ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశంతో వైయస్సార్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు


నెల్లూరు, ఆగస్టు 5 (ప్రజా అమరావతి): గ్రామాల్లోని ప్రజలు గ్రామ పొలిమేర దాటకుండా వారికి అవసరమైన అన్నిరకాల ప్రభుత్వ సేవలను సచివాలయ వ్యవస్థ ద్వారా అందిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

 శుక్రవారం సాయంత్రం వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామంలో పండగ వాతావరణంలో  ఒకే చోట నిర్మించిన వైయస్సార్ విలేజ్ క్లినిక్, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. 

 ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా  రాష్ట్రంలో విప్లవాత్మకంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రవేశ పెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందజేస్తున్నామని, ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశంతో వైయస్సార్ హెల్త్ క్లినిక్ లను ఏర్పాటు


చేస్తున్నామన్నారు. అనికేపల్లి గ్రామంలో సుమారు 80 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయం, వైయస్సార్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. గ్రామ సమగ్రాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ఈ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి గడపను పలకరిస్తామన్నారు. 

 అనంతరం స్థానికంగా నూతనంగా నిర్మించిన శ్రీ అంకాల పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

 ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ సుధాకర్ రాజు, జిల్లా వైద్యాధికారి శ్రీ పెంచలయ్య, ఎంపిడివో శ్రీమతి సుస్మిత, తహశీల్దారు నాగరాజ, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. 

Comments