నెల్లూరు నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు


నెల్లూరు ఆగస్టు 14 (ప్రజా అమరావతి);


నెల్లూరు నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు


నిర్వహించుకోవడం భగవత్సంకల్పం అని, జిల్లా వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు  శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు. 


ఆదివారం మధ్యాహ్నం తిరుమల తిరుపతి దేవస్థానం, వి పి ఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. రాజ్యసభ సభ్యులు, వి పి ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, న్యూఢిల్లీ శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఎల్ ఎ సి అధ్యక్షులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు జరుగుతున్న ఏర్పాట్లు గురించి మంత్రికి వివరించారు.  


అనంతరం యం పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో కలసి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, నగరంలోని లోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆగస్టు 16  నుండి 20 వరకు ఐదు రోజుల పాటు తిరుమలలో స్వామి వారికి జరిగినట్లుగానే శ్రీవారి సేవలు నిర్వహిస్తారన్నారు. శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు నాంది పలుకుతూ ముందుగా 14,15 వ తేదీలలో వేద పండితులతో ప్రవచనాలు ఉంటాయన్నారు. ఏడు సంవత్సరాల తర్వాత వైభవోత్సవాలు మరలా నెల్లూరు లో నిర్వహించుకుంటున్నామన్నారు. కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి ఐదు రోజుల పాటు నెల్లూరులోనే కొలువై ఉన్నట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. వయోవృద్ధులకు దివ్యాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు జరుగుచున్నట్లుగా, అదేవిధంగా మధ్యాహ్న సమయంలో చిన్న పిల్లలకు దర్శన భాగ్యం కల్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు వేమిరెడ్డి  ప్రశాంతి రెడ్డి ల పట్టుదలతో ఈ కార్యక్రమంను నిర్వహిస్తున్నారని, వారి సేవ నిరుపమానమన్నారు. వారికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులందరం సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వైభవోత్సవాలను అత్యంత వైభవంగా వారు మాత్రమే నిర్వహించగలరన్నారు.  ఇందుకు వారిరువురికి తమ ధన్యవాదాలన్నారు. భగవంతుని కృప కటాక్షం లేనిదే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించటం సాధ్యం కాదన్నారు. కావున జిల్లా ప్రజలందరూ స్వామి వారిని దర్శనం చేసుకొని, స్వామి వారి వివిధ సేవల్లో పాల్గోని శ్రీ వేంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు పొందవలసిందిగా మంత్రి కాకాణి సూచించారు. 


శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు నెల్లూరులో జరిగేందుకు సహకరించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి లకు తమ ప్రత్యేక ధన్యవాదాలన్నారు.  అదేవిధంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవలే రొట్టెల పండుగను బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగిందని, అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పక్కా ప్రణాళికతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో నిర్వహిస్తామన్నారు. 

Comments