ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించడం శుభ పరిణామమo

 

నెల్లూరు, ఆగస్టు 6 (ప్రజా అమరావతి):  తాము సంపాదించిన ధనంలో కొంతమేరయినా సమాజంలోని మంచి పనులకు ఉపయోగించాలనే గొప్ప లక్ష్యంతో మనుబోలు ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి దాతలు సహకరించడం శుభ పరిణామమ


ని, ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలతో పాటు తమ వంతు సమాజాభివృద్ధికి తోడ్పాటనందిస్తున్న దాతలు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి కొనియాడారు. 

 శనివారం ఉదయం మనుబోలు అంబేద్కర్ నగర్లో స్థానిక నాయకులు బొమ్మిరెడ్డి పార్థీశ్వరరెడ్డి, బొమ్మిరెడ్డి చైతన్య రెడ్డి వారి తల్లి బొమ్మిరెడ్డి వనజాక్షమ్మ జ్ఞాపకార్థం సుమారు మూడు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తిచేసిన ప్రాథమిక పాఠశాలను మంత్రి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గతంలో సర్కార్ బడులు అంటే చిన్నచూపు చూసేవారని, సరైన మౌలిక వసతులు లేకపోవడం,  స్లాబ్ ముక్కలు పెచ్చులూడి పడడం చాలా దయనీయ స్థితిలో పాఠశాలలు ఉండేవని, దీంతో కూలి పనులు చేసుకునే పేదలు కూడా తమ బిడ్డలను ప్రైవేటు స్కూల్లో చేర్పించేవారన్నారు. అలాంటి దుర్భర పరిస్థితుల నుంచి నేడు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కెే దక్కిందన్నారు. అమ్మ ఒడి, నాడు నేడు, జగనన్న గోరుముద్ద వంటి అనేక సంక్షేమ పథకాలతో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి అరుదైన ఆలోచనలతో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి విద్యాభివృద్ధికి సీఎం కృషి చేస్తున్నారన్నారు.  ఒక్క మనుబోలు మండలంలోనే నాడు నేడు పథకం రెండు విడతల్లో కలిపి సుమారు రూ 11 కోట్లతో పలు పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇంకా మిగిలి ఉన్న పాఠశాలల్లో కూడా మూడో విడతలో పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మనుబోలు ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను మంత్రి ప్రత్యేకంగా అభినందించి, వీరు చేసిన సహాయం మూడు లక్షల రూపాయలే అయినా అది మూడు కోట్ల రూపాయలతో సమానమని, వీరిని ఆదర్శంగా తీసుకుని సమాజంలో మంచి పనులకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రూ 12 లక్షలతో ఈ పాఠశాలను నాడు నేడు పథకం కింద పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. 

 ఈ కార్యక్రమంలో మనుబోలు ఎంపీపీ శ్రీమతి వజ్రమ్మ, సర్పంచ్ కంచి పద్మమ్మ, ఎంపీడీవో శ్రీ వెంకటేశ్వర్లు, తాసిల్దార్ సుధీర్, పలువురు ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. 


Comments