ఎలక్ట్రిక్ వాహన రంగానిదే భవిష్యత్ : పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్*ఎలక్ట్రిక్ వాహన రంగానిదే భవిష్యత్ : పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్*


*ఏపీలో పెట్టుబడులకు పలు కంపెనీల ఆసక్తి*


*ప్రజలకు హాని చేయని పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ పెద్దపీట*


*ఏపీలో ఈవీ వ్యవస్థ ఏర్పాటుకు కావలసిన మౌలిక వసతులను సమకూరుస్తాం*


*వరల్డ్ ఎకనమిక్ ఫోరం వర్చువల్ సదస్సులో పరిశ్రమల మంత్రి అమర్ నాథ్*అమరావతి, ఆగస్ట్, 05 (ప్రజా అమరావతి): భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వాహనరంగానిదే హవా ఉంటుందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ హిత పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఏపీలో ఎలక్ట్రిక్ వాహనరంగ వ్యవస్థ ఏర్పాటుకు కావలసిన మౌలిక వసతులను సమకూరుస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో శుక్రవారం వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో జరిగిన వర్చువల్ సదస్సులో మంత్రి అమర్ నాథ్ మాట్లాడుతూ మంచి ఎక్కడున్నా తీసుకుంటామన్నారు. 2050 కల్లా ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయంగా పెట్టుబడికి అనువైన రాష్ట్రంగా మారనుందన్నారు.  గ్రీన్ ఎనర్జీతో పాటు ఎలక్ట్రానిక్ వాహనరంగాన్ని ఏపీ ప్రోత్సహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.  రవాణా అనుసంధానం, పుష్కలంగా సహజ వనరులు, నైపుణ్యం కలిగిన యువతీయువకులు, అపారంగా మౌలిక వసతులు ఏపీలో ఉన్నాయని మంత్రి సదస్సులో  ఎలక్ట్రిక్ వాహన రంగ కంపెనీలకు చెందిన సీఈవోలకు వివరించారు. ఏపీలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఈవీరంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని మంత్రి అమర్ నాథ్ ఆహ్వానం పలికారు.


గ్రీన్ ఎనర్జీ లభ్యత,  ఇంజనీరింగ్, పరిశోధన, అభివృద్ధి, ఎలక్ట్రిక్ వాహన రంగంలో పర్యావరణ వ్యవస్థ ఏర్పాటు, ఎలక్ట్రానిక్ తయారీ హబ్ గా తీర్చిదిద్దడం, బ్యాటరీ మార్పిడీకి సంబంధించిన కీలక అంశాలను పాలసీలో పొందు పరచడంపై కొన్ని ఈవీ కంపెనీలు చర్చలో భాగంగా సూచనలిచ్చాయి. ఈ సదస్సులో సీ4వీ, ఓలా ఎలక్ట్రిక్, అవేజ్, గోగొరో, అవేరా, బౌన్స్, కాసెస్, టాటా పవర్, రిలయన్స్ న్యూ, షెల్ ఇండియా, ఎప్సిలన్ కార్బన్, కియా ఇండియా, హ్యుందయ్ మోటార్స్, ఈవీ నవ్, హాప్ ఎలక్ట్రిక్, ఫాక్స్ కన్ , జేబీఎం తదితర కంపెనీల సీఈవోలు సదస్సులో పాల్గొన్నారు. *ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షల లక్ష్యాన్ని ప్రశంసించిన నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు సిన్హా*


అనుకున్నది ఏదైనా వెంటనే చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందుంటుందని  నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు సిన్హా ప్రశంసించారు. ఒక ఆలోచన వస్తే వెంటనే ఆచరణలో పెట్టడంలోగానీ, ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని ప్రణాళికతో లక్ష్యాన్ని చేరడంలో గానీ ఏపీ తీరు ఆదర్శమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఆంధ్రప్రదేశ్ దారి చూపే స్థాయికి చేరుతుందన్నారు.*కాలుష్య మరణాలు తగ్గించగలిగితే 5శాతం వృద్ధిరేటు సాధించినట్లే : ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ వీసీ &ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది*


గ్రీన్ ఎనర్జీతో  కాలుష్యం తగ్గించుకున్నప్పుడే పర్యావరణ హిత పరిశ్రమల స్థాపన సాధ్యమని ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ వీసీ &ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది వెల్లడించారు. దేశవ్యాప్తంగా 15 ముఖ్య పట్టణాల్లో 11 పట్టణాలు ఇప్పటికే కాలుష్యంతో నిండిపోయాయన్నారు. గతేడాది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు విపరీతంగా పెరగడం శుభ పరిణామమని సీఈవో స్పష్టం చేశారు. క్రితం సంవత్సరం 26వేల వాహనాల కొనుగోలు కాస్త 77వేల వాహనాల కొనుగోలు స్థాయికి చేరడం ఈవీ ప్రాముఖ్యతకు నిదర్శనమన్నారు. అయితే, ప్రతి ఏడాది మన దేశంలో పర్యావరణ కాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య 20 లక్షలు ఉండడం పట్ల అప్రమత్తమవ్వాలని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి 2 మిలియన్ల మరణాలు తగ్గించగలిగితే 5శాతం వృద్ధిరేటు సాధించినట్లేనని సుబ్రమణ్యం జవ్వాది పేర్కొన్నారు.


వాణిజ్యం, ప్రజా రవాణా రంగాలు  కలిపి 10 లక్షల విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంతో ముందుకువెళుతుందని పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ళ వెల్లడించారు. అనుబంధ రంగాలన్నింటినీ  ఈవీ పర్యావరణ వ్యవస్థను ఏపీలో తీర్చిదిద్దడానికి ప్రణాళికతో ముందుకెళతామన్నారు. 


2030 నాటికి రాష్ట్ర ఇంధన వినియోగంలో గ్రీన్ ఎనర్జీ వాటా 45శాతం లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు వెళుతున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు. గ్రీన్, పునరుత్పాదక శక్తి వైపు మళ్ళేందుకు గల అన్ని మార్గాలను అన్వేషిస్తూ సర్వ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.  2023 కల్లా ఆంధ్రప్రదేశ్ 10.8 గిగా వాట్ల సామర్థ్యం లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు.


ప్రస్తుతం డీజిల్ తో నడుస్తున్న ప్రజా రవాణా వ్యవస్థను  50శాతం విద్యుత్ వాహనాలుగా మలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టీ క్రిష్ణబాబు వెల్లడించారు. మొత్తం ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న 7000 బస్సులలో 1000 బస్సులని  విద్యుత్ వాహనాలుగా మార్చే దిశగా ముందుకువెళుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా ఇప్పటికే తిరుపతి నుంచి తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. 


ఈ సదస్సులో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి  ఎం.టి క్రిష్ణబాబు,  నీతి ఆయోగ్ సలహాదారు (మౌలిక వసతుల అనుసంధానం, రవాణా, ఎలక్ట్రిక్ మొబిలిటి) జె.సిన్హా,  ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మాల, వరల్డ్ ఎకనమిక్ ఫోరం, మూవింగ్ ఇండియా ప్రతినిధుల బృందం, ఎలక్ట్రానిక్ మానుపాక్చరింగ్ కంపెనీల సీఈవోలు,తదితరులు పాల్గొన్నారు.Comments