ఎస్సీ కార్పొరేషన్ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు


ఎస్సీ కార్పొరేషన్ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు


అధికారులకు మంత్రి మేరుగు నాగార్జున ఆదేశం


అమరావతి, ఆగష్టు 23 (ప్రజా అమరావతి): ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించిన భూముల పరిరక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్ భూములను సర్వే చేయించి వాటికి కంచెలు వేయించాలని కూడా అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన ఎస్సీ కార్పొరేషన్ అధికారుల సమావేశంలో మేరుగు నాగార్జున మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించిన భూములు ఉన్నాయని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పిఎం అజయ్ పథకం కింద ఈ ఏడాది రూ.136 కోట్లతో పలు కార్యక్రమాలను చేపట్టనున్నామని చెప్పారు. ఈ పథకంలో భాగంగానే ఎస్సీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఇన్ కం జనరేషన్ కార్యక్రమాలను చేపడతామన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో భాగంగా పలు వృత్తి విద్యలలో శిక్షణలు ఇస్తామని, ఈ శిక్షణ పొందిన వారికి తప్పనిసరిగా ఉద్యోగాలు లభించేలా చూస్తామని తెలిపారు. పిఎం అజయ్ పథకంలో భాగంగానే  ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న భూములలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే నిర్మాణ కార్యక్రమాలను కూడా చేపడతామని వివరించారు. ఎన్.ఎస్.ఎఫ్.డీ.సీ, ఎన్.ఎస్.కే.ఎఫ్.డీ.సీ, భూమి కొనుగోలు  (ఎల్పీఎస్) తదితర పథకాలకు సంబంధించిన ప్రగతిని ఈ సందర్భంగా సమగ్రంగా సమీక్షించారు. కాగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించి  17 ఎకరాల భూములు ఖాళీగా ఉన్నాయని గుర్తించడం జరిగిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ భూములు ఎక్కడా అన్యాక్రాంతం కాకుండా వాటిని సర్వే చేసి సరిహద్దులు గుర్తించి, కంచె వేయడంతో పాటు అవి ఎస్సీ కార్పొరేషన్ భూములనే విషయాన్ని తెలియజేసే విధంగా వాటిలో బోర్డులను కూడా పాతాలని అధికారులను నాగార్జున ఆదేశించారు. ఖాళీ భూములు కాకుండా గతంలో కోళ్ల పెంపకం కోసం లబ్దిదారులకు లీజు కింద ఇచ్చిన భూములు కూడా ఉన్నాయని వాటన్నింటిని కూడా ఉపయోగంలోకి తీసుకురావడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1407 పౌల్ట్రీ షెడ్ల కోసం సుమారు 594 ఎకరాల భూములను కేటాయించడం జరిగిందని, ప్రస్తుతం ఈ షెడ్లలో 1245 దాకా నిరుపయోగంగా ఉన్నాయని అధికారులు గుర్తించడం జరిగిందని నాగార్జున వెల్లడించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ఎస్సీ కార్పొరేషన్ వీసీ ఎండి ఎస్. చిన్న రాముడు, జీఎం సునీల్ రాజ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.



Comments