చదువు – పేదరికం నుంచి బయటపడే విప్లవాత్మక మార్పు


బాపట్ల (ప్రజా అమరావతి);


*జగనన్న విద్యా దీవెన.*

*పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ – క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లింపులు.*


*ఏప్రిల్‌ – జూన్‌ 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్ధులకు రూ.694 కోట్లను బాపట్లలో బటన్‌ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:* 


*ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ రక్షా బంధన్‌ శుభాకాంక్షలు...*

రాఖీ పండగ (రక్షా బంధన్‌) సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ ప్రతి కుటుంబ సభ్యుడికీ నిండు మనస్సుతో రాఖీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఈ రోజు మంచి రోజు. దేవుడి దయతో 11.02 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. వారికి సంబంధించిన ఫీజులు రూ.35వేలు, రూ.50వేలు, రూ.70 వేలు, రూ 1 లక్ష, అంతకన్నా ఎక్కువైనా  మొత్తంగా పూర్తిగా 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ కాలం పూర్తయిన వెంటనే తల్లుల అకౌంట్లలో డబ్బు జమ చేసే కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. కార్యక్రమంలో భాగంగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.694 కోట్లు నేరుగా జమ చేస్తున్నాం. 


*అనురాగానికి ప్రతీక....*

రక్షా బంధనము అన్నది ఆత్మీయతలు, అనురాగాలకు ప్రతీక. అక్కచెల్లెమ్మలకు అందరికీ కూడా ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యా, రక్షణ పరంగానూ అన్ని విషయాల్లోనూ మీ అన్న ప్రభుత్వంలో ఈ మూడు సంవత్సరాలుగా మంచి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అక్కచెల్లెమ్మల చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నాను. 


ఈ పండగ రోజున నా అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల భవిష్యత్‌ కోసం మన ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకం గత మూడు నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్‌ నెలల కాలానికి సంబంధించిన 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.694 కోట్లు ఇవాళ విడుదల చేస్తున్నాను. 


*చదువు – పేదరికం నుంచి బయటపడే విప్లవాత్మక మార్పు*


ఏ బిడ్డకైనా అతిగొప్ప దీవెన ఏదైనా ఉంటుందంటే అది చదువే. ఏ బిడ్డకైనా తప్పనిసరిగా అందాల్సింది ఏదైనా ఉందంటే అది చదువే. చదవు అన్నది ఒక ఆస్తి. ఏ ఒక్కరూ కూడా కొల్లగొట్టలేని ఆస్తి. పేదరికం నుంచి బయటకు వచ్చే గొప్ప విప్లవాత్మక మార్పు ఒక్క చదువులు ద్వారానే సాధ్యమవుతుంది. 

ఈ రోజున కాలేజీలలో 17 నుంచి 22 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు కనీసంగా మరో 80 సంవత్సరాలు ఈప్రపంచంలో రాబోయే సవాళ్లను ఎదుర్కొంటూ సంతోషంగానూ, ఆత్మవిశ్వాసంతోనూ జీవించాలి. *మార్పుతో పాటే మన ప్రయాణం...* 

అందుకు ప్రభుత్వంగా మనం తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. మనమంతా ఒక్కసారి ఆలోచన చేయాలి. పది సంవత్సరాల కిందట మనం ఎలాంటి ప్రపంచాన్ని చూశాం. పదేళ్ల క్రిందట మన కుటుంబం ఎలా ఉండేది. మీరు మీ కుటుంబం, మన దేశం, ఈ ప్రపంచం 20 సంవత్సరాల తర్వాత మన బ్రతుకులు ఎలా ఉంటాయి అన్నది ఎవరికైనా చెప్పగలగాలి అంటే....ఊహకందని విషయం.

అంత వేగంగా మార్పులు జరుగుతున్నాయి. అంత వేగంగా జరుగుతున్న మార్పుతో పాటు ప్రయాణం చేయకపోతే... మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడలేరు. ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రతి అఢుగులోనూ మార్పు కనిపించాలి. అప్పుడే మార్పు సాధ్యమవుతుంది. అలాంటి చదువులు ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలని, పేదరికంలో ఉన్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలు, ఇతర కులాల్లో కూడా పేదకుటుంబాల నుంచి వచ్చిన ఆ బిడ్డలు... వీళ్లంతా అటువంటి పెద్ద చదువులు చదువుకోవాలని మనందరి ప్రభుత్వంగా, మీ అందరి అన్నగా కోరుకుంటూ గత మూడు సంవత్సరాలుగా విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. 


