గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది.


నెల్లూరు (ప్రజా అమరావతి);



గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను  అమలుచేస్తూ


,   వారి సమగ్రాభివృద్దికి  నిరంతరం కృషి చేస్తున్నదని  రాష్ట్ర వ్యవసాయ,  సహకార,  మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు  శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  పేర్కొన్నారు.


మంగళవారం ఉదయం  ఆంధ్రప్రదేశ్  సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ   ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర  కస్తూర్భా కళాక్షేత్రంలో  జరిగిన  ప్రపంచ ఆదివాసి దినోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ,  సహకార,  మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా గిరిజనుల అభివృద్ది, సంక్షేమానికి  కృషి చేసిన డా.బి.ఆర్.అంబేడ్కర్,   శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గార్ల చిత్రపటాలకు  మంత్రి    శ్రీ గోవర్ధన్ రెడ్డి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సంధర్భంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ,  సమాజంలో అణగారిన వర్గాలు ముఖ్యంగా గిరిజనుల అభ్యున్నతికి కృషి చేసిన డా. బి.ఆర్.అంబేడ్కర్, శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య లాంటి ఎంతో మంది మహనీయులను స్మరించుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై వుందన్నారు. సుమారు 26 లక్షల జిల్లా జనాభాలో 9 శాతం మంది గిరిజనులు ఉండగా,  వీరు  అక్షరాస్యతలో 40 శాతం మాత్రమే ఉండటం  బాధాకరమని అన్నారు. నేడు జిల్లాలో గిరిజనుల విద్య కోసం అనేక గురుకుల, ఆశ్రమ పాటశాలలు నడుపబడు తున్నాయన్నారు.  గిరిజన పిల్లలు  నైపుణ్యంలో ఎవరికి తీసిపోరని, గిరిజన పిల్లల్లోని సృజనాత్మకతను గుర్తించి వారికి సరైన శిక్షణ ఇచ్చినట్లైతే వారు ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నారు. సమాజంలో మాకు ఇది కావాలని  గట్టిగా అడగలేని వర్గం ఏదైనా వుందంటే అది యానాది వర్గమని, ఆ వర్గ అభివృద్దికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మంత్రి తెలిపారు.  గిరిజన వర్గానికి చెందిన వారికి  ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి  శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు. గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి అండగా నిలుస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.  కోవిడ్ సమయంలో సర్వేపల్లి నియోజక వర్గ పరిధిలోని గిరిజన కాలనీల్లో చాలా మంది గిరిజన కుటుంబాలకు ఆధార్ కార్డు లేకపోవడంతో  కోవిడ్ సహాయం అందించలేకపోవడంతో తన సొంత నిధులతో వారికి సహాయం చేయడం జరిగిందన్నారు. ప్రతి గిరిజన కాలనీల వద్ద మొబైల్ ఆధార్ నమోదు  కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారికి ఆధార్ కార్డు వచ్చేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నియోజక వర్గ పరిధిలో 2,700 గిరిజన కుటుంబాలకు ఇల్లు మంజూరు చేయడం జరిగిందని,  ప్రభుత్వం మంజూరు చేసే ఆర్ధిక సహాయం కాకుండా ప్రతి ఇంటికి 15 వేల రూపాయలు సి.ఆర్ ఎస్. నిధులు నుండి మంజూరు చేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి  తెలిపారు


నెల్లూరు నగర మేయర్ శ్రీమతి పోట్లూరి స్రవంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గిరిజానాభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. సమాజంలో గిరిజనులు ఆర్ధికాబివృద్ది సాధించి ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ప్రతి ఒక్క గిరిజన కుటుంబం ప్రభుత్వ పధకాలను సక్రమంగా సద్వినియోగం చేసుకున్నప్పుడే అది సాధ్యమౌతుందన్నారు.  చాలా గిరిజన కుటుంబాలు అవగాహన లేక చిన్న చిన్న కారణాల వలన   ఆధార్ కార్డులను తీసుకోలేక  పోవడంతో, ఆయా కుటుంబాలకు  ప్రభుత్వ పధకాలు అందడం లేదని అన్నారు.  


తొలుత ఐటిడిఏ పిఓ డా. మందా రాణి,   జిల్లాలో  సమీకృత గిరిజనాభివృద్ది  సంస్థ ఆధ్వర్యంలో గిరిజనుల అభివృద్ది, సంక్షేమానికి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను సవివరంగా తెలియచేసారు.


అనంతరం స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ కె.వి. చలమయ్య దంపతులను,  మరో స్వతంత్ర్య సమరయోధులు శ్రీ చల్లా గుర్నాధం తరపున వారి కుటుంబ సభ్యులను  శాలువ తో సత్కరించుకోవడం జరిగింది.


ముందుగా వివిధ గురుకుల, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.


 తొలుత ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా  ఆంధ్రప్రదేశ్  సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ   ఆధ్వర్యంలో ఐటిడిఏ  కార్యాలయం నుండి  శ్రీ వెంకటేశ్వర కస్తూర్భా కళాక్షేత్రం వరకు  జిల్లా అధికారులు, ఉద్యోగులు,  విద్యార్ధులు జాతీయ జెండాతో పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, జడ్పి సి.ఈ.ఓ శ్రీమతి వాణి, డిపిఓ శ్రీమతి ధనలక్ష్మి,  సెట్నల్ సిఈఓ శ్రీ పుల్లయ్య, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ శ్రీమతి ఉషారాణి, సోషల్ వెల్ఫేర్ డిడి శ్రీమతి రమాదేవి, ఐసిడిఎస్ పిడి శ్రీమతి ఉమామహేశ్వరి,  డిస్ట్రిక్ట్ బిసి వెల్ఫేర్ అధికారి శ్రీ వెంకటయ్య,  ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శ్రీమతి పరిమళ,  ఎపిఎంఐపి పిఓ శ్రీ శ్రీనివాస రెడ్డి, మైనారిటీ వెల్ఫేర్ అధికారి శ్రీమతి కనక దుర్గా భవాని, వివిధ గిరిజన సంఘాల నాయకులు శ్రీ పెంచలయ్య,  శ్రీ రామ చంద్రయ్య,  శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ సుబ్బారావు, శ్రీ సంజీవయ్య, విద్యార్ధులు, గిరిజన ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



Comments