కలియుగంలో భగవంతున్ని ప్రజలకు మరింత చేరువుగా



నెల్లూరు,ఆగస్టు18 (ప్రజా అమరావతి):   కలియుగంలో భగవంతున్ని ప్రజలకు మరింత చేరువుగా


తీసుకుపోయేందుకు వైభవోత్సవ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు.


గురువారం ఉదయం నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం- విపిఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర  వైభవొత్సవ  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సతి సమేతంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ నగరంలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు ఈనెల 14వ తేదీ నుండి మొదలై చాలా ఘనంగా జరుగుతున్నాయన్నారు.  ఈ ఉత్సవాలు ఈనెల 20వ తేదీ వరకు సాంప్రదాయ బద్ధంగా తిరుమలలో శ్రీవారికి ఏవిధంగా సేవలు అందుతాయి ఇక్కడ కూడా అలాంటి సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతినిత్యం సుప్రభాత సేవ నుండి రాత్రి పవళింపు సేవ వరకు ఎంతో చక్కగా జరుగుతున్నాయన్నారు. సాక్షాత్తు భగవంతుడే భక్తుల చెంతకు వచ్చినట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజలకు కావలసిన మంచినీరు, మరుగుదొడ్లు, క్యూ లైన్లు తదితర ఏర్పాట్లు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సజావుగా చేయడం జరిగిందన్నారు. వివిధ సేవలకు సంబంధించి ప్రవేశ,నిష్క్రమణ మార్గాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. టీటీడీ నుంచి 400 మంది సిబ్బంది రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారన్నారు.  ఈ ఉత్సవాలన్నీ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇటువంటి ఉత్సవాలు నగరంలో ఏడు సంవత్సరాల తర్వాత మరల జరుపుకోవడం,  పెద్ద సంఖ్యలో భక్తులు రావడం చాలా ఆనందాన్ని ఇస్తున్నాయన్నారు. సజావుగా జరిపేందుకు తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, న్యూఢిల్లీ శ్రీ వెంకటేశ్వర దేవస్థానం స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 

Comments