ఉప్పాడ/కాకినాడ, ఆగస్టు 22 (ప్రజా అమరావతి);
*చేయూత మహిళా మార్ట్‌లతో మహిళలకు ఆర్థిక భరోసా
*
- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి; పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
బూడి ముత్యాల నాయుడు
- రాష్ట్రంలోనే తొలిసారిగా ఉప్పాడలో మహిళా మార్ట్‌ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి
మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన గొప్ప ఆలోచనకు ప్రతిరూపం చేయూత మహిళా మార్టు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి; రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో రాష్ట్రంలోనే తొలిసారిగా యు.కొత్తపల్లి మండలం, ఉప్పాడలో ఏర్పాటుచేసిన చేయూత మహిళా మార్ట్‌ను సోమవారం ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు.. కాకినాడ ఎంపీ వంగా గీత, సెర్ప్ సీఈవో ఎ.ఇంతియాజ్, కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, పిఠాపురం శాసనసభ్యులు పెండెం దొరబాబు, కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి, స్త్రీనిధి ఎండీ కేవీ నాంచారయ్య, చేయూత మహిళా మార్ట్ ప్రెసిడెంట్ యు.ఎల్లేశ్వరి తదితరులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ యు.కొత్తపల్లి మండలంలోని 2,410 స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు సంఘటితమై రూ. 200 చొప్పున వాటా ధనంగా ఇచ్చి.. మొత్తం రూ. 40 లక్షల మూలధనంతో మహిళా మార్ట్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును రూ. 1.50 కోట్లకు తీసుకెళ్లనున్నారన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది, వారికి ఆర్థిక సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఈ మార్టుల్లో మార్కెట్ ధరకంటే తక్కువ ధరకే నాణ్యమైన నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయని.. బ్రాండెడ్ వస్తువులతో పాటు స్థానికంగా మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి అవుతున్న వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయని వివరించారు. తొలి దశలో జిల్లాకు రెండు చొప్పున ఇలాంటి చేయూత మహిళా మార్ట్‌లు ఏర్పాటవుతాయని.. అదే విధంగా ఇంత భారీ స్థాయిలో కాకున్నా ప్రతి మండలంలోనూ ఒక మహిళా మార్ట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో అక్కాచెల్లెమ్మల కష్టాలను చూసి.. అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సంక్షేమానికి చర్యలు చేపట్టారని.. నవరత్నాలు పథకాల ద్వారా పేదల అభ్యున్నతికి కృషిచేస్తున్నారన్నారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45-60 ఏళ్ల మహిళలకు ఏడాదికి రూ. 18,750 చొప్పున నాలుగేళ్లలో రూ. 75,000 అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండు విడతల్లో 25 లక్షల మందికి దాదాపు 9 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో జమచేసినట్లు వెల్లడించారు. కులం, మతం, పార్టీలతో ప్రమేయం లేకుండా అర్హత ఒక్కటే ప్రాతిపదికగా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ ఆసరా, కార్డుదారులకు ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు, మనబడి నాడు-నేడు, గడప గడపకు మన ప్రభుత్వం వంటి ఎన్నో పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు తెలిపారు. పేదల పిల్లలకు ఉన్నత చదువులు అందించాలనే లక్ష్యంతో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను అమలుచేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకునేందుకు, విదేశాల్లోనూ చదువు, ఉద్యోగం చేసేందుకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన చేస్తున్నట్లు తెలిపారు. ఒకటో తేదీనే గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థల ద్వారా పెన్షన్ అందించే ఏర్పాట్లు చేశారని.. మొదటి రోజే 90 శాతం మేర పెన్షన్ల పంపిణీ పూర్తవుతోందని ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు తెలిపారు.
***
కాకినాడ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా చేయూత మహిళా మార్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అహర్నిశలు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు ఇచ్చి వదిలేయకుండా.. ఆ రుణాలను సద్వినియోగం చేసుకునేలా, ఆర్థికంగా ఎదిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అనేక కార్యక్రమాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నారని, మహిళలు వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. దిశ పోలీస్ స్టేషన్లు, యాప్‌ల ద్వారా మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు.