*పెద్ద చదువులు కూడా పేదల హక్కుగా...*

అందులో భాగంగానే కేవలం ప్రాధమిక విద్యను మాత్రమే కాకుండా.. పెద్ద చదువులన్నీ కూడా పేదలకు హక్కుగా మారుస్తూ వందశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఫీజులు  రూ.30, 40, 50,70 వేలు నుంచి రూ.1 లక్ష ఆ పైన ఉన్నా కూడా మీరు వెళ్లి చదవండి. మీ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు అంటే అందరినీ చదివిస్తాను. 

రేషన్‌ విధించి ఒక్కరికే ఇస్తామన్న మాట చెప్పడం లేదు. 


కారణం ఏమిటంటే.. మన తలరాతలు మారాలంటే, బ్రతుకులు మారాలంటే ఈ చదువులు ప్రతి ఒక్కరు చదువుకోవాలి. అప్పుడే మారుతాయి. ఇంకో విషయం కూడా చెప్పాలి. 28 రాష్ట్రాలలో ఏఒక్క రాష్ట్రంలో కూడా లేని విధంగా.... ఈ పథకం ఈ రోజు మన రాష్ట్రంలో అమలవుతోంది.


*తలరాతలు మార్చాలనే...* 

మారుతున్న తరంతో పాటు ఇంతకాలం మారని తలరాతలు కూడా మార్చాలన్న గొప్ప ప్రయత్నం ఈరోజు ఆంధ్రరాష్ట్రంలో జరుగుతోంది.  పేదరికం అన్నది పెద్ద చదువులు చదవడానికి అడ్డంకిగా ఉండకూడదు అని, పేదల మీద  మమకారంతో గొప్ప ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతుంది. ప్రతి తల్లి, తండ్రి కూడా ఖర్చుకు వెనుకాడకుండా మీ బిడ్డలను మీరు బాగా చదివించండి. మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా ఫర్వాలేదు వారందరినీ చదివించండి. వారికి తోడుగా మీ అన్న ఉంటాడు అని బాధ్యత తీసుకున్న అన్నగా, తమ్ముడుగా మీ ఇంటి మనిషిగా తెలియజేస్తున్నాను.*ప్రతి ఇంటినుంచి ఇంజనీరో, డాక్టరో, కలెక్టరో రావాలి...*

ప్రతి ఇంటి నుంచి ఒక గొప్ప ఇంజనీర్‌ బయటకు రావాలి. ఒక గొప్ప డాక్టర్, కలెక్టర్‌ వంటి  పెద్ద పెద్ద చదువులు చదివిన నా పిల్లలు బయటకు రావాలి. వారి తలరాతలు మారాలి. అందుకోసమే పెద్దచదువులను ప్రోత్సహిస్తూ పూర్తిగా 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 

ఇలా క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి, ఆ మూడు నెలలు పూర్తికాగానే అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు నేరుగా జమ చేస్తున్నాం. 

2022 ఏప్రిల్, మే, జూన్‌ మూడు నెలలకు సంబంధించి 11.02 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ... 100శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తూ.. రూ.694 కోట్లు తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. 


*గత ప్రభుత్వ బకాయిలూ చెల్లించాం...*

గత ప్రభుత్వం దిగిపోయేమందు ఎగ్గొట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు 2017–18, 2018–19 కు సంబంధించి రూ.1778 కోట్లు. ఆ పెద్ద మనిషి(చంద్రబాబునాయుడు) ఎగ్గొట్టి పోయినా మన పిల్లల కోసం, మన భవిష్యత్‌ కోసం ఆ పిల్లలకు కట్టాల్సిన బకాయిలు కూడా చిరునవ్వుతో కట్టాను. ఈ కాలేజీకి కూడా అదే మాదిరిగానే ఆ బకాయిలు రూ.14 కోట్లు మనమే చెల్లించాం. 


పిల్లల గురించి వారి చదువులు గురించి అంతలా ఆలోచన చేస్తున్న ప్రభుత్వం మనది. 

ఒక్క జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన ఈ రెండు పథకాలకు సంబంధించిన మాత్రమే ఈ మూడు సంవత్సరాల కాలంలో రూ.11,715 కోట్లు అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం.

