పంట నష్టం, సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలి ___ జడ్పీ చైర్మన్ విప్పర్తి

 ___ పంట నష్టం, సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలి

___ జడ్పీ చైర్మన్ విప్పర్తి


   కాకినాడ, ఆగస్టు 8 (ప్రజా అమరావతి): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల సంభవించిన వరదల వల్ల  జ‌రిగిన పంట నష్టం వివ‌రాల సేకరణ ప్ర‌క్రియ‌ను త్వరితగతిన పూర్తిచేయాలని,  వర్షాకాలంలో సంభవించే వివిధ రకాల సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్త‌త‌తో వ్య‌వ‌హ‌రించి తగు చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజాపరిషత్ ఛైర్మ‌న్ విప్పర్తి వేణుగోపాలరావు అధికారులకు సూచించారు. సోమవారం కాకినాడ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ స‌మావేశ మందిరంలో స్థాయీ సంఘాల సమావేశంలో జిల్లా పరిషత్ ఛైర్మ‌న్ విప్పర్తి వేణుగోపాల‌రావు, వైస్ ఛైర్మ‌న్లు బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత వివిధ స్థాయీ సంఘాల ఛైర్మ‌న్లు, సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

   ఆర్థిక‌, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, రహదారులు, విద్య, వైద్యం, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, పారిశుద్ధ్యం, జగనన్న స్వచ్ఛ సంకల్పం, జాతీయ ఉపాధి హామీ పథకం, హౌసింగ్, విద్యుత్, గ్రామీణ అభివృద్ధి తదితర అంశాలలో ఇప్పటివరకు జరిగిన పురోగతి, కొత్తగా ప్రతిపాదించిన పనుల వివరాల‌పై సంబంధిత అధికారులతో చర్చించారు. అనంత‌రం చైర్మన్ వేణుగోపాల‌రావు మీడియాతో మాట్లాడుతూ ఏడు స్థాయీ సంఘాల స‌మావేశాలు ఆయా సంఘాల ఛైర్‌ప‌ర్స‌న్ల అధ్య‌క్ష‌త‌న జ‌రిగాయ‌ని తెలిపారు. సంఘాల స‌భ్యులు, అధికారుల‌తో వివిధ అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించార‌న్నారు. ప్ర‌ధానంగా సీఎం జగన్ ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారని, ఆయన ఆదేశాల ప్రకారం నష్టపోయిన పంటల వివ‌రాల సేకరణ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేసి నివేదిక‌ల‌ను సిద్ధం చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అదేవిధంగా గత కొంతకాలంగా నిరంతరంగా వర్షాలు పడుతున్న కారణంగా తిరిగి పంటలు దెబ్బ తినకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా వ్య‌వ‌సాయ అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటార‌న్నారు. 

  ఈ వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తత‌తో వ్యవహరించి  గ్రామ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పటిష్టంగా చేపట్టేలా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు. ర‌హ‌దారులు, పంచాయ‌తీరాజ్‌, వ్యవసాయం, విద్యా, సంక్షేమం త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించి, సభ్యులు తీర్మానాలు చేశార‌న్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రిస్తూ అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లుచేయ‌నున్న‌ట్లు వేణుగోపాల‌రావు తెలిపారు. 

   వ్య‌వ‌సాయ స్థాయీ సంఘం (వ్యవసాయం) ఛైర్మ‌న్‌, జిల్లా పరిషత్ వైస్ ఛైర్మ‌న్ బుర్రా అనుబాబు అధ్యక్షతన వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు. జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు కల్పిస్తున్న సదుపాయాలు, ఇతర అంశాలను వ్యవసాయ శాఖ అధికారి సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా అనుబాబు మాట్లాడుతూ రైతులందరు ఈ-క్రాప్ బుకింగ్, కౌలు రైతు కార్డు, రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలపై క్షేత్రస్థాయిలో రైతులకు  అవగాహన కల్పించాలన్నారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా రైతులకు యంత్ర పరికరాలు అందించడం జరిగిందని. ఖరీఫ్ సీజన్ త్వరగా ప్రారంభించడం ద్వారా మూడో పంటగా అపరాలు, పచ్చి రొట్ట సాగు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు.

   స్త్రీ, శిశు సంక్షేమం స్థాయీ సంఘం ఛైర్మ‌న్ రొంగల పద్మలత అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంగన్వాడీ భవనాల నిర్మాణం, చిన్నారులకు పౌష్టికాహారం సరఫరా, నాణ్యత తదితర అంశాలపై సభ్యులు, ఐసీడీఎస్ అధికారులతో కలిసి చర్చించారు.

   సాంఘిక సంక్షేమం స్థాయీసంఘం స‌మావేశం ఛైర్మ‌న్‌, జిల్లా ప్రజా పరిషత్ వైస్ ఛైర్మ‌న్ మేరుగు పద్మలత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సాంఘిక, గిరిజన సంక్షేమం, వెనుకబడిన తరగతులు, మైనారిటీ, యువజన సర్వీసులు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ విభాగాల్లో అమలవుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను సంబంధిత శాఖల అధికారులతో సభ్యులు చర్చించారు.

    ఈ సమావేశంలో  జిల్లా పరిషత్ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డిప్యూటీ సీఈవో పి నారాయణ మూర్తి, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ఈడీలు ఎస్‌వీఎస్ సుబ్బ‌ల‌క్ష్మి, డీఎస్ సునీత, డ్వామా పీడీ ఎ వెంకటలక్ష్మి, డీపీవో ఎస్వి నాగేశ్వరనాయక్, సీపీవో పిత్రినాథ్, జిల్లా మత్య్స శాఖ అధికారి పి సత్యనారాయణ, పంచాయతీరాజ్‌, ఆర్‌డ‌బ్ల్యూఎస్‌, ట్రాన్స్ కో, ఇరిగేషన్ తదితర శాఖల ఇంజనీర్లు ఇతర సంక్షేమ శాఖల అధికారులు  పాల్గొన్నారు.

Comments