నెల్లూరు, ఆగస్టు 17 (ప్రజా అమరావతి);
నెల్లూరులో శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం
నెల్లూరులో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో రెండవ రోజైన బుధవారం ఉదయం శ్రీనివాసునికి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.
నెల్లూరులోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, ఉదయం 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించారు.
సహస్రకలశాభిషేకం : ఉదయం 8.30 నుంచి 10.00 గంటల వరకు
భోగశ్రీనివాసమూర్తితోపాటు, శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ శ్రీనివాసస్వామి వారికి వెయ్యి కలశాలతో సహస్రకలశాభిషేకం నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఉత్తరాభిముఖంగా ఉంచి, భోగశ్రీనివాసమూర్తిని తూర్పుముఖంగా ఉంచారు. మూలమూర్తి నుండి భోగ శ్రీనివాసమూర్తికి పట్టుదారం కట్టి ఉంచారు.
పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనము తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. విశేషహోమం నిర్వహించారు. అనంతరం నైవేద్యం సమర్పించి భక్తులను ఆశీర్వదించారు. సహస్ర(1000) కలశాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు కావున, ఈ సేవకు 'సహస్ర కలశాభిషేకం' అనే పేరు ఏర్పడింది. ఈ సహస్రకలశాభిషేకం ఉత్తమోత్తమ అభిషేక విధానమని ఆగమశాస్త్రంలో పేర్కొనబడింది.
అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు తోమాలసేవ, అర్చన, రెండో నివేదన, శాత్తుమొర నిర్వహించారు. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది.
రేపటి ప్రత్యేక సేవ....
వైభవోత్సవాల్లో భాగంగా ఆగస్టు 18న గురువారం ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు తిరుప్పావడ సేవ జరుగనుంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, న్యూఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ, ఎవిఎస్వో శ్రీ నారాయణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
addComments
Post a Comment