జగనన్న విద్యాదీవెన మాత్రమే కాకుండా వసతి దీవెన కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి సంవత్సరానికి రెండు దఫాలుగా  ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న పిల్లలకు రూ. 20వేలు, పాలిటెక్నిక్‌ పిల్లలకు రూ.15వేలు, ఐటీఐ పిల్లలకు రూ.10వేల వరకు ఇస్తున్నాం.


*ఏ ఒక్కరూ అప్పులు పాలు కాకూడదనే....*

ఇలా రూ.20వేల వరకు సంవత్సరానికి రెండు దఫాలుగా జగనన్న వసతి దీవెన కింద ఇస్తున్నాం. కారణం ఏ అక్క, ఏ చెల్లెమ్మ వారి కుటుంబాలు, పిల్లలను చదివించుకునే కార్యక్రమంలో ఏ ఒక్కరూ అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదనే.  ఏఒక్కరు కూడా ఇళ్లు పొలాలు అమ్ముకునే పరిస్థితి రాకూడదు, ఆ పిల్లల తలరాతలు మారాలి, పిల్లలకు చదువులు హక్కుగా రావాలి, వారి బ్రతుకులు మారాలి అన్న గొప్ప ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది.


*విద్యా రంగంలో గొప్ప మార్పులు...*

మన పిల్లల చదువులతోనే మీ ఇంటింటా వెలుగులు నింపాలన్న మంచి సంకల్పంతో ఒక్క విద్యారంగంలోనే గొప్ప మార్పులు తీసుకువచ్చాం. 

జగనన్న అమ్మఒడి, వైయస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, మనబడి నాడు–నేడు, ఇంగ్లిషు మీడియం, బైజూస్‌తో ఒప్పందం ఇవి మాత్రమే కాకుండా ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా కరిక్యులమ్‌లో కూడా మార్పులు చేశాం. ఇవాళ కరిక్యులమ్‌లో 30–40 శాతం స్కిల్‌ ఓరియెంటెడ్‌గా, జాబ్‌ ఓరియెంటెడ్‌గా మార్పులు తెచ్చాం.


ప్రతి డిగ్రీ చదువుతున్న పిల్లలకు పదినెలలపాటు కంపల్సరీ ఇంటర్న్‌షిప్‌ తీసుకొచ్చాం. ఆన్‌లైన్‌లో రకరకాల వర్టికల్స్‌ తీసుకొచ్చాం. మైక్సోసాప్ట్‌తో ఒప్పందాలు కుదుర్చుకుని 1.60 లక్షల మందికి వాళ్లతో శిక్షణతో పాటు సర్టిఫికేట్స్‌ ఇప్పించాం. రాబోయే తరంలో కాలే జీలు అవ్వగానే ఉద్యోగాలు సులభంగా వచ్చే విధంగా కరిక్యులమ్‌లో మార్పులు తీసుకొచ్చాం. ఇలా విద్యారంగంలో తీసుకున్న ప్రతి మార్పు వెనుక, అందుకోసం చేస్తున్న వేల కోట్ల రూపాయల ఖర్చు వెనుక మీ పిల్లల భవిష్యత్‌ పట్ల మనందరి ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప బాధ్యత కనిపిస్తుంది.


*మూడేళ్లలో చదువులపై రూ.53 వేల కోట్లు...*.

మూడు సంవత్సరాల కాలంలో ఒక్క విద్యారంగం మీద, అది కూడా నేను చెప్పిన ఈ పథకాల మీద మాత్రమే.. రూ.53 వేల కోట్లు ఖర్చు పెట్టాం.

ఒక్క జగనన్న అమ్మఒడి పథకానికే రూ.19,618 కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లో వేశాం. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కోసం రూ.11,715 కోట్లు, గోరుముద్దకు రూ.3,117 కోట్లు, జగనన్న విద్యా కానుకకు రూ. 2324 కోట్లు, వైయస్సార్‌ సంపూర్ణ పోషణంకు రూ.4895 కోట్లు ఖర్చు చేశాం. మన బడి నాడు నేడు కింద ఇవాళ కడుతున్న బడులు మీకు కనిపిస్తున్నాయి. ఇంతవరకు పెట్టిన ఖర్చు, ఈ సంవత్సరం అయ్యేసరికి పెట్టబోతున్న ఖర్చు రెండూ కలిపితే రూ.11,669 కోట్లు. ఇవన్నీ కలిపితే రూ.53,338 కోట్లు ఒక్క విద్యారంగం మీద ఖర్చు చేస్తున్నాం. 


