సంక్రాంతికి పూర్తిస్థాయిలో ‘ఫ్యామిలీ ఫిజిషియన్’



*సంక్రాంతికి పూర్తిస్థాయిలో ‘ఫ్యామిలీ ఫిజిషియన్’*


*వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి క్రిష్ణబాబు*

*సెప్టెంబర్ మొదటి వారంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం*

*నవంబర్ చివరి నాటికి మౌలిక వసతుల కల్పన పూర్తవుతుందని వెల్లడి*


అమరావతి (ప్రజా అమరావతి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘ఫ్యామిలీ ఫిజిషియన్’ విధానాన్ని సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని  వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.టి క్రిష్ణబాబు చెప్పారు.  గురువారం ఆయన మంగళగిరిలోని ఎపిఐఐసి భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో  మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణా వ్యవస్థ అందుబాటులో వుండాలన్న వుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ‘ఫ్యామిలీ ఫిజిషియన్’ విధానానికి శ్రీకారం చుట్టారని అన్నారు.  సెప్టెంబర్ మొదటి వారంలో ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు అనుగుణంగానే  ఇటీవల రాష్ట్రంలో పెద్దయెత్తున సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు.  రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయానికి అనుబంధంగా మొత్తం 1,032  వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు చేశామన్నారు.  ప్రతి వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లనిక్ లోనూ సుశిక్షితులైన సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంహెచ్ఎల్ పి), ఒక ఎఎన్ఎం, ముగ్గురు నుండి నలుగురు ఆశా వర్కర్లు గ్రామ ప్రజలకు సేవలందిస్తారని వివరించారు. ఎంఎల్ హెచ్ పిలుగా నర్సింగ్ గ్రాడ్యుయేట్ లను నియమిస్తున్నామని చెప్పారు.  ఇప్పటికే 8,500 మంది ఎంఎల్ హెచ్ పిలను నియమించామని, మరో 1,500 మంది ఎంఎల్ హెచ్ పిల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశామని క్రిష్ణబాబు చెప్పారు.  ఇప్పటికే కొన్ని గ్రామాలలో 1,500 క్లినిక్ లకు సొంత భవనాలున్నాయని, మరో 8,500 భవనాలు నిర్మాణదశలో వున్నాయని చెప్పారు.  ఇందులో 2,000 భవనాల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని, మరో 3,000 భవనాలు తుది మెరుగులు దిద్దుకునే దశలో వున్నాయని వివరించారు.  మిగిలిన 3 వేల భవనాల  నిర్మాణాన్ని డిసెంబర్ నెలాఖరు లోపు పూర్తి చేసి ఈ వ్యవస్థను సుస్థిరం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆదేశించారని చెప్పారు.  ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్ లో 67 రకాల మందులను, 14 రకాల వైద్య పరీక్షలకు అవసరమైన పరికరాలను అందుబాటులో వుంచుతున్నామన్నారు.  సెప్టెంబర్ మొదటి వారం నాటికి ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పిహెచ్ సిలు) ఉన్నాయన్నారు.  ప్రతి మండలంలోనూ రెండు పిహెచ్ సిలు లేదా ఒక పిహెచ్ సి, ఒక సిహెచ్ సి (సామాజిక ఆరోగ్య కేంద్రం)వుండాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశమని వివరించారు. వీటికి అదనంగా ప్రభుత్వం మరో 176 పిహెచ్ సిలను మంజూరు చేసిందని, త్వరలోనే వాటి నిర్మాణం కూడా పూర్తి చేస్తామని అన్నారు. ప్రతి పిహెచ్ సిలో కూడా ఇద్దరు వైద్యులు అందుబాటులో వుంటారని, ప్రస్తుతం 176 మంది వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా వున్నాయని, వాటిని భర్తీ చేసేందుకు  ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని, దీనికి మంచి స్పందన లభించిందని ఆయన వివరించారు. ఈ నెల 24న వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి 31వ తేదీ లోగా కేటాయించిన కేంద్రాలలో బాధ్యతలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  ఆగస్టు 31వ తేదీ నాటికి అన్ని స్థాయిల్లోనూ సిబ్బందిని పూర్తిగా నియమించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రతి పిహెచ్ సిలో 16 మంది సిబ్బంది ప్రజారోగ్య పరిరక్షణా బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు. ‘ఫ్యామిలీ ఫిజిషియన్’ విధానంలో మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయు) అత్యంత ప్రధానమైనదని, పిహెచ్ సిలో వున్న ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని ప్రతి గ్రామ సచివాలయాన్ని మ్యాపింగ్ చేయటం జరుగుతుందన్నారు.  వారు తమకు నిర్దేశించిన గ్రామాలను సందర్శించి అక్కడ వైద్య సేవలందిస్తారన్నారు. ఒక వైద్యుడు ఎంఎంయులో గ్రామాలను సందర్శించి వైద్యసేవలందిస్తుంటే మరొకరు పిహెచ్ సికి వచ్చే వారికి వైద్య సేవలందిస్తారని వివరించారు.  మ్యాపింగ్ చేసిన గ్రామాల్లో వైద్యులు శాశ్వత ప్రాతిపదికపై నెలలో రెండు రోజులు సేవలందిస్తారన్నారు.  