నెల్లూరు,ఆగస్టు9 (ప్రజా అమరావతి):--బారాషహీద్ దర్గా రొట్టెల పండగకు లక్ష మంది భక్తులు వచ్చిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు
సజావుగా చేశామని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పేర్కొన్నారు.
మంగళవారం మధ్యాహ్నం నగరంలోని బారాషాహీద్ దర్గా ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ విభాగాన్ని మంత్రి సందర్శించారు. అందులో డ్రోన్ సహాయంతో పాటు సీసీటీవీల్లో రికార్డవుతున్న వీడియో పుటేజ్లను జిల్లా పోలీసు అధికారి శ్రీ సిహెచ్ విజయరావుతో కలిసి మంత్రి పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ విభాగం పనిచేయు తీరుతెన్నులను మంత్రి ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టిగా నిఘా ఉంచాలని మంత్రి ఎస్పీకి సూచించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ ప్రాశ స్తాన్ని గుర్తించి నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 15 కోట్ల రూపాయలను దర్గా అభివృద్ధి కోసం మంజూరు చేశారన్నారు. వచ్చే సంవత్సరం మరింత అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిచేసుకుని మరింత మెరుగ్గా పండుగ కార్యక్రమాలను జరుపుకునే అవకాశం ఉందన్నారు. వచ్చే మూడు నాలుగు రోజులు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బ్రహ్మాండంగా పండుగను జిల్లాలో జరుపుకున్నామని సంకేతాలిచ్చెలా సంపూర్ణ సహకారం అందించాలని కోరుతున్నానన్నారు. రాష్ట్ర మంత్రుల పర్యటన షెడ్యూల్ ఇంకా రాలేదని వారి షెడ్యూలు వలన సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని ముందస్తు కార్యక్రమాల వలన పండుగకు రాలేకపోవచ్చని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 30 వేల నుంచి 50వేలమంది భక్తులు ఈ ప్రాంతానికి రావచ్చని ఎంతమంది వచ్చినా అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందన్నారు. ట్రాఫిక్కు పార్కింగ్ సమస్యలు లేకుండా చూస్తామని స్నానాలు గదులు మంచినీటి వసతులు కల్పించడం జరిగిందన్నారు. లక్ష మంది వచ్చినా భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
addComments
Post a Comment