పిఆర్ & ఆర్ డి కార్యాలయంలో ఘనంగా స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకలు...
తాడేపల్లి (ప్రజా అమరావతి);
గ్రామాలే దేశానికి వెన్నుముక అన్న గాంధీజీ, గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలన్న అంబేద్కర్ ల స్పూర్తిని మార్గదర్శకంగా ఎంచుకుని ఉద్యోగులు పనిచేయాలని, స్వతంత్ర సముపార్జనకు తమ ప్రాణాలు, జీవితాలను ధారబోసిన మహనీయులకు శ్రద్ధాంజలి ఘటించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో జెండా వందనం కావించి, అనంతరం ఆయన ప్రసంగించారు.
దారిద్ర్యం, అసమానతలు, అవిద్య నుంచి బయటకు రావాలని అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో అన్ని శాఖలతో సమన్వయ పరచుకుంటూ పిఆర్& ఆర్ డి శాఖ ఉద్యోగులు నిరుపేద గ్రామీణుల అభివృద్ధికి పాటు పడాలని అంటూ అజాదికా అమృత్ మహోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న మనం, దేశ స్వాతత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకోవటం మన గురుతర బాధ్యత
అని ఆయన అన్నారు. గతాన్ని ప్రస్తుతంతో పోల్చినప్పుడు జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, అక్షరాస్యత వంటి పలు సూచికలలో గణనీయ మార్పులు చోటుచేసుకున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా పలు కార్పోరేట్ కంపెనీలకు భారతీయులు సారధ్యం వహిస్తున్నారని, ఇది ప్రతి భారతీయుడు గర్వించ దగ్గ అంశమని కమిషనర్ కోన శశిధర్ చెప్పారు.
అభివృద్ధికి సమాంతరంగా రెండవ కోణాన్ని కూడా చూడాలని, ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జీవితాలలో మార్పులు తేవడానికి నైపుణ్యాలు పెంచే దిశగా ప్రణాళికలు రచించుకోవాలని, చదువుకున్న తరం భవిష్యత్ తరాలను మార్చుతుందనే దృష్టి కోణంతో మన అందరం ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా, ప్రధాని మోడీజి గుర్తించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని ఆయన సూచించారు. పంచాయతీరాజ్ అంటే పారిశుద్ధ్యం మాత్రమే కాదని, గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి అంశాన్ని ఒక సూచికగా తీసుకుంటూ సమాచారాన్ని ఏకీకృత వ్యవస్థ ద్వారా సేకరించి తద్వారా ప్రణాళిక రచన చేసుకోవాలని సిబ్బందికి ఉద్బోదించారు. 75 వసంతాల అమృత మహోత్సవాన్ని ఒక కుటుంబ కార్యక్రమ౦లా జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని అంటూ, త్వరలో ఉద్యోగుల కుటుంబ సభ్యుల కలయికలు, క్రీడా పోటీలు నిర్వహించుకోబోతున్నామని, తద్వారా సిబ్బందిలో నూతన ఉత్సాహాన్ని ని౦పబోతున్నామని భవిష్యత్ లో ఉద్యోగులు అందరు ప్రభుత్వానికి, శాఖకు మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాని అంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ ఉద్యోగులు, సిబ్బందికి శుభాభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇజిఎస్ సంచాలకులు పి. చినతాతయ్య మాట్లాడుతూ 75 వసంతాల అమృత మహోత్సవ వేడుకలు ఎంతో ప్రత్యేకమైనవని, ఇది ఒక గొప్ప కలయికకు వేదికగా నిల్చిందని అంటూ భవిష్యత్ లో పిల్లలందరూ మేటి భారతావనిని చూస్తారని అన్నారు. 75 ఏళ్ల క్రితం నాటి స్పూర్తి, పోరాట పటిమ, పట్టుదల, ఔన్నత్యాన్ని కాపాడేందుకు పిఆర్ & ఆర్ డి ఉద్యోగులు అంకితభావ౦తో, అందరితో మమేకమై మరింత మెరుగ్గా పనిచేయాలని ఆయన కోరారు.
ఈ వేడుకల్లో ఉపాధి హామీ జాయింట్ కమిషనర్లు ఎం శివ ప్రసాద్, విజయ లాజరస్, పిఆర్ డిప్యూటీ కమిషనర్లు డి. సత్యనారాయణ, నాగార్జున సాగర్, వాటర్ షెడ్ జాయింట్ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, పిఆర్ & ఆర్ డి ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్దినులు దేశభక్తి గీతాలు ఆలపించగా, సిద్దార్ధ మహిళా కళాశాల ఎన్.సి.సి కేడేట్స్ పెరేడ్ నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పలువురు సిబ్బందికి మెరిట్ సర్టిఫికెట్లను కమిషనర్ అందజేశారు.
addComments
Post a Comment