ఒక రోజు  ఒక వైద్యుడు ఎంఎంయు లో గ్రామ సందర్శనకు వెళ్తే మరొకరు పిహెచ్ సిలో విధులు నిర్వహిస్తారన్నారు. ఈ ఎంఎంయులు ఒక గ్రామాన్ని నెలలో రెండు సార్లు సందర్శించే విధంగా ప్రణాళిక రూపొందించామని ఆయన చెప్పారు.  ప్రస్తుతం 656 ఎంఎంయు వాహనాలు అందుబాటులో వున్నాయని, వీటికి అదనంగా మరో 434 వాహనాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు.  ఇవన్నీ నవంబర్ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి  వస్తాయని, డిసెంబర్ నుండి ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో నెలలో నిర్దేశించిన రెండు రోజుల పాటు ఎంఎంయులు వైద్య సేవలందిస్తాయని వివరించారు. ప్రస్తుతం 60 శాతం గ్రామ సచివాలయాల్లో నెలకు రెండుసార్లు ఎంఎంయు వైద్య సేవలందుతున్నాయని, మిగిలిన 40 శాతం గ్రామ సచివాలయాల పరిధిలో నెలకు ఒకసారి ఈ సేవలందుతున్నాయని చెప్పారు. డిసెంబర్ నుండి ప్రతి గ్రామ సచివాలయానికీ నెలకు రెండుసార్లు వంతున ఎంఎంయు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.  ఇందులో పిహెచ్ సిలోని ఒక వైద్యాధికారి గ్రామ స్థాయిలో  ఒపి విధులు నిర్వహిస్తారని, మరొకరు పిహెచ్ సిలో ఒపి విధులు నిర్వహిస్తారని వివరించారు. ఎంఎంయు లో వచ్చిన వైద్యాధికారి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లో వుంటారని చెప్పారు.  హెల్త్  క్లనిక్ లోని ఎంఎల్ హెచ్ పిలు, ఎఎన్ఎంలు, ఆశావర్కర్లు గ్రామంలోని గర్భస్థ మహిళలు, బాలింతలు, పాలిచ్చే తల్లుల వంటి వారితో పాటు రక్తపోటు, మధుమేహం వంటి అసాంక్రమిత వ్యాధులతో బాధపడుతున్న వారి జాబితా ను వైద్యాధికారి పర్యటనకు ముందు రోజే సిద్ధం చేస్తారన్నారు.  పిహెచ్ సి వైద్యాధికారి గ్రామంలో  ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ వుంటారని,  ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకూ  ఒపి సేవలు, తరువాత అంగన్వాడీ కేంద్రాలలో యాంటినేటల్, పోస్ట్ నేటల్ సేవలందిస్తారని వివరించారు.  మధ్యాహ్నం 2 గంటల నుండి సచివాలయ పరిధిలోని  ఒక పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థుల ఆరోగ్య సమస్యలను పరిశీలిస్తారని చెప్పారు.  దీనితో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంచం నుండి కదలలేని రోగులు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ లబ్దిదారులను కూడా వారు పరామర్శిస్తారని కదల్లేని వారికి పాలియేటివ్ కేర్ సేవలందిస్తారని  చెప్పారు.  మండలానికి రెండు పిహెచ్ సిలు, పిహెచ్ సికి ఇద్దరు వంతున నలుగురు వైద్యులు అందుబాటులో వుంటారని, వీరికి సగటున  ఒక్కొక్కరికీ ఐదు లేదా ఆరు గ్రామాలను కేటాయిస్తామని చెప్పారు.  వైద్యులు మారినా వారి సేవలు మాత్రం శాశ్వత ప్రాతిపదికన అందుకునేందుకు వీలుగా వారికి కామన్ యూజర్ గ్రూప్ (సియుజి) స్మార్ట్ ఫోన్ లు అందచేస్తామని చెప్పారు.  ఆ ఫోన్ నెంబర్లను గ్రామ సచివాలయాలు , వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లలో ప్రదర్శిస్తామన్నారు.  ఇందువల్ల ఏదైనా సమస్య తలెత్తినపుడు వారికి ఫోన్ చేసి సేవలందుకునేందుకు వీలుంటుందని ఆయన వివరించారు.  దీనితో పాటు గ్రామ స్థాయిలో టెలి మెడిసిన్ సేవలను కూడా మెరుగు పర్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.  ఇప్పటికే 6500 టెలి మెడిసిన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, గ్రామస్థాయిలో వారు అక్కడి వైద్యులను, తీవ్రమైన అనారోగ్య సమస్యల కోసం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన హబ్ లో వున్న స్పెషలిస్టు వైద్యులను సంప్రదించి సలహా సూచనలందుకునే వెసులుబాటు వుంటుందన్నారు.  దీనితో సమస్య పరిష్కారం కాని సందర్భాలలో హెల్త్ క్లినిక్ లలో వుండే ఎంఎల్ హెచ్ పిలు, ఎఎన్ఎంలు వారిని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 

ఎంపానెల్డ్  ఆస్పత్రులకు రిఫర్ చేసి అక్కడికి తరలిస్తారన్నారు. ఫ్యామిలీ  ఫిజీషియన్ విధానం ద్వారా మొత్తమ్మీద 80 శాతం మేర ఆరోగ్య సమస్యలకు గ్రామస్థాయిలోనే పరిష్కారమందించే సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియ ద్వారా తమకు ఒక ‘ఫ్యామిలీ ఫిజిషియన్’ అందుబాటులో వున్నారన్న విశ్వాసాన్ని గ్రామాల్లో ని ప్రజలకు కల్పించటమే ఫ్రభుత్వ  లక్ష్యమని ఆయన చెప్పారు.  ఏ అనారోగ్య సమస్యకు ఏ స్థాయిలో వైద్య సేవలందుబాటులో వున్నాయన్న అంశంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.  తద్వారా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యామిలీ ఫిజిషియన్’ విధానాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు వైద్యాధికారులు,  ఇతర సిబ్బంది సహకరించాలని ఆయన కోరారు. 

ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ , వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ మరియు ఏపీ శాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ జి.ఎస్. నవీన్ కుమార్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.


Comments