తున్నాం. ఈ రకంగా దాదాపు రూ.1.65 లక్షల కోట్లు రూపాయలు వివిధ పథకాల ద్వారా లబ్ది చేశాం.


ఈ రోజు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందుతున్న 15.03 లక్షల మందిలో.. చాలామందికి కూడా మన ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు అందుతున్నాయి. జగనన్న అమ్మఒడి, వైయస్సార్‌ఆసరా, వైయస్సార్‌ సున్నావడ్డీ, వైయస్సార్‌ చేయూత, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, వైయస్సార్‌ పెన్షన్‌ కానుక, ఇళ్లపట్టాలు, ఇళ్లు ఇలా అనేక పథకాలు ప్రతి కుటుంబానికీ కనీసం 3–4 పథకాలు అందుతున్నాయి. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. 


*గతానికి ఇప్పటికీ తేడా ఇదే...* 

గతంలో ఈ మాదిరిగా జరిగేది కాదు, ఇప్పుడు జరుగుతుంది ఎందుకు అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి.  

గతంలో ప్రభుత్వం ఉండేది. బడ్జెట్‌ఉండేది. 

అప్పుడూ అదే బడ్జెట్‌.. ఇప్పుడూ అదే బడ్జెట్‌... కేవలం తేడా ముఖ్యమంత్రి మార్పు మాత్రమే ?

చేసిన అప్పులు చూద్దామంటే... గతంలో చేసిన అప్పులతో పోల్చితే .. సీఏజీఆర్‌ (కాంపౌండ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌) ఎంత అని చూస్తే... గతంలో కన్నా తక్కువ. గతంలో 19శాతం సీఏజీఆర్‌ ఉంటే... ఇప్పుడు 15 శాతం ఉంది. అప్పుడు ఎందుకు చేయలేకపోయారు.ఈ ప్రభుత్వం ఎలా చేయగలుగుతుంది. 


*ఇప్పుడు పథకాలు ఎందుకు అందుతున్నాయంటే..* ఎక్కడా లంచాలు లేవు, వివక్షలేదు, అవినీతి లేదు. నేరుగా బటన్‌ నొక్కుతున్నాం.  అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకి వెళ్లిపోతున్నాయి. 


దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని ప్రార్ధిస్తూ బటన్‌ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

Comments