ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డిని కలిసిన 'బీఈఎల్' ప్రతినిధుల బృందం*ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డిని కలిసిన 'బీఈఎల్' ప్రతినిధుల బృందం*


*'భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్' పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ఛైర్మన్ హామీ*


అమరావతి, ఆగస్ట్, 06 (ప్రజా అమరావతి): ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డిని 'భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్'  పరిశ్రమ ప్రతినిధుల బృందం  కలిశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో సమావేశమై 'బీఈఎల్' సమస్యలను ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చి చర్చించారు. 2016లో అనంతపురం జిల్లా పాలసముద్రం వద్ద బీఈఎల్ ఆధ్వర్యంలో రాడార్ టెస్ట్ బెడ్ ఫెసిలిటీ , రక్షణ రంగ ఉత్పత్తుల (మిస్సైల్ మానుఫాక్చరింగ్) యూనిట్ కోసం ఏపీఐఐసీ  914 ఎకరాల భూములను కేటాయించినట్లు  బీఈఎల్ డైరెక్టర్ పార్థసారధి వెల్లడించారు.  గత ప్రభుత్వంలో అనుమతుల విషయంలో జరిగిన జాప్యం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామని ఛైర్మన్ కి వివరించారు. ఇప్పటికే ప్రహరీ గోడ, రోడ్లు వంటి పనులు పూర్తి చేసుకున్నప్పటికీ పెట్టుబడులు పెట్టేందుకు బీఈఎల్ బోర్డుకు కొన్ని షరతులున్నాయని డైరెక్టర్ తెలిపారు. ఆ అంశాలను పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్యావరణ అనుమతులు సహా అన్ని అనుమతులు వచ్చాయన్నారు. అదే విధంగా ఏపీఐఐసీ భూములకు సంబంధించిన నిబంధనలను సడలించాలని కోరుతూ ఛైర్మన్ కి వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రాన్ని పరిశీలించి ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం సహా ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం అంశాలను పరిగణలోకి తీసుకుని పరిష్కారానికి ప్రయత్నిస్తామని ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి సానుకూలంగా స్పందించారు.


ఈ కార్యక్రమంలో  భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ పార్థసారధి, జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, ఏజీఎం శ్రీధర్, సీనియర్ డీజీఎం రమేష్, డీజీఎం అభిషేక్ హెగ్డె తదితరులు పాల్గొన్నారు.Comments