*ఈ ఖర్చంతా పిల్లల భవిష్యత్‌ కోసమే....*

ఇంతలా ఎందుకు ఖర్చు చేస్తున్నామంటే.. మన పిల్లల భవిష్యత్‌ బాగుండాలని ఆరాటపడుతున్నాం. మనం అమలు చేస్తున్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల వల్ల 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయస్సు ఉండి కాలేజీల్లే చేరుతున్నవారి సంఖ్య (జీఈఆర్‌) గణనీయంగా పెరుగుదల నమోదు చేయాలని తపన, తాపత్రయంలో అడుగులు వేస్తున్నాం. 

మనమంతా బ్రిక్స్‌(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా) దేశాలతో పోటీ పడతాం. 18 నుంచి 23 సంవత్సరాల వయస్సులో కాలేజీలో ఉన్నవారి సంఖ్య ఆదేశాలలో చూస్తే.. బ్రెజిల్‌లో అయితే 55 శాతం, రష్యాలో 86 శాతం, చైనాలో 58 శాతం, ఇండియాలో అయితే కేవలం 29 శాతం. దీన్ని 2035 నాటికి మన రాష్ట్రంలో 70 శాతం తీసుకుని పోయే విధంగా అడుగులు వేయబోతున్నాం. దానికోసమే విద్యాదీవెన, వసతి దీవెన అన్న పథకాలను తీసుకువస్తున్నాం. 


2018–19తో పోల్చితే 2019–20లో జీఈఆర్‌ 8.64 శాతం పెరగగా...  జాతీయ స్ధాయిలో ఇది కేవలం 3.04 శాతం మాత్రమే పెరిగింది. కారణం ఈ రాష్ట్రంలో అమలవుతున్న పథకాల వల్లనే సాధ్యమయింది. ఇదే సమయంలో ఆడపిల్లలకు సంబంధించి రాష్ట్రంలో జీఈఆర్‌ 11.03శాతం వృద్ధి నమోదు కాగా.... ఇదే దేశ వ్యాప్తంగా కేవంల 2.28 శాతం వృద్ధి మాత్రమే కనిపిస్తోంది. 

ఎస్సీ విద్యార్ధులకు సంబంధించి 2018–19తో పోల్చితే 2019–20లో రాష్ట్రంలో 7.5 శాతం జీఈఆర్‌ పెరగగా.... దేశం మొత్తం మీద ఈ పెరుగుదల కేవలం 1.7 శాతం మాత్రమే. 

ఎస్టీ విద్యార్ధులకు సంబంధించిన జీఈఆర్‌ పెరుగుదల  రాష్ట్రంలో 9.5 శాతం కాగా.. జాతీయ స్ధాయిలో అది కేవలం 4.7శాతం మాత్రమే నమోదు అయింది. ఇలా ప్రతి అడుగులో ఒక మంచి ఉద్దేశ్యం కనిపిస్తోంది.


*గిట్టని వాళ్లు హేళన చేస్తున్నా....*

ఇవాల చాలామంది అమ్మఒడి అనే పథకాన్ని హేళన చేస్తూ కూడా గిట్టని వాళ్లు మాట్లాడుతున్నారు.. జగన్‌ అక్కచెల్లెమ్మలకు డబ్బులు ఉదారంగా ఇచ్చేస్తున్నాడు అంటున్నారు. జగన్‌ మాదిరి పాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అని వెటకారంగా కూడా మాట్లాడుతున్నారు. 


*గత పరిస్థితి చూస్తే....* 

2018లో ప్రాధమిక విద్యలో మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్, సెంట్రల్‌ గవర్నమెంట్‌ కొన్ని కాగితాలను విడుదల చేసింది. వాటి ప్రకారం ప్రాధమిక విద్యలో జీఈఆర్‌ రాష్ట్రంలో 84.48 శాతం ఉంటే... దేశం మొత్తం సరాసరి 99 శాతం. అంటే దేశంతో కన్నా ఏపీ తక్కువగా కనిపిస్తోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే... మన రాష్ట్రం అట్టడుగున ఉన్న రాష్ట్రాలతో పోటీపడుతుంది కానీ పైనున్న రాష్ట్రాలతో పోటీ పడలేదు. 


