ఎలాంటి పక్షపాతం చూపించకుండా అందరికీ సంక్షేమ పథకాలు.

 


పోలవరం (గూడూరు మండలం)

ఆగస్టు 10 (ప్రజా అమరావతి);


*ఎలాంటి పక్షపాతం చూపించకుండా అందరికీ సంక్షేమ పథకాలు*



*గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్*


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి పక్షపాతం చూపించకుండా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.


గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం గూడూరు మండలం, పోలవరం గ్రామంలో మంత్రి ఇంటింటికి వెళ్లి ఒకొక్క లబ్దిదారునికి ప్రభుత్వం అందిస్తున్న పధకాల లబ్ది వివరాలు తెలియజేసి జగనన్నకు మీ ఆశీస్సులు అందజేయాలంటూ విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు, స్థానిక సచివాలయ సిబ్బందితో కలసి మంత్రి పోలవరం గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి నమస్తే తల్లీ బాగున్నారా అంటూ పలకరిస్తూ వారు వివిధ పథకాల క్రింద పొందిన లబ్ది మొత్తం వివరాలు తెలియజేశారు.


తమకు ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు అందుతున్నాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే, గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు మంత్రిని కోరారు. అందుకు ఆయన గ్రామంలో రూ. 1.44 కోట్ల వ్యయంతో త్వరలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇస్తామని, ఇప్పటికే అందుకు సంబందించిన టెండర్లను పిలిచినట్లు తెలిపారు. దానితో పాటుగా గ్రామంలో పాడైన రహదారులకు మరమత్తులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.


సిలంకుర్తి నాగ సునీత మొత్తం 1.20 లక్షలు లబ్ధి పొందారని, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని మంత్రి ఆమెను అడుగగా, దివ్యాంగురాలైన తన కూతురు నాగ శివపార్వతి 10 వ తరగతి వరకు చదువుకుందని, ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరింది. అందుకు స్పందించిన మంత్రి తన సిబ్బంది ద్వారా వివరాలను తీసుకుని అవకాశాన్ని బట్టి తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చారు.


కోకిలాంబా అనే మహిళ తన సమస్యను మంత్రికి వివరిస్తూ నేతన్న నేస్తం కు బదులుగా తనకు రైతు భరోసా పడుతుందని, దీంతో తను నష్టపోతున్నానని తెలియజేయగా మంత్రి వెంటనే వీఆర్వో ని పిలిచి లోపాన్ని పరిశీలించి సరిచేయాలని ఆదేశించారు.

చెలమలశెట్టి అరవింద లక్ష్మీ వివిధ పథకాల ద్వారా తను 5.04 లక్షలు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసింది.

 ఈ కార్యక్రమంలో ఎంపిపి సంగా మధు, జడ్పిటిసి వేముల సురేష్, వైస్ ఎంపిపి పిచ్చుక గంగాధరరావు, సర్పంచ్ నక్కిన నాగరాజు, తాశిల్డారు బి విజయ్ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.


Comments