దేశాన్ని కాపాడేవారు సైనికులైతే సమాజాన్ని కాపాడేవారు పోలీసులు



నెల్లూరు ఆగస్టు 26 (ప్రజా అమరావతి):దేశాన్ని కాపాడేవారు సైనికులైతే సమాజాన్ని కాపాడేవారు పోలీసుల


ని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశంసించారు. 


శుక్రవారం మధ్యాహ్నం నెల్లూరు నగరంలోని పోలీసు కవాతు మైదానం లోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో జరిగిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ ఎంతో గొప్పదని అది నిర్వీర్యం అయితే సమాజం అంతరించే ప్రమాదం ఉందని చెప్పారు. సాధారణంగా ఉద్యోగస్తులకు  విధుల్లో కొన్ని పరిమితులు ఉంటాయని, కానీ పరిమితులు లేకుండా సమయానికి నిద్ర, తిండి లేకుండా అనేకమైన రాజకీయ ఒత్తిళ్లకు గురవుతూ పోలీసులు ఎంతో సమతుల్యతను పాటిస్తూ విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. పోలీసుల్లో కచ్చితంగా కరకుతనం ఉండాలని లేకుంటే సంఘవిద్రోహశక్తులను నియంత్రించడం సాధ్యపడదన్నారు. అలాగే బలహీనులు మనుగడ సాగించే విధంగా కూడా పోలీసులు విధులు నిర్వహించాలన్నారు. ప్రజలు ఖద్దరు ధరించే రాజకీయ నాయకులను ప్రశ్నిస్తారని, అదే కాకి వస్త్రం ధరించే పోలీసులంటే భయపడతారన్నారు. ఈ పోలీసు వ్యవస్థ సజావుగా సాగాలంటే వారిలో ఉన్న మానసిక  ఒత్తిళ్ళను తొలగించేందుకు అప్పుడప్పుడు క్రీడలు ఎంతగానో ఊరట  కలిగిస్తాయన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు గాని లేదా చెడ్డ పేరు గాని రావాలన్నా పోలీసు వ్యవస్థ పై ఆధారపడి ఉంటుందన్నారు.  జిల్లా చాలా ప్రశాంతమైనదని రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనదని చెప్పారు. ఇటీవల జిల్లా పోలీసు అధికారి పోలీసుల్లో ఉత్సాహాన్ని నింపేందు కోసం క్రీడలు, సాంస్కృతిక  కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు.   రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీసులకు  వారాంతపు సెలవు ఇచ్చినప్పటికీ సిబ్బంది కొరత వలన అది సరిగా అమలు కానప్పటికీ జిల్లాలో సజావుగా అమలు చేస్తుండటం అభినందనీయమన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అన్ని వార్డు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను ప్రత్యేకంగా నియమించిందన్నారు. దిశా చట్టం చేసే సమయంలో అసెంబ్లీలో తాను కూడా సభ్యులుగా ఉండటం తనకెంతో గర్వంగా ఉందన్నారు. దిశా చట్టం అమలు గురించి ఇతర రాష్ట్రాల వారు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారంటే అది మన రాష్ట్ర గొప్పతనమన్నారు.  ప్రత్యేకించి విదేశీ వనిత పై జరిగిన దాడి సంఘటన చేదించడం,  దొంగలింపబడిన రు.1.26 కోట్ల రూపాయల పెన్షన్ డబ్బులు తిరిగి వసూలు అయ్యేలా చేయడం,  అనేక దొంగతనాలు, హత్యలు, బాలికల అక్రమ రవాణా, ఆయుధాల అక్రమ అమ్మకాలు వంటి కేసులను చాకచక్యంగా చేదించడంతోపాటు శాంతిభద్రతలను కాపాడటంలో ఎస్పీ నేతృత్వంలో పోలీస్ యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.  అంతే కాకుండా స్పందన కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టి ఆవేదన ఆక్రందనతో వస్తున్న అర్జీదారులకు స్వాంతన చేకూరుస్తూ వారికి భోజనం తదితర ఏర్పాట్లు చేసి వారిలో ప్రభుత్వం న్యాయం చేస్తుందనే భరోసాను కల్పించడం ద్వారా జిల్లా పోలీసు యంత్రాంగం ఇతర జిల్లాలకు ఆదర్శవంతంగా నిలిచిందన్నారు.  ఈ సందర్భంగా అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నానన్నారు.