*ఇలాంటి స్థితిలో పిల్లలకు తోడుగా ఉండాలనే...*

ఇటువంటి పరిస్థితుల్లో నా పిల్లలను చదివించాలి, దేశంతో పోటీపడే విధంగా పెరగాలి అనే ఉద్దేశ్యంతో ఆ పిల్లలను బడికి పంపించేందుకు తల్లులకు తోడుగా ఉండేందుకు... అమ్మఒడి అనే పథకం ఆ ఉద్దేశ్యంతో తీసుకొచ్చి తలరాతలు మార్చే ప్రయత్నం జరుగుతోందని... ఈ రోజు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెపుతున్న పెద్ద మనుషులుకు తెలియజేస్తున్నాను.


*తేడా మీరే గమనించండి....*

మీరంతా ఒక్కవిషయం ఆలోచన చేయండి. ఈ రోజుకి, అప్పటికీ తేడా గమనించమని అడుగుతున్నాను.

అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌. అప్పులు గ్రోత్‌ రేట్‌ చూస్తే.. గత పాలనలో 19 శాతం సీఏజీఆర్‌ ఉంటే, మన హయాంలో అప్పుల గ్రోత్‌ రేటు అంతకన్నా తక్కువ 15 శాతం మాత్రమే. 

మరి అలాంటప్పుడు తేడా ఏమిటి అంటే కేవలం ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే మారాడు.

గతంలో వాళ్లు ఎందుకు చేయలేకపోయారు. మరి ఇప్పుడు మీ అన్న, మీ తమ్ముడిగా ఇప్పుడు ఎందుకు చేయగలుగుతున్నారో ఆలోచన చేయండి.


*నేడు డీబీటీ....*

 కారణం... మీ అన్న, మీ తమ్ముడు నేరుగా బటన్‌ నొక్కుతున్నాడు. ఆ డబ్బులు నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లిపోతున్నాయి. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డైరెక్ట్‌‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా జమ అవుతుంది.


*నాడు డీపీటీ....*

గతంలో జరిగిన స్కీం ఏమిటో తెలుసా.. కేవలం నలుగురు కోసం మాత్రమే. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక చంద్రబాబు వీరికి తోడు ఒక దత్తపుత్రుడు. వీరు మాత్రమే దోచుకో.. పంచుకో.. తినుకో(డీపీటీ) పథకం. 

ఇదే గతానికి ఇప్పటికీ తేడా. ఈనాడు పేపర్‌ చదివినా, ఆంధ్రజ్యోతి, టీవీ5 చూసినా వాళ్లు పడుతున్న కడుపుమంట మీకు  కనిపిస్తుంది. ఆ కడుపుమంటకు కారణం ఏమిటంటే.. గతంలో వాళ్లు బాగా దోచుకునే వాళ్లు... పంచుకునేవాళ్లు. 

మనం వచ్చిన తర్వాత దోచుకోవడం లేదు, పంచుకోవడం లేదు. కాబట్టి.. జీర్ణించుకోలేని పరిస్థితులలో వీళ్ల కడపుమంట కనిపిస్తోంది.


*నాకున్నవి ప్రజల దీవెనలు, దేవుడి దయ*

నాకు వీళ్ల మాదిరిగా ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు. ఆంధ్రజ్యోతి అండగా లేకపోవచ్చు. టీవీ 5 నాతో పాటు అడుగులు వేయకపోవచ్చు. దత్తపుత్రుడి సపోర్టు నాకు ఉండకపోవచ్చు. 

కానీ నాకున్నది వారికి లేనిది ఏమిటో తెలుసా ? 

దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు అని మాత్రం కచ్చితంగా చెపుతాను. మీ చల్లని దీవెనలు, ఆ దేవుడి ఆశీస్సులు ఈ రెండూ ఉన్నంతవరకూ మీ జగన్‌ మీ కోసం ఎన్ని అడుగులు అయినా వేస్తాడు. దేవుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు మన ప్రభుత్వం పట్ల చల్లగా ఉంటూ మంచి చేసే అవకాశాలు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. 


కాసేపటి క్రితం డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి మాట్లాడుతూ... బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి అడిగారు. జిల్లా కేంద్రంగా చేయడం, జిల్లాగా మారడం, వైద్య కళాశాల రావడం ఇప్పటికే మంచి పనులు కనిపిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ కోసం అడిగారు. దీనికోసం  50 ఎకరాలు కేటాయిస్తూ నాంది పలుకుతున్నాం. బాపట్ల నగరానికి అడిషనల్‌ సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ కోసం మరో రూ.18 కోట్లు అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నాను. 

బాపట్ల మున్సిపాల్టీలో మౌలిక సదుపాయాల కోసం మరో రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నాం.


*చివరిగా....*

అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

Comments