నిత్యం అసత్య ప్రచారమే వైసిపి అస్త్రం...క్షేత్ర స్థాయిలో దాన్ని తిప్పి కొట్టాలి*వైసిపి ప్రభుత్వం రాష్ట్రానికి పట్టిన వైరస్*


*నిత్యం అసత్య ప్రచారమే వైసిపి అస్త్రం...క్షేత్ర స్థాయిలో దాన్ని తిప్పి కొట్టాలి.*


*మీ పోరాటం బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాలి*


*పార్టీ నేతలతో రివ్యూలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు*


అమరావతి (ప్రజా అమరావతి):- వైసిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి వైసీపీ వైరస్  పట్టిందని చంద్రబాబు ఆరోపించారు. వేధింపులు, కబ్జాలు, కేసులు, బాధితుల ఆత్మహత్యలు, కూల్చివేతలు అనేవి ప్రతి రోజూ సాధారణం అయిపోయాయని అన్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా ఉపాధి కోల్పోవడం ఒకటి అయితే.....వైసిపి నేతల దౌర్జన్యాలు, అక్రమాల కారణంగా చాలా మంది జీవితాలను కోల్పోతున్నారని చంద్రబాబు అన్నారు. బాధల్లో ఉన్న ప్రజలకు టిడిపి నేతలు, కార్యకర్తలు తమ పోరాటం ద్వారా ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించాలని చంద్రబాబు అన్నారు. స్థానిక సమస్యలపై ప్రజలను కూడా కలుపుకుని పోరాటాలు చెయ్యాలని చెప్పారు. జనం ఇప్పటికే పూర్తిగా విసిగిపోయి ఉన్నారని...వారికి టిడిపి నాయకత్వం అందించి సరైన దిశగా నడిపించాలని సూచించారు. వైసిపి నిత్యం అసత్య ప్రచారంతో, ఎదురుదాడి అనే వ్యూహంతో పని చేస్తుందని...వీటిని క్షేత్ర స్థాయి నుంచి తిప్పి కొట్టాలని సూచించారు. పార్టీ అసెంబ్లీ సిగ్మెంట్ల ఇంచార్జ్ లతో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న భేటీలు నేడు కూడా కొనసాగాయి. నిన్నటి వరకు 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో రివ్యూలు చేసిన చంద్రబాబు...ఈరోజు మరో మూడు అసెంబ్లీ ల ఇంచార్జ్ లతో సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి లోని తన నివాసంలో పార్వతీపురం, రంపచోడవం, మాడుగుల నియోజకవర్గాల ఇంచార్జ్ లతో చంద్రబాబు రివ్యూలు చేశారు. ఆయా నియోజకవర్గాల ఇంచార్జ్ లు బొబ్బలి చిరంజీవులు, వంతల రాజేశ్వరి, పివిజి కుమార్ ఈ రివ్యూలకు హాజరయ్యారు. నేతలతో రివ్యూలలో ముందుగా స్థానిక రాజకీయ అంశాలపై చర్చిస్తున్న అధినేత...తరువాత పార్టీ కార్యక్రమాల నిర్వహణ, నేతల పనితీరుపై చర్చిస్తున్నారు. బాగా పనిచేస్తున్న నేతలను అభినందిస్తూనే....వివిధ కార్యక్రమాల్లో వెనుకబడిన వారి నుంచి అధినేత వివరణ కోరుతున్నారు. ప్రతి ఇంచార్జ్ నియోజకవర్గంలో కనీసం 10 నుంచి 15 రోజులు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. నియోజకవర్గానికి అబ్జర్వర్ గా ఉన్న నేతలు నెలలో కనీసం 8 రోజులు ఆ నియోజవర్గంలో పర్యటించాలని సూచించారు. ప్రతి నేతా గ్రామ స్థాయిలో క్యాడర్ ను కలుపుకుని పర్యటనలు చెయ్యాలని సూచించారు. కార్యకర్తలకు గౌరవం, ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజలను కలవడం అనేది ఒక అలవాటుగా ప్రతి నేత మార్చుకోవాలని చంద్రబాబు తెలిపారు.

Comments