నెల్లూరు, ఆగస్టు 19 (ప్రజా అమరావతి);
సహస్రదీపాలంకార సేవలో కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీనివాసుని కటాక్షం
- భక్తుల తన్మయత్వం
నెల్లూరులో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో నాల్గవ రోజైన శుక్రవారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవలో కాళీయమర్ధనుడి అలంకారంలో శ్రీనివాసుడు భక్తులను కటాక్షించారు. భక్తులు స్వామివారి వైభవాన్ని దర్శించి తన్మయత్వం చెందారు. చల్లటి సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో స్వామివారు ఉల్లాసంగా ఊయలలో ఊగుతూ భక్తులకు కనువిందు చేశారు. నిత్యం అవిశ్రాంతంగా భక్తులకు దర్శనభాగ్యాన్ని ప్రసాదించే స్వామివారు సహస్రదీపాలంకార సేవతో సేద తీరుతారు.
ముందుగా వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఆ తరువాత టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి భువనేశ్వరి, శ్రీ సరస్వతీ ప్రసాద్, శ్రీ కళ్యాణ కుమార్ అన్నమయ్య సంకీర్తనలు, పురందరదాస కీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఇందులో ' తిరుపతి వెంకటరమణ....., బంధనేని రంగ బంధనేని, ముద్దుగారే యశోద...., అలరచంచలమైన ఆత్మలందుండనీ అలవాటుజేసెనీ ఉయ్యాల...,' తదితర కీర్తనలున్నాయి. ఆ తరువాత మంగళవాయిద్యంతో వాద్యనీరాజనం సమర్పించారు.
సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు వేదిక చుట్టూ స్వామివారు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు. రాత్రి 8.30 నుంచి 9.00 గంటల వరకు ఏకాంతసేవ జరుగనుంది.
addComments
Post a Comment