***
కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో జిల్లాలో చేయూత మహిళా మార్టును ఏర్పాటుచేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది స్వయం సహాయక సంఘాల సభ్యులకు వివిధ పథకాల ద్వారా ఇప్పటికే రూ. 746 కోట్లు డీబీటీ ద్వారా లబ్ధి చేకూరినట్లు తెలిపారు. పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వం పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. రుణ మంజూరుతో పాటు సుస్థిర జీవనోపాధి కల్పించడం కూడా ముఖ్యమని ఈ క్రమంలోనే ఎస్‌హెచ్‌జీ మహిళలతో ఈ మార్ట్ ఏర్పాటుకు తోడ్పాడునందించినట్లు పేర్కొన్నారు. యు.కొత్తపల్లి మండలంలోని 24,521 మంది మహిళలు రూ. 200 చొప్పున తమ వాటాగా రూ. 40.72 లక్షలు పోగుచేసి.. బ్యాంకుద్వారా రూ. 20 లక్షలు రుణం తీసుకొని మొత్తం రూ. 60.72 లక్షలు సమకూర్చుకున్నట్లు వివరించారు. ఈ మార్ట్‌లో తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులు లభిస్తాయని.. ఎక్కడో కాకినాడకు వెళ్లనవసరం లేకుండా ఇక్కడే అన్ని వస్తువులు లభిస్తాయన్నారు. తాను కూడా ఈ మార్ట్‌లోనే వస్తువులు కొనుగోలు చేస్తానని.. జిల్లా అధికారులు, సిబ్బంది కూడా ఈ మార్ట్ నుంచే తమకు అవసరమైన సరుకులు కొనుగోలు చేసి స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పాటునందించాలని పేర్కొన్నారు. ఈ మార్ట్ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
***
పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గంలో చేయూత మహిళా మార్ట్‌ను ప్రారంభించినందుకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రజలకు అందుతున్నాయన్నారు. స్వయం సహాయక సంఘాల అభివృద్ధిలో చేయూత మహిళా మార్ట్ ఓ మైలురాయని శాసనసభ్యులు పేర్కొన్నారు.
***
సెర్ప్ సీఈవో ఎ.ఇంతియాజ్ మాట్లాడుతూ మహిళా సాధికారతకు సంబంధించి ఉప్పాడలో ఫిషర్‌మెన్ కమ్యూనిటీ భవనంలో
చేయూత మహిళా మార్టు ఏర్పాటు ఓ ముందడుగు అని పేర్కొన్నారు. మహిళలు అర్థికంగా ఎదిగేందుకు సెర్ప్ ఎన్నో కార్యక్రమాలు అమలుచేసినట్లు తెలిపారు. సుస్థిర ఉపాధి పొందేందుకు ముందుకొచ్చే ప్రతి మహిళకు శిక్షణ, రుణ మంజూరు, మార్కెటింగ్ వంటి వాటిలో తోడ్పాటునందించనున్నట్లు తెలిపారు. తొలి దశలో ప్రతి జిల్లాలో రెండు చొప్పున చేయూత మహిళా మార్ట్‌లు ఏర్పాటవుతాయని.. ఈ ఏడాది చివరినాటికి రాష్ట్రంలో 250 వరకు మార్ట్‌లు ఏర్పాటుచేయనున్నట్లు ఇంతియాజ్ వెల్లడించారు.
***
1,790 స్వయం సహాయక సంఘాలకు రూ. 130.33 కోట్ల సున్నా వడ్డీ రుణాలు, 28,682 మంది మహిళలకు రూ. 83.46 కోట్ల స్త్రీనిధి రుణాలుకు సంబంధించిన చెక్‌లను ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు.. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో జెడ్‌పీ వైస్ ఛైర్మన్ బుర్రా అనుబాబు, యు.కొత్తపల్లి జెడ్‌పీటీసీ జి.తులసీకుమార్, ఎంపీపీ కారే సుధా శ్రీనివాసరావు, ఉప్పాడ సర్పంచి ఉమ్మిడి మేరీజాన్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎస్‌హెచ్‌జీ మహిలు, అధికారులు తదితరులు హాజరయ్యారు.
addComments
Post a Comment