అంతకుమునుపు జిల్లా పోలీసు అధికారి సిహెచ్ విజయ రావు మాట్లాడుతూ జిల్లాలో వివిధ నేరాలను అదుపు చేయడంతో పాటు చేదించడంలోనూ చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులు సిబ్బందిని గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 72 మందికి వివిధ పతకాలు ప్రకటించాయన్నారు. ఇందులో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి 57 మందికి అతి ఉత్కృష్ట, ఉత్కృష్ట సేవా పతకాలు 2018 సంవత్సరానికి వచ్చాయన్నారు. అలాగే రాష్ట్ర డిజిపి కమాండేషన్ డిస్కులు 15 మంది పోలీస్ అధికారులు సిబ్బందికి 2020 సంవత్సరానికి వచ్చాయన్నారు. జిల్లాలో రొట్టెల పండుగ తదితర ఉత్సవాలను సజావుగా నిర్వహించడం, వివిధ నేరాలను ఛేదించడంలో చూపిన ప్రతిభకు  గాను మరో 107 మందికి అవార్డులు అందజేయడం జరుగుతుందన్నారు.  జిల్లాలో గత ఒకటిన్నర సంవత్సర కాలంగా  శాంతి భద్రతల సమస్యలను,  వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా పోలీసు యంత్రాంగం ఎదుర్కొని 30 వేల మంది ప్రాణాలను కాపాడిందన్నారు.  చెన్నై మార్గంలో గూడూరు వద్ద రాకపూర్వకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాత్రింబవళ్లు శ్రమించిందన్నారు. ఆస్తుల నేరాలు, రహదారి ప్రమాదాల పై వెంటనే స్పందించి  చాలామంది ప్రాణాలు కోల్పోకుండా కాపాడగలిగామన్నారు. జిల్లాలో 30 శాతం  రహదారి ప్రమాదాలను తగ్గించగలిగామన్నారు.  దిశా యాప్ ను డౌన్లోడ్ చేయడంతో పాటు సజావుగా అమలు చేయడంలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉందన్నారు.   బారాషాహిద్ దర్గా రొట్టెల పండగ, ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల సందర్భంగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి శాంతి భద్రతలను కాపాడడంతో ప్రజలనుండి మన్ననలు పొందగలిగామన్నారు. రానున్న గణేష్ చతుర్థి ఉత్సవాలు ఇతర ఉత్సవాలలో కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి శాంతి  భద్రతలు కాపాడేందుకు కృషి చేస్తామన్నారు.  పలు నేరాల కేసుల్లో గట్టిగా వాదనలు వినిపించి నేరస్తులకు కఠిన శిక్షలు పడే విధంగా కృషిచేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కూడా ఈ సందర్భంగా సన్మానించుకోవడం జరుగుతుందన్నారు.


అనంతరం విశిష్ట సేవలు అందించిన పలువురు పోలీసు అధికారులు సిబ్బందికి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు రాష్ట్ర మంత్రివర్యులు వివిధ పతకాలను   ప్రశంసా పత్రాలను అందజేశారు.


తదనంతరం  జిల్లా పోలీసు అధికారి అదనపు ఎస్పీలు జ్ఞాపికలు శాలువాలు పూల మొక్కలతో ఘనంగా మంత్రిగారిని సత్కరించారు.



ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీమతి హిమావతి శ్రీమతి చౌడేశ్వరి, సెబ్ అదనపు ఎస్పీ శ్రీమతి శ్రీలక్ష్మి శ్రీ శ్రీనివాసరావు పలువురు డిఎస్పీలు సిఐలు ఎస్సైలు పోలీస్ కానిస్టేబుళ్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తదితరులు పాల్గొన్నారు




Comments