విజయవాడ (ప్రజా అమరావతి);
*గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి రోజున తెలుగుభాషా దినోత్సవం*
:- *ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ*
• *29 ఆగష్టు 2022న రాష్ట్రవ్యాప్తంగా గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకలు*
• *గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి రోజున చిత్రపటానికి పుష్పాలంకరణ*
• *తెలుగు భాషాభివృద్ధికి పాటు పడుతున్న వారికి, పండితులకు, కవులకు సత్కారం చేయాలని చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచన*
ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవహారిక భాషోద్యమ నాయకుడు, తెలుగు భాషకు పట్టం కట్టిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా 29 ఆగష్టు, 2022న తెలుగు భాషా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ, రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గ్రాంథిక భాషలో కఠినంగా ఉన్న తెలుగు వచనాన్ని వ్యావహారిక భాషలోకి తీసుకువచ్చి భాషలోని అందాన్ని, వెసులుబాటును లోకానికి అందజేసిన గిడుగు రామ్మూర్తి జయంతిని ప్రతి ఏటా తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం పరిపాటి అని ఆయన అన్నారు. అదే క్రమంలో ఈ ఏడాది కూడా గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాలంకరణ చేసి ప్రతి జిల్లాల్లో తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్నవారికి, తెలుగు భాష పండితులకు, కవులకు సత్కారం చేయాలని ఆయన జిల్లా కలెక్టర్లకు సూచించారు.
గిడుగు అనగానే ప్రజలకు స్ఫురించేది వాడుక భాష గురించి చేపట్టిన మహోద్యమమే అని, ఆ ఉద్యమం ఫలితంగానే నేడు మనం పాఠశాలల్లో, సమాచార ప్రసార సాధనాల్లో, సాహిత్యంలో మాట్లాడే భాషను ఉపయోగించగలుగుతున్నామని ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ గుర్తు చేశారు. తెలుగు వ్యవహారిక భాషోద్యమ కర్తగా, పరిశోధనకర్తగా, సవర హేతువాదిగా చిరపరిచితులు, వ్యవహారిక భాషోద్యమంలో *“తెలుగు”* అనే పత్రికను నడిపి తెలుగు భాష కోసం కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు అంటే తెలుగు వాళ్లకీ, తెలుగు భాషని అమితంగా ప్రేమించే వాళ్లకీ ఆరాధ్య దైవంగా మారారని కొనియాడారు.
addComments
Post a Comment