శాసన మండలి,శాసన సభ ప్రాంగణాల్లో ఘనంగాస్వాతంత్ర్యధినోత్సవ వేడుకలు

 *శాసన మండలి,శాసన సభ ప్రాంగణాల్లో ఘనంగాస్వాతంత్ర్యధినోత్సవ వేడుకలు*

*•శాసన మండలి భవనంపై జాతీయ జెండాను ఎగురవేసిన చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు*

*•శాసన సభ భవనంపై జాతీయ జెండాను ఎగురవేసిన స్పీకర్ తమ్మినేని సీతారామ్*

                                                                                                                                                                                   అమరావతి, ఆగస్టు 15 (ప్రజా అమరావతి): భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన వజ్రోత్సవ వేళ  “ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను”  ఘనంగా జరుపుకుంటున్న సందర్బంగా నిర్వహిస్తున్న 76 వ స్వాతంత్ర్య్ర దినోత్సవవేడుకలు  రాష్ట్ర శాసన మండలి మరియు రాష్ట్ర శాసన సభా ప్రాంగణాల్లో  ఎంతో ఘనంగా జరిగాయి. రాష్ట్ర శాసన మండలి భవనంపై  శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మరియు రాష్ట్ర శాసన సభ భవనంపై  శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ వరుసగా జాతీయ జెండాలను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. వేరు వేరుగా జరిగిన ఈ జెండా వందన కార్యక్రమంలో తొలుత వారిరువురూ వేరు వేరుగా ఎస్పిఎఫ్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తదుపరి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. రాష్ట్ర ప్రజలు అందరికీ స్వాతంత్ర్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర శాసన మండలి మరియు రాష్ట్ర శాసన సభా అధికారులు, సిబ్బందికి  కూడా స్వాతంత్ర్య్ర దినోత్సవ శుభాకాంక్షలను వారు తెలిపారు. 

                                                                                                                                                                                *రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మాట్లాడుతూ.......*

ఈ సందర్బంగా రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా కేంద్ర్ర  ప్రభుత్వం ఏడాది కాలం పాటు నిర్వహిస్తున్న  “ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను”  రాష్ట్రంలో కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రప్రభుత్వం పిలుపును పురస్కరించుకుని ఈ నెల 13 నుండి నేటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా “హర్ ఘర్ తిరంగా” (ఇంటింటా మువ్వన్నెల జెండా) కార్యక్రమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు. జాతీయ జెండా ప్రతిష్ట, విలువ, గొప్పదనాన్ని దేశ ప్రజలకే కాకుండా ప్రపంచానికి చాటిజెప్పాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం  జరిగిందని ఆయన తెలిపారు. 400 ఏళ్లపాటు జరిగిన పరాయి పాలన నుండి దేశాన్ని విముక్తి చేసేందుకు సాగిన స్వాతంత్య్రోధ్యమంలో ఎంతో కీలక పాత్రపోషించిన జాతీయ జెండాను మన తెలుగువాడైన శ్రీ పింగళి వెంకయ్య 1921 లో  రూపొందించడం మనకెంతో గర్వకారణమన్నారు. 1947 లో స్వాతంత్య్రం వచ్చిన తదుపరి ఈ  త్రివర్ణ పతాకాన్ని మన జాతీయ జండాగా ఖరారు చేయడం జరిగిందన్నారు. అప్పటి నుండి కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ఈ దేశ పౌరులు అందరూ ఎంతో గౌరవ ప్రథంగా  ఈ జాతీయ జండాను కాపాడు కోవడం జరుగుచున్నదన్నారు.

 దేశంలోని పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలని అనేక ప్రభుత్వాలు కృషిచేయడం జరిగిందన్నారు. అదే తరహాలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అద్యక్షతన రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకై పలు వినూత్న పథకాలను రూపొందించి అమలు చేయడం వల్ల పేద ప్రజల్లో ఎంతో దైర్యం, భరోసా నెలకొన్నట్లు ఆయన తెలిపారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల అభివృద్దితో పాటు మహిళలు, బడుగు, బలహీన వర్గాలు, కార్మిక, ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు ఈ దేశంలోనే ఎంతో అమోఘంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అమ్మఒడి, నాడు-నేడు, ఆంగ్లమాధ్యమంలో విద్యా భోధన తదితర వినూత్న పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి పేదవానికి ఉచిత విద్యను అందజేయడం జరుగుచున్నదన్నారు. అదే విధంగా మహిళా సాధికారతకై పలు పథకాలను అమలు చేయడమే కాకుండా అనేక సందర్బాల్లో కార్మికులకు అనుకూలమైన వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న తక్కువ పాటి వనరులను చక్కగా సద్వినియోగం చేస్తుకుంటూ రాష్ట్రంలోని ప్రతి పేదవానికి స్వాతంత్ర్య ఫలాలు అందే విధంగా అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

                                                                                                                                                                                 *రాష్ట్ర శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ......*

 ఈ సందర్బంగా రాష్ట్ర శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయి వజ్రోత్సవ వేడుకలను జరుకుంటున్న నేపథ్యంలో గత 75 ఏళ్లలో సాధించిన ప్రగతిని ఒక సారి సింహావలోకం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అదే విధంగా ఎందరో మహానుభావుల ప్రాణ  త్యాగాల ఫలితంగా  సాధించుకున్న స్వాతంత్ర్య్ర దినోత్సవం సందర్బంగా ఆ మహానుభావుల త్యాగాలను ఒక సారి స్పురణకు తెచ్చుకుంటూ, వారి లక్ష్యాలు, ఆశయ సాధన దిశగా మనం  అడుగులు వేస్తున్నామా లేదా అనే విషయాన్ని మనందరం అలోచించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.  అయితే వారి ఆశయాలను చాలావరకూ సాధించడం జరిగిందని, ఇంకా ఎంతో సాధించాల్సిన ఉందన్నారు. పేదరిక నిర్మూలనకు, ప్రతి పౌరుని జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో శక్తినిఅంతా ఉపయోగిస్తున్నాయన్నారు.  డా.బాబా సాహెబ్ అంబేద్కర్  భారత రాజ్యాంగ పీఠికలో, ఆదేశిక సూత్రాలలో పొందుపర్చిన లక్ష్యాలు, ఆశయాల సాధనకు అనుగుణంగా కుల, మత, జాతి, ప్రాంతీయ విభేదాలు లేకుండా స్వాతంత్ర్య ఫలాలు ప్రజలు అందరికీ సమానంగా అందించాలనే లక్ష్యంతో  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఎంతో అద్బుత మని కొనియాడారు. అదే గుండె నిబ్బరంతో మనమంతా ఆయన అడుగు జాడల్లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.  ప్రతి చోట విమర్శలు ఉండటం సహజమేనని,  మంచి విమర్శలను స్వీకరిస్తామని, చెడు విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.  దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంకా ప్రక్క దేశాల నుండి వస్తున్న బెదిరింపులకు దేశం ఏమాత్రం బెదరక సానుకూల మనస్తత్వంతో శాంతిని కోరుకుంటూ ముందుకు వెళుతున్న విధానాన్ని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రాలు అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన పిలుపునిచ్చారు. 

 రాష్ట్ర శాసన సభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు, డిప్యుటి సెక్రటరీ కె.రాజ్ కుమార్, రాష్ట్ర అసెంబ్లీ చీఫ్ మార్షల్ థియో ఫిలాస్ తదితరులతో పాటు  శాసన మండలి, శాసన సభ అధికారులు, సిబ్బంది  ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

                                                                                                                                                                           

Comments