నెల్లూరు ఆగస్టు 5 (ప్రజా అమరావతి);
స్వాతంత్ర సముపార్జనలో పోరాడిన త్యాగధనుల జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు సూచించారు.
స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలలో భాగంగా 5 వ రోజైన శుక్రవారం సాయంత్రం నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తురిభా కళాక్షేత్రంలో దేశభక్తిని పెంపోందించే నాటక ప్రదర్శనలు, ఏకపాత్రాభినయాలు ఏర్పాటు చేశారు. వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్ధులు అత్యంత ఉత్సాహంతో పాల్గోని తమ ప్రతిభాపాటవాలతో దేశభక్తిని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు జిల్లాలో ఆగస్టు 1 నుండి ఉత్సాహంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటివరకు జరిగిన 4 రోజుల కార్యక్రమాల్లో గ్రామ గ్రామాన దేశభక్తిని, జాతీయతావాదాన్ని పెంపొందించేందుకు, మరుగున పడిన అమరవీరులను వెలుగులోకి తెచ్చేందుకు, స్వాతంత్ర వీరుల స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు వ్యాసరచన పోటీలు, సెమినార్లు నిర్వహించడం జరిగిందన్నారు. 5వ రోజున నాటక ప్రదర్శనలు, ఏకపాత్రాభినయాల్లో భాగంగా విద్యార్ధులు స్వాతంత్ర పోరాట ఘట్టాలను కళ్ళముందు ఆవిష్కరించిన తీరు అధ్భుతమని కొనియాడారు. ఆగస్టు 15 వరకూ ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లుగా తెలియజేస్తూ యువత ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. అదేవిధంగా ఆగస్టు 13 నుండి 15 వరకు హర్ ఘర్ తిరoగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా, జిల్లాలోని ప్రతి పౌరుడు తన ఇంటి పై జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జాతీయ జెండాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జాతీయ జెండాను ఆవిష్కరించి తమ దేశభక్తిని చాటాలన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు పేరుతో ఏర్పాటైన నెల్లూరు జిల్లా అన్నింటిలోనూ పోరాట స్ఫూర్తిని చూపుతుందన్నారు. అలాంటి స్ఫూర్తిని గుండెల నిండా నింపుకొని ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను సగర్వంగా ఆవిష్కరించాల్సిందిగా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో ఖాదీ కు ప్రత్యేక స్థానం ఉందని, ఆగస్టు 7వ తేదీన ఖాదీ దినోత్సవo సందర్భంగా రాష్ట్రస్థాయి చేనేత ఎగ్జిబిషన్ ను నగరంలోని కస్తూరి దేవి స్కూల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి చేనేత ఉత్పత్తులు ఎగ్జిబిషన్లో ఉంచడం జరుగుతుందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి సిందిగా కోరారు. అనంతరం నృత్య రూపకాలు, ఏకపాత్రాభినయంతో ఆకట్టుకున్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ అభినందించారు.
తొలుత సంగీత నృత్య కళాశాల విద్యార్ధినులు చేసిన నృత్య రూపకం ఆహుతులను ఆకట్టుకుంది. రైన్ బో స్కూల్ విద్యార్థులు స్వాతంత్ర పోరాట ఘట్టాలను ఆవిష్కరించిన తీరు పలువురిని ఆశ్చర్య చకితులను చేసింది. శిస్తు ఎందుకు కట్టాలిరా తెల్ల కుక్కా అని బ్రిటీష్ వారిని గడ లాడించిన వీర పాండ్య కట్ట బ్రహ్మన ఏకపాత్రాభినయం కూడ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ కూర్మనాథ్, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ డి హరిత, జడ్పీ సీఈఓ వాణి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్ర, ఎ పి ఎం ఐ పి పి డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment