తోడేరును మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దేందుకు కృషి


నెల్లూరు, ఆగస్టు 21 (ప్రజా అమరావతి) : తనకు జన్మనిచ్చిన తోడేరు గ్రామ రుణం తీర్చుకోవడం తన కనీస బాధ్యత అని, అన్ని మౌలిక వసతులు సమకూర్చి తోడేరును మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దేందుకు కృషి


చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 

 ఆదివారం ఉదయం పొదలకూరు మండలం   తోడేరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. 

 తొలుత తోడేరు రామాలయం పునర్నిర్మాణానికి మంత్రి దంపతులు భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. తదుపరి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. 

 ఈ సందర్భంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన తోడేరు గ్రామ సమగ్రాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తన తండ్రి కాకాణి రమణారెడ్డి హయాంలో నిర్మించిన రామాలయాన్ని టిటిడి వారి సహకారంతో రూ. 50 లక్షలతో పునర్నిర్మిస్తున్నట్లు  చెప్పారు. ఇందుకుగాను గ్రామస్తుల భాగస్వామ్యంగా రూ. 12.50 లక్షలను తన కుమార్తె కాకాణి పూజిత చెల్లించగా, రూ. 37.50 లక్షలను టిటిడి వారు శ్రీ వాణి ట్రస్ట్ నుంచి మంజూరు చేసినట్లు చెప్పారు. త్వరలోనే పనులు మొదలుపెట్టి వచ్చే శ్రీరామనవమి నాటికి నూతన రామాలయం పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. 

  అలాగే రైతులకు, గ్రామస్థులకు నాణ్యమైన విద్యుత్ ను ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలనే లక్ష్యంతో గ్రామంలో రూ. 2.60 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. మరో నాలుగైదు నెలల్లోనే ఈ విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రైతాంగానికి లోవోల్టేజీ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 

   తొలుత మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి స్థానికంగా ఉన్న తన తండ్రి రమణారెడ్డి స్మారక సదన్ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

 ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో శ్రీమతి నగేష్ కుమారి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఈవో జనార్దన్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీ విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, మండల వ్యవసాయాధికారి చైతన్య, ఆర్డబ్ల్యూఎస్, పిఆర్ ఏఈలు నాయక్, ప్రసాద్, స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. 


Comments