హైకోర్టులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు-జాతీయ జెండాను ఎగురవేసిన సిజె

 హైకోర్టులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు-జాతీయ జెండాను ఎగురవేసిన సిజె


అమరావతి,15 ఆగస్టు (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో సోమవారం స్వాతంత్ర్య దినోత్స వేడుకలు ఘనంగా జరిగాయి.ఈకార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ ఈ 75ఏళ్ళ కాలంలో దేశం అనేక రంగాల్లో ఘణనీయమైన అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు.స్వాతంత్ర్య దినోత్సవ వేళ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు.మన జాతీయ జెండాతో మనకు చాలా అనుబంధం ఉందని అందుకే ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కింద ప్రతి ఇంటా మువ్వన్నెల జెండాను ఎగురవేసి జాతీయ జెండాతో మనకున్న అనుబంధాన్ని సాటిచెప్పుకుంటున్నామని పేర్కొన్నారు.భారత స్వాతంత్ర్యానికి ప్రతీకగా మన రాజ్యాంగం నిలిచిందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు.రాజ్యాంగంలో వివిధ నిబంధనలు,ప్రాధమిక హక్కులు మన ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఆధారంగా నిలిచాయని పేర్కొన్నారు.స్వాతంత్ర్య పోరాటంలో మన న్యాయవ్యవస్థ నుండి అనేక మంది తమ వంతు పాత్రను పోషించారని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు.దేశానికి తమవంతు సేవలందించేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ వారు చేసే పనిలో చిత్తశుద్ధి అంకిత భావాలతో పనిచేసి జాతి నిర్మాణంలో తమవంతు కృషి చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆకాంక్షించారు.

ఈకార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ మాట్లాడుతూ భారత దేశం స్వాతంత్ర్యానంతరం అనేక రంగాల్లో ఘణనీయమైన అభివృద్ధి సాధించి అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు.స్వాతంత్ర్య ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాల్సిన అవసరం ఉందని ఈవిషయంలో మనకు మనం పునరంకితులం కావాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు మాట్లాడుతూ ఆనాటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలింతగా నేడు మనం స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నామని పేర్కొన్నారు.సమాజంలోని అన్నివర్గాల ప్రజలకు ఈఫలాలు సమానంగా అందాల్సిన అవసరం ఉందని తెలిపారు.స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తయినా ఇంకా సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఇంకా పూర్తి అవకాశాలు అందాల్సి ఉందని చెప్పారు.రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానకిరామి రెడ్డి మాట్లాడుతూ హైకోర్టులో సిబ్బంది కొరతతో కేసులు ధాఖలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కావున తగిన సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తికి ఆయన విజ్ణప్తి చేశారు.

అంతకు ముందు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్నిస్వీకరించారు.ఈకార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యులు,అదనపు సొలిసిటర్ జనరల్ హరినాధ్, పలువురు రిజిష్ట్రార్లు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు,ఇతర నాయాధికారులు,హైకోర్టు బార్ కౌన్సిల్ మరియు బార్ అసోసియేషన్లకు చెందిన న్యాయవాదులు,హైకోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

     

Comments