పత్రికా సమాచార కార్యాలయం
భారత ప్రభుత్వం, విజయవాడ
*తిరుపతి తాజ్ హోటల్ లో ప్రారంభమైన రెండు రోజుల జాతీయ కార్మిక సదస్సు
*
* వర్చ్యువల్ విధానం ద్వారా ప్రారంభోపన్యాసం చేసిన ప్రధానమంత్రి *
తిరుపతి, 25 ఆగస్టు (ప్రజా అమరావతి);
భారతదేశ కార్మిక సమస్యల పరిష్కారం దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని సాధించే సంకల్పంతో కేంద్ర కార్మిక-ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ తిరుపతిలో నిర్వహించ తలపెట్టిన రెండు రోజుల జాతీయ కార్మిక సదస్సు ఘనంగా ప్రారంభమైంది. కార్మిక, ఉపాధికల్పన, పర్యావరణం, అటవీశాఖల కేంద్ర గౌరవ మంత్రి శ్రీ భూపీందర్ యాదవ్ ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమ ప్రారంభంలో సదస్సును ఉద్దేశించి అంతర్జాల వేదిక ద్వారా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.
కార్మిక, ఉపాధికల్పన, పర్యావరణం, అటవీశాఖల కేంద్ర గౌరవ మంత్రి శ్రీ భూపీందర్ యాదవ్ మరియు కార్మిక, ఉపాధికల్పన, పెట్రోలియం, సహజ వాయుశాఖల కేంద్ర గౌరవ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో దేశంలోని 25 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన కార్మిక శాఖ మంత్రులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో ఉన్న అధునాతన సాంకేతికతల వివరాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ప్రారంభించారు.
కార్మికులకు సార్వత్రిక సామాజిక రక్షణ, అందరికీ మెరుగైన ఉపాధి అవకాశాలే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రస్తుతం అమలులో ఉన్న సామాజిక భద్రతా పథకాల సమన్వయం కోసం ఈ-శ్రమ్ పోర్టల్ ఏకీకరణ ఇతివృత్తంతో తొలి సమావేశం జరిగింది. కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సూచనలు, ప్రదర్శనల(ప్రజెంటేషన్స్)కు చోటు కల్పించటంతో పాటు ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమాన్ని నిర్వహించారు.
addComments
Post a Comment