శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుమల, ఆగస్టు 07 (ప్రజా అమరావతి): శ్రీవారి పవిత్రోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రక్తంగా అంకురార్పణం నిర్వహించారు. ముందుగా సాయంత్రం సేనాధిపతివారిని వసంతమండపానికి వేంచేపు చేసి మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత సంపంగి ప్రకారంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శ్రీవారి మూలవిరాట్ ఎదుట ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతలు కేటాయించారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment